
గుట్టుచప్పుడు కాకుండా ఓట్ల తొలగింపు
కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మరోసారి కేంద్ర ఎన్నికల సంఘంపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చే ప్రాంతాల్లోని ఓట ర్లను వ్యవస్థీకృతంగా తొలగించారని, సాఫ్ట్వేర్ సాయంతో నకిలీ లాగిన్లు, ఫోన్ నంబర్లు ఉపయోగించి ఈ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. గురువారం ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, "హైడ్రోజన్ బాంబ్"లాంటి 100 శాతం ఆధారాలను త్వరలో ప్రకటిస్తానని వెల్లడించారు. ఈ ఆరోపణలను ఎన్నికల సంఘం, బీజేపీ తీవ్రంగా ఖండించింది.
రాహుల్ ఆరోపణలు ఇవే..
రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ‘ఈ ఓట్ల తొలగింపు అంతా వ్యక్తులతో గాకుండా సాఫ్ట్వేర్ను ఉపయోగించి చేస్తున్నారు. అదంతా ఒక ప్రక్రియ ప్రకారం జరుగుతోంది. ప్రతిపక్షాలకు ఓట్లు వేసే కమ్యూనిటీలను లక్ష్యంగా చేసుకుంటున్నారని విమర్శించారు. 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో అలంద్ స్థానిక అసెంబ్లీ కొన్స్టిట్యూన్సీలో 6,018 ఓటర్లను తొలగించే ప్రయత్నం జరిగిందని పేర్కొన్నారు. "నేను ఈ దేశాన్ని, రాజ్యాంగాన్ని ప్రేమిస్తున్నాను. ఈ ప్రజాస్వామ్య ప్రక్రియను రక్షిస్తున్నాను" అని, ప్రజలు దీనికి స్పందించాలని పిలుపునిచ్చారు. ‘కేంద్రీకృత సాఫ్ట్వేర్’ ద్వారా ఈ ప్రక్రియ జరిగిందని.. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్’ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ సాగుతోందని చెప్పారు. కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే కూడా ఈ అంశంపై మాట్లాడారు. ఎన్నికల సంఘం ఎవరిని రక్షిస్తోందని ప్రశ్నించారు.
రాహుల్ చెప్పేదంతా అబద్ధమే..
ఎన్నికల సంఘం ఈ ఆరోపణలను ఖండించింది. అధికారిక ప్రకటనలో, "రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు మొత్తం తప్పు.. అధారాలు లేనివి’ అంటూ ఎన్నికల సంఘం పేర్కొన్నది. ఆరోపణలు చేసే వ్యక్తులు ఆధారాలు కూడా సమర్పించాలని పేర్కొన్నారు. బీజేపీ కూడా ఈ విమర్శలను తీవ్రంగా తప్పుపట్టింది. రాహుల్ గాంధీ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. రాహుల్ గాంధీ విదేశీ పర్యటనల నుంచి వచ్చి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడ్డారు.
