
గ్రూప్-1పై లేని సమస్య సృష్టిస్తున్నారు
గ్రూప్-1 పరీక్షలపై మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఖండించారు. గ్రూప్-1 ఉద్యోగాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో రాకూడదని కేటీఆర్ కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. నిరుద్యోగుల కోసం సీఎం రేవంత్ రెడ్డి చిత్తశుద్ధితో పని చేస్తున్నారని చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. తల్లిదండ్రులు, పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ముందుకెళ్తున్నామని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం కేటీఆర్ పరీక్షల్లో 563 అభ్యర్థుల దగ్గర రూ.3 కోట్ల లెక్కన తీసుకొని ప్రభుత్వం వాళ్లను ఎంపిక చేసిందని అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. గత బీఆర్ఎస్ హయాంలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తే బీఆర్ఎస్ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని, తెలిపారు. న్యాయనిపుణుల సలహాలు తీసుకుని, ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డంకులు రావద్దన్న సదుద్దేశంతో గ్రూప్-1 పరీక్షలు నిర్వహించామని గుర్తుచేశారు. 563 మంది అభ్యర్థుల తల్లిదండ్రులందరికీ మూడు కోట్లు పెట్టే స్థోమత ఉంటుందా? అని ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్కు ఓటేయని ప్రజలు బాధపడుతూ ఉండాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారని చెప్పుకొచ్చారు.
రాజకీయ ప్రయోజనం తప్ప ప్రజల మీద బీఆర్ఎస్ నేతలకు ప్రేమ లేదని పేర్కొన్నారు. బీఆర్ఎస్ కు ప్రజలు ఎన్నికలో మరోసారి బుద్ది చెప్పాలి అన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న కేటీఆర్కి.. గ్రూప్-1కు ఎంపికైన అభ్యర్థుల తల్లిదండ్రులు మీడియా ముందుకొచ్చి బుద్ది చెప్పాలని అన్నారు. శనివారం కేటీఆర్ మాట్లాడిన మాటల్లో.. ప్రజలకు నిజం తెలియాలంటే 563 గ్రూపు-1 అభ్యర్థుల తల్లిదండ్రులు స్పందించాలని ఆయన కోరారు. ఆదివారం తాను మాట్లాడిన తర్వాత తక్షణమే వారెక్కడుంటే అక్కడ నుంచి వీడియోలు చెయ్యాలని చామల పిలుపునిచ్చారు. తమ ఆర్థిక స్థోమతను వీడియోలో వివరించాలని కోరారు. ఇది పార్టీ సమస్య కాదని, మన బిడ్డల సమస్య అని స్పష్టం చేశారు. అందరూ రోడ్డు మీదికి రావాలని, ప్రెస్మీట్లు పెట్టాలని సూచించారు. అప్పుడే బీఆర్ఎస్కు ఓ గుణపాఠం అవుతుందని పేర్కొన్నారు.
