
గిరి బలిజ జీవో రద్దు చేయాలి
రాష్ట్ర ప్రభుత్వం దొమ్మరుల సామాజిక గుర్తింపు మార్చి గిరి బలిజలకు జీవో5ను విడుదల చేయడాన్ని తీవ్రంగా ఖండించిన రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షుడు చందు జనార్దన్, దీన్ని తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దశాబ్దాలుగా పరిష్కారం కనుక్కోని కాపు బీసీ రిజర్వేషన్ సమస్యకు దీక్ష చేస్తానని ప్రకటించారు. శుక్రవారం విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కులాల మధ్య విభేదాలు సృష్టించి బలిజలపై కక్ష తీర్చుకోవాల్సిన అవసరం కూటమి పెద్దలకు ఎందుకని ప్రశ్నించారు.
కాపు, తెలగ, బలిజ, ఒంటరి, తూర్పు కాపు, మున్నూరు కాపు వర్గాల సమస్యలపై దశలవారీ ఉద్యమ కార్యాచరణ రూపొందించినట్టు చందు జనార్దన్ తెలిపారు. అన్ని జిల్లాల్లో పర్యటనలు, సమావేశాలు, రౌండ్ టేబుల్ చర్చలు నిర్వహిస్తామని చెప్పారు. కాపులు పెద్ద పాత్ర పోషించి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకువచ్చినా, ఇప్పుడు వారిని చిన్నచూపు చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో తీర్మానాలు తీసుకుని, కాపు తెలగ బలిజ ఒంటరి కులాలకు ప్రత్యేక బీసీ రిజర్వేషన్ కల్పించాలని, సమస్యల పరిష్కారానికి జిల్లా, డివిజన్, మండల స్థాయి సమావేశాలు, విజయవాడ, రాయలసీమ, ఉత్తరాంధ్రలో బహిరంగ సభలు నిర్వహిస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో కాపు వర్గాలపై జరిగే దాడులను అరికట్టాలని, కృష్ణా జిల్లాకు, ఐకాన్ బ్రిడ్జ్‌కు స్వర్గీయ వంగవీటి మోహన రంగా పేరు పెట్టాలని, కృష్ణదేవరాయలు జయంతిని ప్రభుత్వం ఆధికారికంగా జరుపుకోవాలని కోరారు. కాపు కార్పొరేషన్‌కు ప్రతి సంవత్సరం రూ.3,000 కోట్లు మంజూరు చేయాలని, రెండు ఎకరాల్లో కాపు భవనాల నిర్మాణం పూర్తి చేయాలని, కూటమి ప్రభుత్వం రాజకీయ, నామినేటెడ్ పదవుల్లో కాపులకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కాపు ఉద్యోగస్తులకు పోలీస్, రెవెన్యూ శాఖల్లో ప్రాధాన్యత పోస్టింగులు ఇవ్వాలని, ఉద్యోగుల అణచివేతపై దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ నుంచి ఏపీలోకి వచ్చిన 7 ముంపు మండలాల మున్నూరు కాపు కుటుంబాల సమస్యలు పరిష్కరించాలని, ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ మహిళలకు 40 శాతం సబ్సిడీని కాపు, తెలగ, బలిజ, ఒంటరి మహిళలకు అమలు చేయాలని, ఓబీసీ 22 శాతాన్ని సవరించాలని కోరారు. రాజధాని అమరావతిలో కాపు భవనానికి 5 ఎకరాలు కేటాయించాలని, స్వాతంత్య్ర సమరయోధుడు కన్నెగంటి హనుమంతు, కృష్ణదేవరాయలు భారీ విగ్రహాలను అమరావతిలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సీనియర్ నాయకుడు ఆకుల శ్రీనివాస్ మాట్లాడుతూ దేశంలో అగ్రస్థానంలో ఉన్న వంగవీటి మోహనరంగా వంటి నాయకులకు గౌరవంగా కృష్ణా జిల్లాకు ఆయన పేరు పెట్టాలని కోరారు. కాపు ఉద్యోగ జేఏసీ నాయకుడు సోమారౌతు రామకృష్ణ కూడా కాపు ఉద్యోగస్తుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
