Let's talk: editor@tmv.in
గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో అగ్నిప్రమాదం

గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో అగ్నిప్రమాదం

Dantu Vijaya Lakshmi Prasanna
29 అక్టోబర్, 2025

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో ఉన్న గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటన అక్టోబర్ 28 మంగళవారం ఉదయం కస్టమ్స్ అధికారుల గదిలో సంభవించినట్లు సమాచారం. మొదట ఈ మంటలు ఇమ్మిగ్రేషన్ విభాగంలో చెలరేగి, ఆపై కస్టమ్స్ కార్యాలయం పక్క భాగాలకు వ్యాపించి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఉన్నట్టుండి మంటలు చెలరేగడంతో విమానాశ్రయ ఉద్యోగులతో పాటు ప్రయాణీకులు ఆందోళనకు గురయ్యారు.

కస్టమ్స్ సిబ్బంది గదిలో మంటలు

ఎయిర్ పోర్ట్ లో అగ్ని ప్రమాదానికి కారణం కస్టమ్స్ సిబ్బంది గదిలో మంటలు చెలరేగడమే అని అధికారులు వెల్లడించారు. ఈ మంటలు క్షణాల్లో లగేజి బ్యాగులు వున్న ప్రాంతం వైపుకు వ్యాపించాయి. ఈ మంటల్లో సాఫ్ట్‌వేర్ పరికరాలు, ఇమ్మిగ్రేషన్ గదిలోని ఒక స్ప్లిట్ ఎయిర్ కండీషనర్, కస్టమ్స్ అధికారులకు చెందిన లగేజీ బ్యాగులు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఇవి చాలా ఖరీదైనవిగా అధికారులు వెల్లడించారు. విమానాశ్రయం అగ్నిమాపక సిబ్బంది త్వరగా సంఘటనా స్థలానికి చేరుకుని, అరగంటలో మంటలను అదుపులోకి తెచ్చారు. అగ్నిమాపక సిబ్బంది సత్వర చర్యల వల్ల పెద్ద ప్రమాదం నివారించబడిందని అధికారులు తెలిపారు.

ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ఎయిర్ పోర్ట్ అధికారులు వెల్లడించారు. అగ్నిప్రమాదం జరిగిన ప్రదేశంలో ఉన్న అందరినీ త్వరితగతిన ఖాళీ చేయించినట్లు చెప్పారు. అగ్నిమాపక శాఖకు, పోలీసు శాఖకు సమాచారాన్ని ఇచ్చి అప్రమత్తం చేశామని దీనివల్ల భారీ నష్టం తప్పిందని విమానాశ్రయ అధికారులు తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని ప్రమాదానికి గల కారణాలు, మొత్తం నష్టంపై దర్యాప్తు జరుగుతున్నట్లు అధికారులు వెల్లడించారు.

గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో అగ్నిప్రమాదం - Tholi Paluku