
గణేశ్ ఉత్సవాలకు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు
రాష్ట్రవ్యాప్తంగా గణేశ్ చతుర్థి ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా సమగ్ర భద్రతా ఏర్పాట్లు చేయాలని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ పోలీసు అధికారులను ఆదేశించారు. సెప్టెంబర్ 14న ప్రారంభమయ్యే ఉత్సవాలు.. సెప్టెంబర్ 25న గణేశ్ విగ్రహాల నిమజ్జనంతో ముగియనున్న నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.
సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ఎస్‌ఐలు, ఇతర ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన డీజీపీ.. ఉత్సవాల ఏర్పాట్లపై సమీక్షించారు. గణేశ్ మండపాల వివరాలను సేకరించి పర్యవేక్షించేందుకు ప్రత్యేక ఆన్‌లైన్ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. మండపాలు ఉన్న ప్రాంతం, నిర్వాహకులు, కమిటీ సభ్యుల వివరాలతో పాటు నిమజ్జనానికి వినియోగించే వాహనాల సమాచారాన్ని పోర్టల్‌లో నమోదు చేయాలని ఆదేశించారు.
విద్యుత్, ట్రాఫిక్ భద్రతపై ప్రత్యేక దృష్టి
పోలీసు కమిషనర్లు, డీసీపీలు, ఎస్పీలు గణేశ్ మండపాలను స్వయంగా సందర్శించి.. అక్కడి పరిస్థితులను పాయింట్ బుక్స్‌లో నమోదు చేయాలని డీజీపీ సూచించారు. మండపాల వద్ద విద్యుత్ భద్రత, ట్రాఫిక్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. విద్యుత్, అగ్నిమాపక తదితర శాఖలతో సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. మండపాల వద్ద నిర్వాహకులు స్వచ్ఛంద సేవకులను ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించాలని, సీసీ కెమెరాలు, క్యూ నిర్వహణకు తగిన ఏర్పాట్లు ఉండేలా చూడాలని సూచించారు.
నిమజ్జన మార్గాలపై ముందస్తు పరిశీలన
సెప్టెంబర్ 25న జరిగే నిమజ్జనానికి సంబంధించి మార్గాలు, రహదారులు, వంతెనలపై ముందుగానే సమాచారం సేకరించాలని డీజీపీ ఆదేశించారు. వంతెనల బరువు మోయగల సామర్థ్యాన్ని పరిశీలించి, అందుకు అనుగుణంగా ట్రాఫిక్, భద్రతా ఏర్పాట్లు చేయాలని సూచించారు. మండపాలు, భద్రతా ఏర్పాట్ల పర్యవేక్షణకు జియో ట్యాగింగ్‌ను వినియోగించాలని అధికారులకు సూచించారు. అలాగే సోషల్ మీడియాలో వచ్చే పోస్టులు, సమాచారంపై నిఘా ఉంచాలని.. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అంశాలపై వెంటనే స్పందించాలని డీజీపీ సీవీ ఆనంద్ ఆదేశించారు.
