
గల్ఫ్ ప్రాంతాల నుంచి క్షేమంగా స్వదేశాలకు చేరుకుంటున్న ఏపీ వాసులు
పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో అక్కడికి వెళ్లిన తెలుగు ప్రజలు మెల్లమెల్లగా స్వదేశానికి చేరుకుంటున్నారు. ఈ క్రమంలోనే నిన్నటి వరకు 500 మందికి పైగా స్వదేశానికి చేరుకున్న ఏపీ వాసుల సంఖ్య 2000లకు పెరిగిందిని ఆంధ్రప్రదేశ్ నోన్-రెసిడెంట్ తెలుగు సొసైటీ (ఏపీఎన్‌ఆర్‌టీఎస్) అధ్యక్షుడు డా. రవికుమార్ పి. వేమూరు వెల్లడించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గల్ఫ్ ప్రాంతంలోని మారుతున్న పరిస్థితులను రాష్ట్ర ప్రభుత్వం, ఏపీఎన్‌ఆర్‌టీఎస్ విభాగం నిరంతరం పర్యవేక్షిస్తోందని స్పష్టం చేశారు.
ఇజ్రాయెల్, ఇరాన్ అమెరికా మధ్య నెలకొన్న ఘర్షణ వాతావరణం కారణంగా పశ్చిమాసియా లో అస్థిరత ఏర్పడింది. ఈ క్రమంలో పర్యాటక ఇతర స్వల్పకాలిక వీసాలపై వెళ్లిన తెలుగు వారు తిరిగి రావడానికి ప్రాధాన్యత ఇచ్చారు. వీరిలో అత్యధికులు సొంతంగా విమాన టిక్కెట్లు బుక్ చేసుకుని రాగా చిక్కుకుపోయిన మరికొందరిని భారత ప్రభుత్వ సహకారంతో ప్రత్యేక ఏర్పాట్ల ద్వారా తరలించినట్లు వేమూరు వివరించారు. ప్రస్తుతం బహ్రెయిన్‌లో ఇంకా 70 మంది తెలుగు వారు ఉన్నారని వారి ప్రయాణ ఏర్పాట్లు పూర్తయ్యాయని మరో రెండు రోజుల్లో వారు కూడా స్వదేశం చేరుకుంటారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
కాగా అదృష్టవశాత్తూ ఈ ఉద్రిక్తతల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఏఒక్కరికీ ఎటువంటి ప్రాణనష్టం, గాయాలు కాలేదని ఏపీఎన్‌ఆర్‌టీఎస్ నిర్ధారించింది. అక్కడ ఉన్న తెలుగు వారు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారని ప్రభుత్వ యంత్రాంగం వారితో నిరంతరం టచ్‌లో ఉందని తెలిపారు. అయితే యుద్ధం గనుక దీర్ఘకాలం కొనసాగి విమాన సర్వీసులు, రవాణా మార్గాలు పూర్తిగా మూతపడితే గల్ఫ్ దేశాల్లో స్థిరపడిన లక్షలాది మంది తెలుగు కార్మికుల ఉపాధిపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
అయితే ప్రస్తుతానికి గల్ఫ్ దేశాల ప్రభుత్వాలు మరియు అక్కడి ప్రైవేట్ కంపెనీలు విదేశీ కార్మికుల భద్రత విషయంలో సానుకూలంగా స్పందిస్తున్నాయని వారికి పూర్తి రక్షణ కల్పిస్తున్నాయని రవికుమార్ తెలిపారు. ఏవైనా అత్యవసర పరిస్థితులు తలెత్తితే సహాయం అందించేందుకు ఏపీఎన్‌ఆర్‌టీఎస్ హెల్ప్‌లైన్ నంబర్లు నిరంతరం అందుబాటులో ఉంటాయని విదేశాల్లో ఉన్న తెలుగు వారు భయాందోళనలకు గురికావద్దని ఆయన భరోసా ఇచ్చారు.
