
గల్వాన్ నిజాల భయం.. ‘మెమోయర్’కు అడ్డంకి : రాహుల్ గాంధీ
2020లో చైనాతో జరిగిన సరిహద్దు ఘర్షణ సమయంలో భారత సైన్యాన్ని రాజకీయ నాయకత్వం నిరాశపరిచిందని ప్రధాని నరేంద్ర మోడీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లపై ఆరోపణలు ఉన్నాయని పేర్కొంటూ, ఆ వ్యాఖ్యలు మాజీ ఆర్మీ చీఫ్ ఎంఎం నరవణే రాసిన పుస్తకంలో ఉన్నందునే తనను లోక్‌సభలో వాటిని చెప్పనివ్వడం లేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సోమవారం ఆరోపించారు. పార్లమెంట్ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడిన లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, మాజీ ఆర్మీ చీఫ్ పుస్తకంలోని ఒక లైను ప్రభుత్వాన్ని భయపడుతోందని, అది బయటకు వస్తే ప్రధాని, రక్షణ మంత్రి నిజ స్వరూపం బయటపడుతుందని వ్యాఖ్యానించారు. నరవణే జీ తన పుస్తకంలో ప్రధాని , రాజ్‌నాథ్ సింగ్‌ల గురించి స్పష్టంగా రాశారు. ఆ విషయాలు ఇప్పటికే ఒక వ్యాసంలో ప్రచురితమయ్యాయి. నేను ఆ వ్యాసం నుంచే ఉటంకిస్తున్నాను. చైనా మన ఎదుటకు వచ్చి ముందుకు సాగినప్పుడు 56 అంగుళాల ఛాతీ ఏమైంది? అని రాహుల్ ప్రశ్నించారు. లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడేందుకు లేచిన సమయంలో ఈ వివాదం తలెత్తింది. మాజీ ఆర్మీ చీఫ్ స్మృతిగ్రంథం (మెమోయర్) నుంచి వ్యాఖ్యలు చెప్పేందుకు ఆయన ప్రయత్నించగా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు బీజేపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. దీంతో సభలో గందరగోళం ఏర్పడి, సభను రెండుసార్లు వాయిదా వేసిన అనంతరం రోజంతా వాయిదా వేశారు. ఈ సందర్భంగా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా రాహుల్‌కు ఆ అంశాన్ని ప్రస్తావించేందుకు అనుమతి నిరాకరించారు. అయితే రాహుల్ వెనక్కి తగ్గకపోవడంతో, ప్రతిపక్ష నేతలు ఆయనకు మద్దతుగా నిలిచారు.
ప్రభుత్వం ఎందుకు భయపెడుతోంది
అంతకు ముందు రాహుల్ గాంధీ మాట్లాడటం ప్రారంభిస్తూ, తనకు ముందు మాట్లాడిన బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య చేసిన జాతీయవాదంపై ఆరోపణలకు సమాధానం ఇవ్వాలనుకుంటున్నానని చెప్పి, నరవణే స్మృతిగ్రంథం నుంచి వ్యాఖ్యలు చదవడం ప్రారంభించారు. దీనిపై రాజ్‌నాథ్ సింగ్ తీవ్రంగా అభ్యంతరం తెలుపుతూ, ఆ పుస్తకం ప్రచురితమైందా లేదా అని స్పష్టత కోరారు. తరువాత మీడియాతో మాట్లాడిన రాహుల్ నాకు కేవలం రెండు మూడు లైన్లు చెప్పాలి. అవే అన్నీ వెల్లడిస్తాయి. కానీ మాట్లాడనివ్వడం లేదు. ఇది జాతీయ భద్రతకు సంబంధించిన విషయం. ఇవి సైన్యాధిపతి మాటలు. ప్రధాని, రక్షణ మంత్రితో ఆయన జరిపిన సంభాషణల గురించే ఈ వ్యాఖ్యలు. వారు ఏ ఆదేశాలు ఇచ్చారో చెప్పడమే నా ఉద్దేశం. అయితే దీనికి ప్రభుత్వం ఎందుకు భయపడుతోందో అర్థం కావడం లేదని అన్నారు. చైనాతో ఒక్క అంగుళం భూభాగం కూడా కోల్పోలేదన్న నరవణే వ్యాఖ్యలపై స్పందించిన రాహుల్ భూమి పోయిందా లేదా అన్నది వేరే విషయం. అసలు ప్రశ్న – దేశ నాయకత్వం ఏ దిశానిర్దేశం చేసింది? దేశ నాయకుడు బాధ్యత నుంచి తప్పించుకోకూడదు. కానీ ప్రధాని అదే చేశారని ఆరోపించారు.
పుస్తకాన్ని ప్రచురించనివ్వడం లేదు
ఇది ఆర్మీ చీఫ్ దృష్టికోణమని పేర్కొన్న రాహుల్, ఆయన పుస్తకాన్ని ప్రచురించనివ్వడం లేదు. అది నిలిచిపోయింది. ఇది సైన్యాధిపతి అభిప్రాయం. దానిని చెప్పేందుకు ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది? దీనివల్ల ప్రధాని, రక్షణ మంత్రి గురించే కాదు, సైన్యం ఎలా రాజకీయ నాయకత్వం చేతిలో నిరాశకు గురైందో కూడా తెలుస్తుందని అన్నారు. ఇదిలా ఉండగా, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా మాట్లాడుతూ, తన సోదరుడు చెబుతున్న విషయాలకు ఆధారాలు ఉన్నాయని, ప్రచురితమైన మూలాల నుంచి ఉటంకించేందుకు నిబంధనలు అనుమతిస్తాయని స్పష్టం చేశారు. రాహుల్ ప్రస్తావించిన అంశం ఇప్పటికే ఒక వ్యాసంలో ప్రచురితమైందని ఆమె పేర్కొన్నారు.
రాహుల్ గాంధీ–రాజ్‌నాథ్ సింగ్ మధ్య తీవ్ర వాగ్వాదం
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా సోమవారం లోక్‌సభలో తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. భారత మాజీ సైన్యాధ్యక్షుడు జనరల్ ఎం.ఎం. నరవణే రాసినట్లు చెప్పబడుతున్న ప్రచురితం కాని మెమాయర్‌కు సంబంధించిన అంశాలను ఉటంకించేందుకు ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ప్రయత్నించడంతో, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బీజేపీ ఎంపీ తేజస్వీ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ స్పందించారు. ఈ క్రమంలో ఆయన, మాజీ సైన్యాధ్యక్షుడు జనరల్ నరవణే మెమాయర్ నుంచి ఉటంకిస్తూ మాట్లాడతానని చెప్పారు.
రాహుల్ గాంధీ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ దేశభక్తిపై ఆరోపణలు చేశారు. అందుకే ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్నాను. ఇది సైన్యాధ్యక్షుడు నరవణే మెమాయర్‌లోని విషయం. ఎవరు దేశభక్తులు? ఎవరు కాదో దీని ద్వారా తెలుస్తుందని అన్నారు. డోక్లామ్ ప్రాంతంలో నాలుగు చైనా ట్యాంకులు భారత భూభాగంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఘటనకు సంబంధించిన వివరాలు ఆ మెమాయర్‌లో ఉన్నాయని ఆయన తెలిపారు. తాను ఒక మ్యాగజైన్ కథనం ఆధారంగా మాట్లాడుతున్నానని స్పష్టం చేశారు.
నిబంధనలకు విరుద్ధం
అయితే, నరవణే మెమాయర్ ఇప్పటివరకు ప్రచురితం కాలేదని, అలాంటి పుస్తకం నుంచి సభలో ఉటంకించడం నిబంధనలకు విరుద్ధమని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ ఉటంకిస్తున్న పుస్తకం ప్రచురితమైందా? కాకపోతే దాన్ని సభ ముందు ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా జోక్యం చేసుకుని, ప్రచురితం కాని పుస్తకాలు, పత్రికా కథనాలను సభలో చదవడానికి అనుమతి లేదని స్పష్టం చేశారు. అయినప్పటికీ ప్రతిపక్ష సభ్యులు రాహుల్ గాంధీకి మాట్లాడే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేయగా, అధికార పక్ష సభ్యులు సభ నిబంధనల ఉల్లంఘన జరుగుతోందని అభ్యంతరం తెలిపారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ స్పీకర్ ఇప్పటికే నిర్ణయం ఇచ్చారు. సభలో చర్చలు నిబంధనల ప్రకారమే జరగాలి. స్పీకర్ ఆదేశాలను పాటించని సభ్యుల విషయంలో ఏం చేయాలన్నదానిపై కూడా చర్చించాల్సి ఉంటుందని అన్నారు. ఈ వాగ్వాదం సుమారు 30 నిమిషాల పాటు కొనసాగింది. ఈ సందర్భంగా సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ రాహుల్ గాంధీకి మద్దతు తెలుపుతూ చైనాకు సంబంధించిన అంశం చాలా సున్నితమైనది. ప్రతిపక్ష నాయకుడికి మాట్లాడే అవకాశం ఇవ్వాలని అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఈ చర్చలో జోక్యం చేసుకున్నారు.
బడ్జెట్ సమావేశాల్లో అధ్యక్షుడి ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై మొత్తం 18 గంటల చర్చకు సమయం కేటాయించారు. ఈ చర్చకు ప్రధాని నరేంద్ర మోడీ ఫిబ్రవరి 4న సమాధానం ఇవ్వనుండగా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 11న స్పందించనున్నారు.
