Let's talk: editor@tmv.in
గణతంత్ర దినోత్సవం వేళ డ్రోన్లపై నిషేధం: మల్కాజిగిరి పోలీసుల కీలక ఆదేశాలు

గణతంత్ర దినోత్సవం వేళ డ్రోన్లపై నిషేధం: మల్కాజిగిరి పోలీసుల కీలక ఆదేశాలు

Gaddamidi Naveen
24 జనవరి, 2026

హైదరాబాద్‌లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో ప్రజా భద్రత, శాంతిభద్రతల దృష్ట్యా మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. జనవరి 26, 2026న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే గణతంత్ర దినోత్సవ అధికారిక కార్యక్రమాల నేపథ్యంలో, భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేశారు.

ఈ నేపథ్యంలో డ్రోన్లు, పారా గ్లైడర్లు, రిమోట్ కంట్రోల్‌తో నడిచే మైక్రో లైట్ విమానాలను ఎగరవేయడంపై పూర్తిస్థాయి నిషేధం విధిస్తూ పబ్లిక్ నోటీసు జారీ చేశారు. ఈ నిషేధం ఉదయం 6.00 గంటల నుంచి మధ్యాహ్నం 3.00 గంటల వరకు అమల్లో ఉంటుంది. ముఖ్యంగా బేగంపేట పోలీస్ స్టేషన్, మార్కెట్ పోలీస్ స్టేషన్, మారేడుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఆదేశాలు కఠినంగా అమలు చేయనున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు.

పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలకు వీఐపీలు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు హాజరవుతుండటంతో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలుగా ఈ నిర్ణయం తీసుకున్నామని పోలీసులు తెలిపారు. నిషేధ ఉత్తర్వులను ఉల్లంఘించిన వారిపై సంబంధిత చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు పోలీసులకు సహకరించి, నిబంధనలు పాటించాలని మల్కాజిగిరి పోలీసులు విజ్ఞప్తి చేశారు. భద్రతా నియమాలను గౌరవిస్తూ, గణతంత్ర దినోత్సవాన్ని శాంతియుతంగా, సురక్షితంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు.