Let's talk: editor@tmv.in
‘గమోసా’పై బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోంది: ఖర్గే

‘గమోసా’పై బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోంది: ఖర్గే

Pinjari Chand
28 జనవరి, 2026

రాహుల్ గాంధీకి సంబంధించిన ‘గమోసా’ వివాదంపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మంగళవారం బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తప్పుడు ప్రచారం ద్వారా రాహుల్ గాంధీ ప్రతిష్టను దెబ్బతీయాలని అధికార పార్టీ ప్రయత్నిస్తోందని, అయితే అందులో ఎప్పటికీ విజయం సాధించలేదని ఆయన స్పష్టం చేశారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇచ్చిన ‘ఎట్ హోం’ కార్యక్రమంలో అతిథులకు అందించిన అస్సామీ సంప్రదాయ వస్త్రం ‘గమోసా’ను రాహుల్ గాంధీ ధరించలేదని బీజేపీ ఆరోపించడంతో ఈ రాజకీయ వివాదం చెలరేగింది. ఈశాన్య భారత సంస్కృతిని గాంధీ అవమానించారని, అలాగే రాష్ట్రపతి పట్ల నిర్లక్ష్యం చూపారని బీజేపీ ఆరోపించింది. అయితే కాంగ్రెస్ ఈ ఆరోపణలను ఖండిస్తూ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా ‘పట్కా (స్కార్ఫ్)’ ధరించలేదని గుర్తుచేసింది. ఈ అంశంపై ఖర్గే మాట్లాడుతూ, “ఇది పూర్తిగా అబద్ధం. రక్షణ మంత్రి గానీ, బీజేపీ అధ్యక్షుడు గానీ గమోసా ధరించలేదు. రాహుల్ గాంధీ గమోసాను ధరించి, భోజనం చేస్తున్న సమయంలో తీసి చేతిలో పెట్టుకున్నారు. అయినా ఆయన్ను ఈశాన్య భారత సంస్కృతిని అవమానించారని ప్రచారం చేస్తున్నారు. నిజానికి ఆ సంస్కృతిని నాశనం చేయాలనుకుంటున్నది వారే” అని విమర్శించారు.

తప్పుడు ప్రచారంతో రాహుల్ ఇమేజ్ ను దెబ్బతీయలేరు

రాహుల్ గాంధీ ఈశాన్య రాష్ట్రాల కళాకారులందరినీ కలిసి కరచాలనం చేశారని, అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన ఓ కళాకారుడిని గౌరవపూర్వకంగా ఆలింగనం కూడా చేసుకున్నారని ఖర్గే తెలిపారు. దీనికి సంబంధించిన ఫోటోలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. “తప్పుడు ప్రచారంతో రాహుల్ గాంధీ ఇమేజ్‌ను దెబ్బతీయాలని చూస్తున్నారు. కానీ వారు ఎప్పటికీ విజయం సాధించలేరు. దీనికి నేను ప్రత్యక్ష సాక్షిని” అని ఆయన పేర్కొన్నారు. అదే సమయంలో గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా తమను, రాహుల్ గాంధీని మూడవ వరుసలో, పిల్లల వెనుక, సహాయ మంత్రుల పక్కన కూర్చోబెట్టడం ద్వారా ప్రభుత్వం అవమానించిందని ఖర్గే ఆరోపించారు. దీనిపై ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ, తాను ఇద్దరూ గమోసా ధరించామని, భోజనం సమయంలో దానిని తీసి టేబుల్‌పై ఉంచుకున్నామని ఆయన వివరించారు. బీజేపీ నేతలే గమోసా ధరించలేదని విమర్శించారు.

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ రాహుల్ గాంధీ నుంచి ‘బేషరతుగా క్షమాపణ’ కోరిన ఒక రోజు తర్వాత ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు. గమోసా లేదా సంప్రదాయ ‘పట్కా’ ధరించకపోవడం ఈశాన్య భారత ప్రజలను తీవ్రంగా బాధపెట్టిందని, అది ప్రాంతీయ సాంస్కృతిక వారసత్వానికి అవమానమని సీఎం హిమంత ఆరోపించారు. ఇదిలా ఉండగా, కొన్ని మీడియా కథనాలను ఉటంకిస్తూ బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా సోమవారం ఎక్స్‌లో, “సిగ్గుచేటు! రాహుల్ గాంధీ ఈశాన్య భారతాన్ని అవమానించారు. రాష్ట్రపతిని కూడా అగౌరవపరిచారు” అని పోస్టు చేశారు. దీనికి ప్రతిగా కాంగ్రెస్ మీడియా, ప్రచార విభాగం అధిపతి పవన్ ఖేరా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఫోటోను ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ, ‘పట్కా’ ధరించనందుకు ఆయనను కూడా అస్సాం ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పమంటారా? అని ప్రశ్నించారు.