Let's talk: editor@tmv.in
గిరిజన వారపు సంతల్లో వైద్య శిబిరాలు

గిరిజన వారపు సంతల్లో వైద్య శిబిరాలు

FL - SIMHCLM
22 సెప్టెంబర్, 2025

పార్వతీపురం మన్యం జిల్లాలోని మారుమూల ప్రాంత ప్రజలకు గిరిజన వారపు సైతం వైద్యాన్ని మరింత చేరువ చేసేందుకు సంతల్లో వైద్య శిబిరాలను నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకరరెడ్ది వైద్యాధికారులను ఆదేశించారు. సంతలకు విచ్చేసే ప్రజల ఆరోగ్య అవసరాల మేరకు రక్త పరీక్షలను నిర్వహించాలని అన్నారు. రక్త పరీక్షల్లో వ్యాధులు నిర్ధారణ అయితే వారికి ఉచిత వైద్యంతో పాటు మందులను సరఫరా చేయాలన్నదే తన ఉద్దేశ్యమని కలెక్టర్ తెలిపారు. వాటితో పాటు సీజనల్ వ్యాధులైన మలేరియా, టైఫాయిడ్, చికెన్ గున్యా వంటి వ్యాధులు రాకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ఇందుకు గాను జిల్లాలో గల 11 మండలాల్లోని 20 ప్రదేశాల్లో సంతలు జరుగుతున్నాయని, ఆయా సంతల్లో వైద్య శిబిరాలను సోమవారం నుంచి నిర్వహించాలని పేర్కొన్నారు. వైద్య శిబిరానికి రోగులు విచ్చేసేలా ముందుగా గ్రామ, మండల స్థాయిలో తెలియపరచాలని కలెక్టర్ ఆదేశించారు.

సోమవారం రోజున పాలకొండ మండలంలోని నవగాం, కురుపాం మండలంలోని నీలకంఠా పురం, సీతంపేట మండలంలో సీతంపేటలో వైద్య శిబిరాలు నిర్వహించాలని అన్నారు. మంగళవారం నాడు సాలూరులోని నేరెళ్ల వలస, జి.ఎల్.పురం లోని తాడికొండ, కురుపాంలోని మొండెంకల్లు ప్రాంతాల్లో శిబిరాలు ఏర్పాటుచేయాలని తెలిపారు. బుధవారం రోజున పాచిపెంట మండలంలోని నాందేడువలస, సీతంపేటలోని మర్రిపాడు, జి.ఎల్.పురం మండలంలోని జి.ఎల్.పురంలో నిర్వహించాలన్నారు. గురువారం నాడు పార్వతీపురంలోని మార్కెట్ యార్డు వద్ద, మక్కువ మండలం లోని దుగ్గేరు, కురుపాంలోని ప్యాలెస్ రోడ్డు వద్ద శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు.

శుక్రవారం రోజున బలిజిపేటలోని సంత తోట, పాచిపెంట మండలంలోని వేటగానివలసలో.. శనివారం నాడు మక్కువలోని నంద, జి.ఎల్. పురం మండలంలోని గోరాడ, సీతానగరంలోని మార్కెట్ వద్ద, సీతంపేటలోని కుసిమి, సాలూరులోని తోనాం బస్టాండ్ వద్ద ఈ శిబిరాలను నిర్వహించి ప్రజలకు అనారోగ్యం లేకుండా చూడటమే కాకుండా అవగాహన కల్పించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

గిరిజన వారపు సంతల్లో వైద్య శిబిరాలు - Tholi Paluku