Let's talk: editor@tmv.in
గన్నవరంలో భారీ గంజాయి పట్టివేత

గన్నవరంలో భారీ గంజాయి పట్టివేత

Panthagani Anusha
19 డిసెంబర్, 2025

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మత్తు పదార్థాల రహితంగా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా కృష్ణా జిల్లా పోలీసులు తమ నిఘాను ముమ్మరం చేశారు. గంజాయి సాగు, విక్రయాలు, రవాణాను పూర్తిగా నిర్మూలించేందుకు క్షేత్రస్థాయిలో కఠిన చర్యలు తీసుకుంటున్న క్రమంలో తాజాగా గన్నవరం పరిధిలో భారీ స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టయింది. పోలీసుల పటిష్టమైన తనిఖీ వ్యవస్థను దాటుకొని గంజాయిని తరలించేందుకు స్మగ్లర్లు చేసిన ప్రయత్నాన్ని గన్నవరం పోలీసులు సమర్థవంతంగా అడ్డుకున్నారు.

బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కృష్ణా జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు ఈ కేసు వివరాలను వెల్లడించారు. గన్నవరం పరిధిలోని బీబీ గూడెం అండర్‌పాస్ వద్ద పోలీసులు నిరంతరం వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా వచ్చిన ఒక వాహనాన్ని గుర్తించి నిలిపివేయగా అందులో భారీగా గంజాయి మూటలు లభ్యమయ్యాయి. మొత్తం 112 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారని, దీని మార్కెట్ విలువ సుమారు రూ. 10.60 లక్షల వరకు ఉంటుందని ఎస్పీ వివరించారు.

ఈ అక్రమ రవాణాకు పాల్పడుతున్న మహారాష్ట్రలోని పూణేకు చెందిన దీపక్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు విచారణలో గంజాయి తరలిస్తున్నట్లు అంగీకరించడంతో అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే ఈ గంజాయి నెట్‌వర్క్ ఎక్కడి నుండి ప్రారంభమైంది, ఎవరికి సరఫరా చేస్తున్నారు అనే అంశాలపై పోలీసులు లోతైన దర్యాప్తును వేగవంతం చేసరాణి త్వరలోనే గంజాయి స్మగ్లింకు పాల్పడుతున్న గుర్తించి సమూలంగా నాశనం చేస్తామని వెల్లడించారు. గంజాయి వంటి మత్తు పదార్థాల వల్ల యువత భవిష్యత్తు నాశనం అవుతోందని, ఇలాంటి నేరాలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఎస్పీ ఈ సందర్భంగా హెచ్చరించారు.