
గతంలో ఈశాన్య ప్రాంతాన్ని కాంగ్రెస్ నిర్లక్ష్యం చేసింది: ప్రధాని మోడీ
అస్సాం పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించడంతో పాటు పలు కీలక అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. శనివారం గుహవాటిలో జరిగిన భారీ ప్రజాసభలో మాట్లాడుతూ ఈశాన్య ప్రాంతాన్ని కాంగ్రెస్ తన పాలనలో నిర్లక్ష్యం చేసిందని, అస్సాంలో తిరుగుబాటును ప్రోత్సహించిందని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో భయం, అభద్రత భావన నెలకొన్నాయని, ఓటు బ్యాంక్ రాజకీయాలకే ప్రాధాన్యత ఇచ్చిందని వ్యాఖ్యానించారు. దేశ విభజన ముస్లిం లీగ్ కారణంగా జరిగిందని పేర్కొన్న ప్రధాని, ప్రస్తుతం ఎంఎంసీ – మావోయిస్ట్, ముస్లిం లీగ్, కాంగ్రెస్ అనే సమీకరణ ఉందని ఆరోపించారు. అక్రమ చొరబాటుదారులను కాంగ్రెస్ కాపాడిందని, కానీ బీజేపీ అక్రమ వలసలను పూర్తిగా అరికట్టేందుకు కట్టుబడి ఉందని చెప్పారు. వచ్చే ఐదేళ్లు అస్సాంకు కీలకమని పేర్కొన్నారు. అస్సాంలో కాంగ్రెస్ పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్నప్పటికీ, ఇప్పుడు మరింత ప్రమాదకరంగా మారిందని, వారి నేతల వ్యాఖ్యలే దీనికి నిదర్శనమని అన్నారు.
ఓటు బ్యాంక్, తృప్తిపరిచే రాజకీయాలకే కాంగ్రెస్ పరిమితమైందని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో ఈశాన్య రాష్ట్రాలు నిర్లక్ష్యానికి గురయ్యాయని, కానీ బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని అష్టలక్ష్మిగా భావిస్తోందని తెలిపారు. ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ తర్వాత ఈశాన్య ప్రాంతానికి ఇది తన తొలి పర్యటన అని చెప్పిన ఆయన, ప్రాంత అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని స్పష్టం చేశారు. ఇప్పటివరకు ఈశాన్య ప్రాంతం గురించి మాట్లాడితే దుర్భర మౌలిక వసతులే గుర్తుకు వచ్చేవని, కానీ ఇప్పుడు వాహనాలు మాత్రమే కాక విమానాలు దిగే హైవేలు నిర్మాణమవుతున్నాయని పేర్కొన్నారు. ఇది మారుతున్న అస్సాం ఆత్మవిశ్వాసానికి నిదర్శనమని అన్నారు. బ్రహ్మపుత్ర నదిపై కాంగ్రెస్ ఏడు దశాబ్దాల్లో కేవలం మూడు వంతెనలు మాత్రమే నిర్మించిందని, కానీ బీజేపీ ప్రభుత్వం పది ఏళ్లలో ఐదు వంతెనలు నిర్మించిందని తెలిపారు. ఇక్కడి టీ ఉత్పత్తికి మాత్రమే కాకుండా, సెమీకండక్టర్ చిప్‌ల తయారీలో కూడా గుర్తింపు పొందబోతుందని, జగిరోడ్‌లో టాటా గ్రూప్ ప్లాంట్‌ను ప్రస్తావించారు. 2014 తర్వాత ఈశాన్య ప్రాంతానికి చెందిన 125 మందికి పైగా వ్యక్తులకు పద్మ అవార్డులు లభించాయని చెప్పారు.
పుల్వామా ఉగ్రదాడి జరిగిన రోజు సందర్భంగా అమరులైన భద్రతా సిబ్బందికి ప్రధాని నివాళులర్పించారు. ఉగ్రదాడి అనంతరం భారత్ తగిన సమాధానం ఇచ్చిందని, దేశ శక్తిని ప్రపంచం చూసిందని అన్నారు. గత ఏడాది పహల్గామ్ దాడి తర్వాత చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సమయంలోనూ దేశం తన ప్రతిస్పందనను చూపిందని పేర్కొన్నారు.
పలు ప్రాజెక్టులు ప్రారంభం
అదే రోజు అస్సాంలో రూ.5,500 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించారు. గుహవాటిలో బ్రహ్మపుత్ర నదిపై నిర్మించిన ఆరు లేన్ల ‘కుమార్ భాస్కర్ వర్మ సేతు’ వంతెనను ప్రారంభించారు. సుమారు రూ.3,030 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ఎక్స్‌ట్రాడోస్డ్ ప్రీస్ట్రెస్డ్ కాంక్రీట్ వంతెన గుహవాటి–ఉత్తర గుహవాటి మధ్య ప్రయాణ సమయాన్ని 30 నిమిషాల నుంచి 7 నిమిషాలకు తగ్గించనుంది. భూకంపాలకు అనుగుణంగా ఆధునిక సాంకేతికతను ఉపయోగించి నిర్మించిన ఈ వంతెనలో బ్రిడ్జ్ హెల్త్ మానిటరింగ్ సిస్టమ్‌ను అమర్చారు. లచిత్ ఘాట్ వద్ద ఐఐఎం గుహవాటి తాత్కాలిక క్యాంపస్‌ను వర్చువల్‌గా ప్రారంభించారు. సుమారు రూ.555 కోట్లతో శాశ్వత క్యాంపస్ నిర్మాణం చేపడుతున్నారు. అలాగే కామ్రూప్ జిల్లాలోని అమింగావ్‌లో రూ.348 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన జాతీయ డేటా సెంటర్‌ను కూడా ప్రారంభించారు. ఇది ఈశాన్య రాష్ట్రాలకు డిజిటల్ మౌలిక వసతులను బలోపేతం చేయనుంది. పీఎం-ఈబస్ సేవా పథకం కింద 225 ఎలక్ట్రిక్ బస్సులను కూడా జెండా ఊపి ప్రారంభించారు. గుహవాటికి 100, నాగ్‌పూర్‌కు 50, భావ్‌నగర్‌కు 50, చండీగఢ్‌కు 25 బస్సులు కేటాయించారు. పరిశుభ్రమైన ప్రజా రవాణా సేవలను అందించడమే లక్ష్యమని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.ఈ ఉదయం డిబ్రూగఢ్ జిల్లాలోని మోరాన్ బైపాస్ వద్ద ప్రారంభించిన అత్యవసర ల్యాండింగ్ సదుపాయం కేవలం విమానాలు దిగేందుకు మాత్రమే కాక, దేశ భద్రతను బలోపేతం చేయడానికి కీలకమని చెప్పారు. సీ-130జే విమానంలో అక్కడ ల్యాండ్ కావడం ద్వారా కొత్త చరిత్ర సృష్టించామని తెలిపారు.
నా జీవితంలో అతిపెద్ద గర్వకారణం నేను బీజేపీ కార్యకర్తననే విషయమే అని ప్రధాని మరోసారి స్పష్టం చేశారు. కార్యకర్తలే పార్టీ ప్రాణశక్తి అని, 2026 అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ మెజారిటీతో గెలుస్తుందనే నమ్మకం వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధి, గుర్తింపు, సంప్రదాయాల పరిరక్షణ కోసం డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అవసరమని ఆయన అన్నారు.
