Let's talk: editor@tmv.in
గవర్నర్​ అధికారాలపై పుస్తకం

గవర్నర్​ అధికారాలపై పుస్తకం

Pinjari Chand
25 సెప్టెంబర్, 2025

గవర్నర్​ అధికారాలపై ప్రస్తుతం అనేక వివాదాలు నెలకొంటున్న సమయంలో కేరళ విద్యాశాఖ రాష్ట్రంలోని 10వ తరగతి విద్యార్థులకు సాంఘిక శాస్త్రంలోని రెండో భాగంలో గవర్నర్​ అధికారాలు, కేంద్ర–రాష్ట్ర సంబంధాలపై ప్రత్యేకంగా ఓ పుస్తకాన్ని విడుదల చేసింది. గవర్నర్ పదవి ఎన్నుకున్నది కాదని, ఎంపిక చేసినదని అలాగే వివిధ పార్టీలు రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు గవర్నర్​ వివాదాలను ఏ విధంగా సృష్టిస్తారన్న వివరాలున్నాయి. అలాగే గవర్నర్​ పేరుకు మాత్రమే రాష్ట్రానికి అధినేత అని, రాష్ట్ర కార్యనిర్వాహక అధికారం సీఎంకి ఉంటుందని, మంత్రి వర్గ సలహాల మేరకు పని చేస్తారని ఈ పుస్తకం వివరిస్తుంది.

పండుగ సమయాల్లో సంప్రదాయ దుస్తులు ధరించవచ్చు

గతంలో పండుగ సమయాల్లో కూడా పాఠశాలల్లో యూనిఫాం ధరించి రావాల్సి ఉండేదని, ఇప్పుడు అలా లేదని కేరళ విద్యా శాఖ మంత్రి వి.శివన్​ కుట్టి తెలిపారు. ఓనం, రంజాన్​, క్రిస్మస్​ తదితర పండుగ రోజుల్లో విద్యార్థులు వారి సంప్రదాయం ప్రకారమే పాఠశాలకు రావచ్చని, అందుకు సంబంధించి ఉత్తర్వులను ఇప్పటికే ఇచ్చామని తెలిపారు. దీని వల్ల పిల్లల్లో పండుగ స్పూర్తి, సాంస్కృతిక వైవిధ్యం పట్ల గౌరవం పెరుగుతుందన్నారు.

పాఠశాలల్లో ‘రక్షామిత్రం’

ఎవరైనా విద్యార్థులు ఏదైనా విషయంపై, సమస్యపై ప్రత్యక్షంగా ఉపాధ్యాయులను కలిసి ఫిర్యాదు చేయలేకపోతే అటువంటి వారు ఓ పేపర్​ పై రాసి స్కూల్ లో ఉండే హెల్ప్ బాక్స్​ లలో వేయవచ్చని మంత్రి శివన్​ కుట్టి తెలిపారు. ఆగష్టు 10న ప్రారంభించిన ఈ కార్యక్రమం విజయవంతంగా అమలవుతుందన్నారు. ఈ విధానాన్ని అమలు పరిచిన సాధారణ విద్యా విభాగానికి కృతజ్ఞతలు తెలిపారు. దీని ద్వారా పిల్లలపై జరిగే దారుణాలు కూడా వెలుగులోకి వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

గవర్నర్​ అధికారాలపై పుస్తకం - Tholi Paluku