Let's talk: editor@tmv.in
గద్వాల కోట: ఒక చారిత్రక శిఖరం

గద్వాల కోట: ఒక చారిత్రక శిఖరం

Dantu Vijaya Lakshmi Prasanna
23 అక్టోబర్, 2025

జోగులాంబ గద్వాల జిల్లాలోని గద్వాల పట్టణం చారిత్రక, సాంస్కృతిక సంపదకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం. ఇక్కడ ఉన్న గద్వాల కోట తెలంగాణలోని పురాతన, బలమైన కోటలలో ఒకటిగా గుర్తింపు పొందింది. 17వ శతాబ్దంలో నిర్మితమైన ఈ కోట, గద్వాల సంస్థాన రాజుల చరిత్రను ప్రతిబింబిస్తుంది. పర్యాటకులను ఆకర్షించే ముఖ్యమైన ఆకర్షణగా నిలుస్తుంది. ఈ కథనంతో గద్వాల కోట చరిత్ర, పర్యాటక విశేషాలు, ప్రాముఖ్యత అక్కడికి ఎలా చేరుకోవాలో చూసొద్దాం రండి.

చరిత్ర, నిర్మాణం

గద్వాల కోట 17వ శతాబ్దంలో గద్వాల సంస్థాన రాజు అయిన పెద్ద సోమ భూపాలుడు చేత నిర్మించబడింది. ఈ కోట మట్టి, ఇతర స్థానికంగా లభించే జిగురు పదార్థాలతో నిర్మితమైంది, దాని బలమైన నిర్మాణం కారణంగా శతాబ్దాలుగా సూర్యకాంతి, వర్షాలు వంటి వాతావరణ మార్పులను తట్టుకుని నిలిచింది. గద్వాల సంస్థానం హైదరాబాద్ నిజాం రాజవంశంతో సంబంధాలు కలిగి ఉండటం వల్ల, ఈ కోట యుద్ధాలు, రాజకీయ సంఘటనలకు సాక్ష్యంగా నిలిచింది. కోట లోపల 32 అడుగుల పొడవైన ఫిరంగి ఉంది. ఇది భారతదేశంలో అతిపెద్ద ఫిరంగి గా భావించవచ్చు.. ఒక యుద్ధంలో విజయ చిహ్నంగా ఇది ఇక్కడికి తీసుకురాబడింది. గద్వాల చివరి రాణి మహారాణి ఆదిలక్ష్మీ దేవమ్మ.

కోట యొక్క నిర్మాణం సరళమైనది. బలమైనది. ప్రభుత్వం దాని సంరక్షణకు అనేక చర్యలు తీసుకుంటోంది. ఇది భారతీయ వాస్తుశిల్ప సాంకేతికతల దృఢత్వానికి ఒక అద్భుతంగా పరిగణించవచ్చు.

పర్యాటక విశేషాలు

గద్వాల కోట పర్యాటకులకు చారిత్రక, సాంస్కృతిక అనుభవాన్ని అందిస్తుంది. కోట లోపల, చుట్టూ ఉన్న ఆలయాలు ప్రధాన ఆకర్షణలు.

శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయం: 17వ శతాబ్దంలో గద్వాల రాజుల చేత నిర్మితమైన ఈ ఆలయం ఆధ్యాత్మికతకు, ప్రశాంతతకు నిలయం.

శ్రీ రామాలయం, శ్రీ వేణుగోపాల స్వామి ఆలయాలు: కోట చుట్టూ ఉన్న ఈ ఆలయాలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టిస్తాయి.కోట లోపలి ఫిరంగి, పురాతన నిర్మాణాలు చూడదగినవి.

సమీప పర్యాటక ప్రదేశాలు:

• అలంపూర్ జోగులాంబ ఆలయం ఇది ఒక శక్తి పీఠం.

• కర్నూల్ కోట (కొండా రెడ్డి బురుజు ).

• అధోని కోట.

• రోల్లపాడు వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం.

• 700 సంవత్సరాల చరిత్ర కలిగిన పిల్లలమర్రి మర్రి చెట్టు.

గద్వాల ప్రాంతం నేత, జరీ చీరలకు కూడా ప్రసిద్ధి, కాబట్టి పర్యాటకులు స్థానిక చేతివృత్తులను చూడవచ్చు. గద్వాల్ చీరలు కొనుగోలు చేసి అక్కడి నేత కార్మికులుకు ఉపాధి బరోసా ఇవ్వవచ్చు.

పర్యాటక ప్రాముఖ్యత

గద్వాల కోట భారతదేశంలో అత్యంత బలమైన కోటలలో ఒకటి. గద్వాల సంస్థాన చరిత్రకు ఇది ఒక ముఖ్యమైన చిహ్నం. ఇది స్థానికులకు ఆధ్యాత్మిక, చారిత్రక ప్రాముఖ్యత కలిగిన ప్రదేశం. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రసిద్ధ చారిత్రక ప్రదేశాలలో ఒకటి. కోట సంరక్షణకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. భవిష్యత్తు తరాలకు చారిత్రక సాక్షాలు గా చూపడానికి ప్రభుత్వం దీని వారసత్వాన్ని కాపాడుతోంది. ఇది తెలంగాణ పర్యటనలో ముఖ్యమైన భాగం. సమీపంలోని ఆలయాలు సహజ ప్రదేశాలు దీని ప్రాముఖ్యతను మరింత పెంచుతాయి.

ఎలా చేరుకోవాలి?

గద్వాల కోట హైదరాబాద్ నుండి సుమారు 185 కిలోమీటర్ల దూరంలో ఉంది. రోడ్డు, రైలు మార్గాల ద్వారా సులభంగా చేరుకోవచ్చు.

రోడ్డు మార్గం: హైదరాబాద్ నుండి జాతీయ రహదారి 44 ద్వారా కర్నూల్ వైపు ప్రయాణించి గద్వాల చేరుకోవచ్చు. టి.ఎస్.ఆర్.టి.సి బస్సులు, ప్రైవేట్ వాహనాలు అందుబాటులో ఉంటాయి. కర్నూల్ నుండి 16 కిలోమీటర్ల దూరంలో ఉంది.

రైలు మార్గం: గద్వాల రైల్వే స్టేషన్ సమీపంలో ఉంది. ఇది హైదరాబాద్, కర్నూల్ మధ్య ప్రధాన మార్గంలో ఉంది. స్టేషన్ నుండి కోటకు ఆటోలు లేదా టాక్సీలు అందుబాటులో ఉన్నాయి.

విమాన మార్గం: సమీప విమానాశ్రయం రాజీవ్ గాంధీ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు.అక్కడ నుండి రోడ్డు లేదా రైలు ద్వారా చేరుకోవచ్చు.

సూచనలు

గద్వాల కోట చరిత్ర ప్రేమికులు, పర్యాటకులకు ఒక అద్భుతమైన గమ్యస్థానం. ఇక్కడి సందర్శన గద్వాల సంస్థాన వారసత్వాన్ని దగ్గరగా ఆస్వాదించడానికి సహాయపడుతుంది. పర్యాటకులు, సందర్శకులు కోట సంరక్షణకు సహకరించాలి.స్థానిక చేతివృత్తులను ప్రోత్సహించాలి..