
గత ప్రభుత్వానికి నరకడం తప్ప.. నాటే ఆలోచనే రాలేదు: నాగబాబు
హరిత ఆంధ్రప్రదేశ్ సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణకు బాధ్యత తీసుకోవాలని ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ కొణిదెల నాగబాబు పిలుపునిచ్చారు. భూమాతను కాపాడుకోవడం మన బాధ్యత మాత్రమే కాదని, మన కర్తవ్యమని పేర్కొన్నారు. మంగళగిరిలోని అరణ్యారామం నందవనంలో శనివారం నిర్వహించిన సాంప్రదాయ ‘అశ్వత్థ నారాయణ వివాహం’ కార్యక్రమంలో నాగబాబు, ఆయన సతీమణి పద్మజ పాల్గొన్నారు. శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం రావి, వేప మొక్కలను దంపతులు నాటారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ.. మనిషి పుట్టినప్పటి నుంచి చివరి శ్వాస వరకు అవసరమైన ఆహారం, నీరు, గాలి, నివాసం వంటి వనరులను భూమాత నుంచే పొందుతున్నామని చెప్పారు. అలాంటి భూమాతకు మనం తిరిగి ఏమి చేస్తున్నామో ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. అడవులను నరికివేయడం, విచక్షణారహితంగా మైనింగ్ చేయడం, ప్రకృతిని కాలుష్యానికి గురిచేయడం ద్వారా మనమే భూమాతను గాయపరుస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకృతి పరిరక్షణను ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా భావించి మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు.
ప్రకృతి–ఆధ్యాత్మికతల సమ్మేళనం
భారతీయ సంప్రదాయంలో ప్రత్యేక ప్రాధాన్యం కలిగిన అశ్వత్థ నారాయణ వివాహం ప్రకృతి, ఆధ్యాత్మికత, సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని నాగబాబు తెలిపారు. రావి, వేప మొక్కలను ఒకే గుంతలో నాటే ఈ సంప్రదాయంలో రావి చెట్టును విష్ణుమూర్తికి, వేప చెట్టును లక్ష్మీదేవికి ప్రతీకలుగా భావిస్తారని చెప్పారు. రావి, వేప చెట్లు కలిసి పెరగడం ద్వారా పచ్చని పరిసరాలు, స్వచ్ఛమైన వాతావరణం, జీవ వైవిధ్య పరిరక్షణకు దోహదపడతాయని తెలిపారు. ప్రకృతి సమతుల్యతను కాపాడటంలో ఈ చెట్లకు ఎంతో ప్రాధాన్యం ఉందన్నారు.
కూటమిది నాటే సంస్కృతి
మంచి కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు మొక్క నాటడం తనకు అలవాటని నాగబాబు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, తన ఆలోచనలు ప్రకృతి పరిరక్షణ విషయంలో ఒకే విధంగా ఉన్నాయని తెలిపారు. గత ప్రభుత్వంలో చెట్లను నరకడమే తప్ప మొక్కలు నాటాలనే ఆలోచన లేదని విమర్శించారు. ఏ కార్యక్రమం చేపట్టినా అడ్డుగా ఉన్న చెట్లను నరికివేశారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వ విధానం నరికే సంస్కృతి కాదని.. నాటే సంస్కృతి అని స్పష్టం చేశారు. పర్యావరణ పరిరక్షణలో కెన్యా వంటి దేశాలు అడవులు, వన్యప్రాణులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయని, జ్ఞానానికి పురిటిగడ్డ అయిన భారత్ ప్రకృతి సంరక్షణలో ప్రపంచానికి ఆదర్శంగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు.
73 చెట్లను పునఃప్రతిష్ఠాపన
అరణ్యారామంలో రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖల పరిశోధన, శిక్షణ కార్యక్రమాల పర్యవేక్షణ కోసం రూ.24 కోట్ల వ్యయంతో నిర్మించనున్న భవన డిజైన్లను నాగబాబు పరిశీలించారు. ఈ భవన నిర్మాణాన్ని 10 నెలల్లో పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు పీసీసీఎఫ్ పి.వి. చలపతిరావు వివరించారు. భవన నిర్మాణంలో భాగంగా తొలగించాల్సి వచ్చిన 73 చెట్లను వృథాగా నరికివేయకుండా ఇతర ప్రాంతాలకు విజయవంతంగా తరలించి పునఃప్రతిష్ఠాపన చేసినట్లు అధికారులు తెలిపారు. పునఃప్రతిష్ఠాపన చేసిన చెట్లను నాగబాబు స్వయంగా పరిశీలించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పీసీసీఎఫ్ పి.వి. చలపతిరావు, సీసీఎఫ్ వైల్డ్‌లైఫ్ ఎన్. నాగేశ్వరరావు, సీసీఎఫ్ గుంటూరు వై. శ్రీనివాసరెడ్డి, ఏపీ గ్రీన్ సీఈఓ బి.ఎన్.ఎన్. మూర్తి, డీఎఫ్‌ఓ గుంటూరు హిమశైలజ తదితరులు పాల్గొన్నారు.
