
గద్వాల బీసీ హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్
జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం, ధర్మవరం గ్రామంలోని బీసీ బాలుర వసతి గృహంలో శుక్రవారం రాత్రి భోజనం తర్వాత అస్వస్థతకు గురైన విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు అందించబడ్డాయని చెప్పారు. జిల్లా కలెక్టర్ బీ.ఎం. సంతోష్ భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని ఆయన హామీ ఇచ్చారు.
శనివారం ఉదయం కలెక్టర్ గద్వాల ప్రభుత్వాసుపత్రిని సందర్శించి చికిత్స పొందుతున్న విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని వైద్యాధికారుల నుంచి తెలుసుకున్నారు. విద్యార్థులతో మాట్లాడి, పూర్తిగా కోలుకున్న తరువాత హాస్టల్‌కు తిరిగి వెళ్లవచ్చని సూచించారు. తల్లిదండ్రులను కలుసుకుని, జిల్లా యంత్రాంగం విద్యార్థులందరికీ తగిన సంరక్షణ అందిస్తున్నదని భరోసా ఇచ్చారు.
కలెక్టర్ తెలిపిన వివరాల ప్రకారం హాస్టల్‌లో మొత్తం 140 మంది విద్యార్థుల్లో 110 మంది శుక్రవారం రాత్రి హాజరయ్యారు. వారిలో 54 మంది విద్యార్థులు క్యాబేజీ, కాలీఫ్లవర్‌తో చేసిన వంటకం తిన్న తర్వాత అస్వస్థతకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే అంబులెన్సులు పంపించి విద్యార్థులను గద్వాల ప్రభుత్వాసుపత్రికి తరలించారని, అధికారులు రాత్రంతా ఆసుపత్రిలోనే ఉండి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించారని చెప్పారు. తాను నిరంతరం అధికారులతో సంబంధం ఉంచి ఉత్తమ వైద్యం అందించాలని ఆదేశించానని కలెక్టర్ తెలిపారు.
శనివారం ఉదయం నాటికి 32 మంది విద్యార్థులు డిశ్చార్జ్ కాగా, మిగిలిన 22 మంది విద్యార్థులు మధ్యాహ్నం నాటికి కోలుకుని ఇంటికి వెళ్లనున్నారని చెప్పారు. వండిన గుడ్లు కూడా విషబాధకు కారణమై ఉండొచ్చని అనుమానం వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆహార నమూనాలను ఫుడ్ ఇన్స్పెక్టర్‌కు పంపించి పరీక్ష చేయాలని ఆదేశించారని పేర్కొన్నారు. నిర్లక్ష్యం నిర్ధారణయితే బాధ్యులపై కఠిన చర్యలు, అవసరమైతే సస్పెన్షన్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కలెక్టర్ గత నెలలో కూడా తాను ఈ హాస్టల్‌ను సందర్శించారని, ప్రతి వారం కనీసం మూడు విద్యాసంస్థల్లో ఆకస్మిక తనిఖీలు చేస్తానని అన్నారు. ఇప్పటికే హాస్టళ్లలో ఆహార కమిటీలు ఏర్పాటు చేయబడ్డాయని, విద్యార్థులకు భోజనం వడ్డించే ముందు కమిటీ సభ్యులు స్వయంగా రుచి చూసి అనుమతి ఇస్తారని చెప్పారు. కూరగాయలు, సరుకుల నాణ్యతను కూడా కమిటీ పరిశీలిస్తుందని, నాసిరక సరుకులు సరఫరా చేసే కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.అలాగే జిల్లా వ్యాప్తంగా ప్రతి హాస్టల్‌కు ప్రత్యేక అధికారులను నియమించినట్టు, స్థానిక తహసీల్దార్లు నెలకు రెండుసార్లు తనిఖీలు చేయాలని ఆదేశించామని చెప్పారు. త్వరలో ఈ తనిఖీలను వారానికి ఒకసారి తప్పనిసరి చేసేలా ఆదేశాలు జారీ చేస్తామని, నిర్లక్ష్యం చూపే అధికారులపై శిక్షా చర్యలు తప్పవని కలెక్టర్ తెలిపారు.
జిల్లా కలెక్టర్లు, అధికారులు హాస్టళ్లలో రాత్రి బస చేయాలని ప్రభుత్వం తెలిపినప్పటికి ఈ నిర్లక్ష్యం
ప్రభుత్వం జిల్లా కలెక్టర్లు, అధికారులు హాస్టళ్లలో రాత్రి బస చేయాలని, ప్రత్యక్షంగా పర్యవేక్షించాలని గతంలో స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. అయినప్పటికీ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి.బస చేసిన తర్వాత కూడా వాస్తవ సమస్యలు (అందుబాటులో ఉన్న సరుకులు, వంట పదార్థాల నాణ్యత, శానిటేషన్) లోతుగాపరిశీలించకపోవడం.అలాగే పర్యవేక్షణా నివేదికలు సక్రమంగా సమర్పించకపోవడం లేదా వాటిపై తగిన చర్యలు ఆలస్యమవడం.హాస్టల్ వంటకారులు, సూపరింటెండెంట్, సిబ్బంది నిత్య పర్యవేక్షణలో నిర్లక్ష్యం చేయడం.సరుకులు సరఫరా చేసే కాంట్రాక్టర్లు తక్కువ నాణ్యత ఉన్న కూరగాయలు, గుడ్లు, ధాన్యాలు సరఫరా చేయడం.“ఫుడ్ కమిటీ”లు ఉన్నప్పటికీ, వాస్తవ తనిఖీ లేకుండా కేవలం సంతకాలు చేయడం మాత్రమే జరుగుతుండటం.అంటే, ఆదేశాలు కాగితాలపై మాత్రమే కాకుండా, వాటి అమలును పర్యవేక్షించే కఠిన వ్యవస్థ అవసరం ఉంది.
ఈ జిల్లాలో గతంలో ఆహార విషబాధ ఘటనలు నమోదు
గద్వాల్ జిల్లాలో పునరావృతమవుతున్న ఆహార విషబాధ ఘటనలు
గద్వాల్ సహా తెలంగాణలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఇలాంటి ఘటనలు తరచూ నమోదవుతున్నాయి.2015లో గద్వాల్ పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థులు అల్పాహారం చేసిన అనంతరం ఇద్దరు విద్యార్థినులు అస్వస్థతకు గురైన ఘటన చోటుచేసుకుంది. ఆ తర్వాత కూడా పలు జిల్లాల్లో ప్రభుత్వ హాస్టళ్లు, గిరిజన విద్యాలయాలు, బీసీ వెల్ఫేర్ హాస్టళ్లలో ఆహార భద్రతా ప్రమాణాలు సరిగా పాటించకపోవడంతో విద్యార్థులు ఫుడ్ పాయిజనింగ్‌కు గురయ్యారు.
తాజా ఘటనలో కూడా అదే నిర్లక్ష్యం మరోసారి వెలుగులోకి వచ్చింది. కూరగాయల నాణ్యత, వంటశాల పరిశుభ్రత, నీటి శుద్ధి లాంటి అంశాలపై అధికారులు గమనిక తీసుకోవడంలో విఫలమయ్యారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. జిల్లా కలెక్టర్ బి.ఎం. సంతోష్ ఘటనపై తక్షణ చర్యలు తీసుకుని విద్యార్థుల ఆరోగ్యాన్ని తెలుసుకున్నారు.
రాజకీయ వర్గాలు కూడా ఈ ఘటనపై స్పందన
బీజేపీ నాయకులు హాస్టళ్లలో పరిశుభ్రత లోపించిందని ఆరోపించగా, బీఆర్‌ఎస్ నేతలు ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపారు. దీనికి ప్రతిస్పందనగా జిల్లా అధికారులు క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇలాంటి ఘటనలు మళ్లీ మళ్లీ జరగకుండా ఉండాలంటే, ప్రతి హాస్టల్‌లో ఆహార నాణ్యతపై కఠినమైన పర్యవేక్షణ అవసరం. పరిశీలన కమిటీలు రూపకల్పన చేసి, విద్యార్థుల ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత అన్నారు.
