Let's talk: editor@tmv.in
గనుల అక్రమ తవ్వకాలతో కోలుకోలేని నష్టం: సుప్రీంకోర్టు

గనుల అక్రమ తవ్వకాలతో కోలుకోలేని నష్టం: సుప్రీంకోర్టు

Pinjari Chand
22 జనవరి, 2026

గనుల అక్రమ తవ్వకాలు పర్యావరణానికి కోలుకోలేనినష్టం కలిగించవచ్చని సుప్రీంకోర్టు బుధవారం వ్యాఖ్యానించింది. అరావళి పర్వత శ్రేణుల్లో గనుల తవ్వకాలతో పాటు అనుబంధ అంశాలపై సమగ్ర, లోతైన పరిశీలన చేయడానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మల్య బాగ్చి, జస్టిస్ విపుల్ ఎం. పంచోలీతో కూడిన ధర్మాసనం, ఈ కమిటీలో భాగంగా ఉండే పర్యావరణవేత్తలు, శాస్త్రవేత్తల పేర్లను నాలుగు వారాల్లో సూచించాలని అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి, అమికస్ క్యూరియే కే. పరమేశ్వర్‌ను ఆదేశించింది. ఈ నిపుణుల కమిటీ సుప్రీంకోర్టు ప్రత్యక్ష పర్యవేక్షణ, మార్గదర్శకత్వంలో పనిచేస్తుందని ధర్మాసనం స్పష్టం చేసింది.

అరావళి పర్వత శ్రేణుల నిర్వచనంపై గతంలో జారీ చేసిన ఆదేశాలను కోర్టు తాత్కాలికంగా నిలిపివేస్తూ వచ్చిన ఉత్తర్వులను కూడా కొనసాగిస్తున్నట్లు తెలిపింది. నవంబర్ 20న ఇచ్చిన ఆదేశాల ప్రకారం అరావళికి ఏకరీతి నిర్వచనాన్ని ఆమోదించిన అంశాన్ని కోర్టు అబేయెన్స్‌లో ఉంచిన విషయం తెలిసిందే. విచారణ సందర్భంగా, కొన్ని ప్రాంతాల్లో విచ్చలవిడిగా అక్రమ గనుల తవ్వకాలు జరుగుతున్నాయని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన రాజస్థాన్ ప్రభుత్వం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ కె.ఎం. నటరాజ్, ఎలాంటి అనధికార గనుల తవ్వకాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని కోర్టుకు హామీ ఇచ్చారు. ఈ హామీని ధర్మాసనం రికార్డులోకి తీసుకుంది. అరావళి పర్వత శ్రేణుల నిర్వచనంపై ఏర్పడిన వివాదం నేపథ్యంలో ‘అరావళి పర్వతాలు, శ్రేణుల నిర్వచనం అనుబంధ అంశాలు’ అనే శీర్షికతో సుప్రీంకోర్టు సుమోటోగా ఈ వ్యవహారాన్ని విచారణకు తీసుకుంది. గతేడాది డిసెంబర్ 29న, అరావళికి సంబంధించిన కొత్త నిర్వచనంపై తీవ్ర విమర్శలు రావడంతో, నవంబర్ 20న జారీ చేసిన ఆదేశాలను తాత్కాలికంగా నిలిపివేస్తూ కోర్టు కీలక అస్పష్టతలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ముఖ్యంగా 100 మీటర్ల ఎత్తు ప్రమాణం, కొండల మధ్య 500 మీటర్ల దూరం వంటి ప్రమాణాలు పర్యావరణ పరిరక్షణ పరిధిని గణనీయంగా తగ్గిస్తాయా అనే అంశంపై స్పష్టత అవసరమని కోర్టు తెలిపింది.

నవంబర్ 20న సుప్రీంకోర్టు అరావళి పర్వత శ్రేణులకు ఏకరీతి నిర్వచనాన్ని ఆమోదించడంతో పాటు, ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లోని అరావళి ప్రాంతాల్లో కొత్త గనుల లీజుల మంజూరును నిపుణుల నివేదికలు వచ్చే వరకు నిషేధించింది. ఇది ప్రపంచంలోనే అత్యంత పురాతన పర్వత వ్యవస్థలలో ఒకటైన అరావళిని రక్షించేందుకు కీలక నిర్ణయంగా భావిస్తున్నారు.

అదనపు ప్రత్యేక ట్రయల్ కోర్టులను ఏర్పాటు చేయండి

అదనపు ట్రయల్ కోర్టులు ఏర్పాటు చేయడం ద్వారా న్యాయవ్యవస్థ మరింత బలమైనదిగా అవుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. అలా జరిగితే బెయిల్, వేగవంతమైన విచారణ వంటి అంశాల కోసం నిందితులు సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సిన అవసరం ఉండదని తెలిపింది. 2021లో నమోదైన ఐసిస్ (ఐఎస్ఐఎస్) సంబంధిత కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దర్యాప్తు చేస్తున్న అంశంపై, రోజువారీ విచారణ జరిపే ప్రత్యేక కోర్టు ఏర్పాటు అంశాన్ని కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు గతంలోనే సూచించింది. ఈ నేపథ్యంలో బుధవారం ఈ వ్యవహారంపై సీజేఐ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మల్య బాగ్చి, జస్టిస్ విపుల్ ఎం. పంచోలీతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.

కేంద్రం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటిని, ఢిల్లీలో ప్రత్యేక కోర్టు ఏర్పాటుకు సంబంధించి పురోగతిపై వివరాలు ఇవ్వాలని ధర్మాసనం కోరింది. ఎలా ఒక బలమైన వ్యవస్థను నిర్మించాలి అన్నదే ఆలోచన. నిందితులు పై కోర్టులకు రావాల్సిన అవసరం లేకుండా చేయాలి. అదనపు కోర్టులు ఏర్పాటు చేసినప్పుడే అది సాధ్యమవుతుందని సీజేఐ వ్యాఖ్యానించారు. ఫిబ్రవరి 10 నాటికి ప్రత్యేక కోర్టు ఏర్పాటు విషయమై జరిగిన పురోగతిని తెలియజేయాలని ధర్మాసనం ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణను అదే రోజుకు వాయిదా వేసింది.

ఈ వ్యవహారం ఐసిస్ సిద్ధాంతాలను టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా ప్రచారం చేసి, ఇతరులను ఉగ్రవాద సంస్థలోకి రిక్రూట్ చేశాడన్న ఆరోపణలపై నమోదైన కేసులో నిందితుడు మొహమ్మద్ హిదాయతుల్లా దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌కు సంబంధించినది. విచారణలో అనవసర జాప్యం జరిగితే, నిందితుడిని ట్రయల్ లేకుండా ఎక్కువ కాలం కస్టడీలో ఉంచలేమని వాదించేందుకు అవకాశం కలుగుతుందని సీజేఐ గతంలోనే వ్యాఖ్యానించారు. ఈ కేసులో మొత్తం 125 మంది సాక్షులను విచారించాల్సి ఉన్న నేపథ్యంలో రోజువారీ విచారణ జరిపే ప్రత్యేక కోర్టు అవసరమని ధర్మాసనం అభిప్రాయపడింది.

ఈ ఐసిస్ కేసులో హిదాయతుల్లాకు బెయిల్ నిరాకరిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. సైబర్ స్పేస్ ద్వారా యువతను రాడికలైజ్ చేశాడన్న ఆరోపణలు అతనిపై ఉన్నాయని పేర్కొంది. ఉగ్రవాద సంస్థకు కేవలం మద్దతు తెలపడం నేరం కాదన్న వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. హిదాయతుల్లా ఒక ఐటీ కంపెనీలో పనిచేసే ఎంబీఏ గ్రాడ్యుయేట్ అయినప్పటికీ, హింసాత్మక మార్గాల ద్వారా ఖిలాఫత్ స్థాపనకు జిహాద్ అవసరమని ప్రచారం చేశాడని హైకోర్టు వ్యాఖ్యానించింది. 2018లో ఐసిస్ నేత అబూ బకర్ అల్-బగ్దాదీ పేరిట ప్రమాణం (బైత్) చేసినట్టు ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారని తెలిపింది. యూఏపీఏ (ఉప) కింద బెయిల్‌కు ఉన్న నిషేధం ఈ కేసుకు పూర్తిగా వర్తిస్తుందని హైకోర్టు స్పష్టం చేసింది. 2021లో ఎఫ్ఐఆర్ నమోదుకాగా, 2022 అక్టోబర్ 22న ఎన్ఐఏ నిందితుడిని అరెస్టు చేసింది. సోషల్ మీడియా ద్వారా ఐసిస్ సిద్ధాంతాలను ప్రచారం చేయడం, నిధులు సమకూర్చడం, పేలుడు పదార్థాల తయారీకి సంబంధించిన సమాచారాన్ని కలిగి ఉండటం వంటి ఆరోపణలు అతనిపై ఉన్నాయి.

ఇంకెంతవరకు సుఖ్నా సరస్సును ఎండబెడతారు?’ – చండీగఢ్ సరస్సు దుస్థితిపై సీజేఐ ఆందోళన

చండీగఢ్‌కు గుర్తింపుగా నిలిచిన సుఖ్నా సరస్సు ఎండిపోతుండడంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) సూర్యకాంత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బిల్డర్ మాఫియా, అధికారులు కుమ్మక్కు కావడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆయన వ్యాఖ్యానించారు.

1995లో దాఖలైన ‘ఇన్ రే: టీఎన్ గోదావర్మన్ తిరుముల్‌పాడ్’ ప్రజాహిత వ్యాజ్యంలో దాఖలైన మధ్యంతర దరఖాస్తులపై సీజేఐ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మల్య బాగ్చి, జస్టిస్ విపుల్ ఎం. పంచోలీతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఒక న్యాయవాది సుఖ్నా సరస్సుకు సంబంధించిన అంశాన్ని ప్రస్తావించగా, సీజేఐ స్పందిస్తూ ఇంకెంతవరకు సుఖ్నా సరస్సును ఎండబెడతారు? పంజాబ్‌లో రాజకీయ మద్దతుతో బిల్డర్ మాఫియా, అధికారులు కుమ్మక్కై అక్రమ నిర్మాణాలకు పాల్పడుతున్నారు. ఫలితంగా సరస్సు పూర్తిగా నాశనం అవుతోందని వ్యాఖ్యానించారు. అటవీ ప్రాంతాలు, సరస్సులకు సంబంధించిన అంశాలు నేరుగా సుప్రీంకోర్టుకు ఎందుకు వస్తున్నాయో, హైకోర్టులను దాటవేసి 1995 నాటి పిల్‌లోనే మధ్యంతర దరఖాస్తుల రూపంలో ఎందుకు ప్రస్తావిస్తున్నారో కోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. సుఖ్నా సరస్సు కేసులో దాఖలైన దరఖాస్తును ప్రస్తావిస్తూ, కొందరు ప్రైవేట్ డెవలపర్లు, ఇతరుల ప్రయోజనాల కోసం ఫ్రెండ్లీ మ్యాచ్ నడుస్తున్నట్టు కనిపిస్తోందని సీజేఐ వ్యాఖ్యానించారు.

కేంద్రం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి, అలాగే అటవీ వ్యవహారాల్లో కోర్టుకు సహకరిస్తున్న అమికస్ క్యూరియే కే.పరమేశ్వర్‌ను, స్థానికంగా హైకోర్టులు పరిష్కరించగల అంశాలపై వివరాలు ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది. చండీగఢ్‌లోని సుఖ్నా సరస్సు క్యాచ్‌మెంట్ ప్రాంతాన్ని అక్రమ ఆక్రమణల నుంచి రక్షించేందుకు హైకోర్టు గతంలో చర్యలు తీసుకున్నట్టు, 2020లో రక్షిత ప్రాంతంలో నిర్మించిన నిర్మాణాలను కూల్చివేయాలని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.