
గత ప్రభుత్వంలో పరకామణికే శఠగోపం
అఖిలాండ బ్రహ్మాండ నాయకుడు తిరుమల ఏడుకొండల స్వామి ఆదాయాన్ని అడ్డగోలుగా దోచుకున్న ఘటనలు వరుసగా వెలుగు చూస్తున్నాయి. గత ప్రభుత్వంలో నాటి టీటీడీ పెద్దలు అందినకాడికి దోచుకున్నారు. ఏడుకొండల వాడి సన్నిధిలో నాడు పరకామణిలో దొంగలు పడితే.. ఆ దొంగలనే వైసీపీ అనకొండలు దోచిన వాస్తవాలు బయటపడుతున్నాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన వీడియోల్లో వైసీపీ హయాం నాటి టీటీడీ పెద్దల పాపాలు కనిపిస్తున్నాయి. 2019 నుంచి 2024వరకు తిరుమల శ్రీవారి సన్నిధిలో అనేక అపచారాలు, తప్పులు, పాపాలు చోటు చేసుకున్నాయి. కల్తీ నెయ్యి సరఫరా నుంచి పరకామణి సొమ్ములు, హుండీలోని నిధులు.ఇలా అదీ ఇదీ అని లేకుండా అన్నింటా చేతివాటం ప్రదర్శించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన 15 నెలల్లో అనేక సంస్కరణలు, నిర్ణయాల ద్వారా తిరుమల ప్రతిష్టను పెంచేందుకు టీటీడీ పనిచేస్తోంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తరవాత బయటపెట్టిన కల్తీ నెయ్యి వ్యవహారంతో దేశం నివ్వెరపోయింది. దీనిపై సీబీఐ దర్యాప్తు జరుగుతోంది. ఈ క్రమంలో మరో విస్తుపోయే వాస్తవం బయటకు వచ్చింది. గత ప్రభుత్వ పాపాల్లో దొంగలను మింగిన దొంగల వ్యవహారం ఒకటి బయటకు వచ్చింది. పరమ పవిత్ర క్షేత్రంలో స్వయంగా పరాకమణి సొమ్మును దోచేసిన, దాన్ని పంచుకున్న వైనం షాక్‌కు గురిచేస్తోంది. ధర్మారెడ్డి ఈవోగా, కరుణాకర్ రెడ్డి చైర్మన్‌గా ఉన్న సమయంలో పరకామణి సొమ్మునూ దోచేసిన వ్యవహారానికి సంబంధించిన వీడియో బయటకొచ్చింది.
అసలేం జరిగిందంటే..
టీటీడీలో పని చేసే రవికుమార్ అనే ఉద్యోగి పరకామణి సొమ్మును దోచుకున్న వీడియోలు బయటకు వచ్చాయి. అలా దోచేసిన కోట్ల సొమ్మును ఆ ఉద్యోగి రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులుగా పెట్టాడు. తరువాత విషయం బయటకు పొక్కడంతో.. ఆ సొమ్మును తిరిగి హుండీలోనే వేసేందుకు దొంగతనం చేసిన ఉద్యోగి ప్రతిపాదన చేశాడు. అయితే దీన్ని అవకాశంగా మార్చుకున్న నాటి టీటీడీ పెద్దలు.. హుండీ సొమ్మునూ మింగేసినట్లు విచారణలో బయటకొచ్చింది. నాడు టీటీడీలో పెద్దలుగా పని చేసిన వారి నుంచి జిల్లా పోలీసు ఉన్నతాధికారుల వరకు ఆ నిందితుడి నుంచి ఆస్తులు రాయించుకున్నారు. భూములు, ప్లాట్లు రాయించుకున్నారు. రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. లోక్ అదాలత్ ద్వారా రాజీ కుదుర్చుకుని కేసు లేకుండా చేశారు. ఘటన తరువాత దాదాపు అన్ని సాక్ష్యాలను ధ్వంసం చేశారు. అయితే దొంగతనంపై స్వయంగా నిందితుడే వాస్తవాలు వెల్లడించేందుకు సిద్ధమవ్వడంతో అన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హుండీని దోచిన దొంగనే దోచుకున్న వైసీపీ నాయకులు, నాటి పాలకమండలి పెద్దలు దేవుడికి తీరని అపచారం చేశారు. ఈ వాస్తవాలు అన్నీ ఇప్పుడు బయట పడుతున్నాయి. దీనిపై నేటి కూటమిప్రభుత్వం అత్యంత కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంది. తిరుమలలో ఒక్కో విభాగాన్ని ప్రక్షాళన చేస్తున్న ప్రస్తుత బోర్డు, అధికారులు.. ఈ విషయంపై లోతైన విచారణ జరిపించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇదే సమయంలో ఈ మొత్తం వ్యవహారంపై కొందరు హైకోర్టును ఆశ్రయించగా.. న్యాయస్థానం సీఐడీ దర్యాప్తునకు ఆదేశించింది. శ్రీవారి ప్రతిష్టను దెబ్బతీయాలని నిత్యం కుట్రలకు పాల్పడుతున్న గత పాలకులకు ఈ కేసులో శిక్ష పడాలని భక్తులు కోరుకుంటున్నారు.
సీఐడీ దర్యాప్తు తర్వాత చర్యలే..
తిరుమల దేవస్థానంలో పరకామణి చోరీ వ్యవహారంలో హైకోర్టు ఆదేశాలతో సీఐడీ దర్యాప్తు ప్రారంభించనుంది. దీంతో గత ప్రభుత్వంలోని తిమింగలాలు బయటపడనున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే తిరుమల ప్రతిష్టను దిగజార్చేలా వరుస వ్యవహారాలు వెలుగు చూస్తుండటంతో ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్‌గా తీసుకుంటోంది. శ్రీవారి ఆలయంలో ఎలాంటి అవినీతి జరగడాన్ని ఉపేక్షించే ప్రసక్తే లేదంటోంది. అందుకే సీఐడీ విచారణను సైతం త్వరితగతిన పూర్తి చేయించి, దోషులను కఠినంగా శిక్షించాలని భావిస్తోంది.
వంద కోట్లు దోచేశారు: టీటీడీ సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి
గత ప్రభుత్వ హయాంలో పరకామణిలో దాదాపు రూ. వంద కోట్లు దోచుకున్నట్లు తెలుస్తోందని తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యుడు, బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి అన్నారు. శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో పరకామణి చోరీ వ్యవహారంపై లోక్ అదాలత్‌లో రాజీ కుదుర్చుకున్నారని చెప్పారు. గత ప్రభుత్వంలో చోరీ జరిగితే చోరీ చేసిన వారితో నాటి పెద్దలు వాటాలు పంచుకున్నారని ఆరోపించారు. దీనిపై విచారణ జరిపించాలని ఇటీవల జరిగిన పాలకమండలి సమావేశంలో చైర్మన్, ఈవోలకు మెమొరాండం అందించామన్నారు. లోక్ అదాలత్‌లో రాజీ కుదుర్చుకున్న కేసుల్లో హైకోర్టు ఆదేశిస్తే మినహా కేసు రీఓపెన్ చేసే అవకాశం లేదని, అందుకే రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగిందన్నారు. హైకోర్టు సైతం లోక్ అదాలత్ ఆదేశాన్ని తప్పుపడుతూ సీఐడీ విచారణకు ఆదేశించిందని వివరించారు. చెట్టు కింద పంచాయితీ చేసినట్లు స్వామివారి సొమ్మును పంచుకున్నారని, దీనిపై సీఐడీ విచారణ తర్వాత టీటీడీ కూడా విచారణ జరపాలని కోరామని భానుప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు.
