
గల్లీ గల్లీ కాదు ప్రతి ఇంటికి వెళ్లి ప్రచారం చేస్తా: రేవంత్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం గాంధీ భవన్‌లో గురువారం టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఉపాధి హామీ పథకం విషయంలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కార్యాచరణను ఆయన ప్రకటించారు.
కేంద్రంపై రేవంత్ రెడ్డి ధ్వజం
నాడు యూపీఏ ప్రభుత్వం మహాత్మా గాంధీ పేరుతో ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకాన్ని మోదీ ప్రభుత్వం బలహీనపరుస్తోందని సీఎం విమర్శించారు. పథకం పేరు మార్చి, దాని అసలు ఉద్దేశాన్ని నీరుగార్చి పేదలకు అన్యాయం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పథకాన్ని పాత పద్ధతిలోనే పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ పోరాటానికి సిద్ధమైందని తెలిపారు.
పోరాట కార్యాచరణ ఇదే:
కేంద్రం తెచ్చిన కొత్త చట్టానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసిందని గుర్తు చేస్తూ, క్షేత్రస్థాయిలో చేపట్టబోయే కార్యక్రమాలను వివరించారు.
జనవరి 20 నుండి 30 వరకు రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో గ్రామ సభలు ఏర్పాటు చేసి, కేంద్రం తెచ్చిన మార్పులకు వ్యతిరేకంగా తీర్మానాలు చేయాలి. ఫిబ్రవరి 3 నుండి 9 వరకు తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించి కేంద్ర వైఖరిని ఎండగట్టడం.
మున్సిపల్ ఎన్నికలే లక్ష్యం
వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పని చేయాలని రేవంత్ రెడ్డి తన ఎక్స్ ఖాతా ద్వారా కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
"కార్యకర్తల కష్టం వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చాం. ఇప్పుడు కార్యకర్తలను గెలిపించాల్సిన బాధ్యత మాపై ఉంది. వారి విజయం కోసం గల్లీ గల్లీ కాదు.. ప్రతి ఇంటికీ వెళ్లి ప్రచారం చేస్తాను" అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
