Let's talk: editor@tmv.in
గాజా నుంచి వేలాది మంది తరలింపు

గాజా నుంచి వేలాది మంది తరలింపు

Venkatesh Balusula
19 సెప్టెంబర్, 2025

ఇజ్రాయిల్ సైన్యం గాజా నగరాన్ని ఖాళీ చేసే దిశగా కీలక చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు పాలస్తీనియన్లు బయటకు వెళ్లేందుకు 48 గంటల పాటు కొత్త మార్గాన్ని తెరిచింది. నగరం నుంచి వేలాది మందిని తరలిస్తున్నారు. హమాస్ మిలిటెంట్లతో ఎదుర్కొనేందుకు నగరాన్ని ప్రజలు ఖాళీ చేయాలని ఇజ్రాయిల్ ఆదేశాలు జారీ చేసింది. బుధవారం ఇజ్రాయిల్ దాడుల్లో మొత్తం 63 మంది మరణించారు. దీంతో ఇజ్రాయిల్, హమాస్ యుద్ధంలో పాలస్తీన్ మరణాలు 65 వేలు దాటాయి. స్థానిక అధికారులు ఈ మరణాలపై ఆందోళన వ్యక్తం చేశారు. కుప్పల్లో చిక్కుకున్న శవాలు లెక్కలో లేవని, కాబట్టి నిజమైన సంఖ్య ఇంకా ఎక్కువే ఉండవచ్చని చెప్తున్నారు.

గాజా నగరంలో లక్షలాది మంది ఆశ్రయం పొందుతున్నారు. వీరందరినీ దక్షిణానికి వెళ్లాలని ఇజ్రాయిల్ చెప్పడంతో చాలామంది భయాందోళనకు గురవుతున్నారు. ప్రయాణ మార్గంలో ప్రమాదాలు, ఆహారం లేకపోవడం, శాశ్వతంగా నివాసం మార్చుకోవాల్సి వస్తుండటంతో తీవ్ర దుఖంలో మునిగిపోయారు. "గాజా నగరం నుంచి వెళ్లాలని అనుకున్నా మళ్లీ తిరిగి వచ్చే హామీ ఉందా? యుద్ధం ఇప్పట్లో ముగుస్తుందా? అందుకే ఈ ప్రాంతంలోనే ఉండి మరణించడం మేలు అని ఉపాధ్యాయుడిగా పని చేసే అహ్మద్ ఫోన్లో చెప్పారు. రాఫా ప్రాంతంలో సహాయ స్థలం సమీపంలో ఇజ్రాయెల్ కార్మికులు కాల్పులు జరిపారు. దీంతో ఐదుగురు మరణించగా, పదుల సంఖ్యలో గాయాలపాలయ్యారు. ఈ అత్యవసర ముప్పును తొలగించేందుకు హెచ్చరికగా కాల్పులు జరిపామని ఇజ్రాయెల్ సైన్యం చెప్పింది.

గాజా యుద్ధం 2023 అక్టోబర్ 7న దక్షిణ ఇజ్రాయెల్పై హమాస్ దాడులతో మొదలైంది. ఆ దాడుల్లో 1,200 మంది మరణించి, 251 మంది బందీలుగా పట్టుకున్నారు. ఇజ్రాయెల్ అంచనాల ప్రకారం ఆగస్టు 10 నుంచి గాజా నగరంలో ఉన్న 40 శాతం మంది, సుమారు 4 లక్షల జనాభా ఇప్పటికే బయటకు వెళ్లారు. గాజా అధికారుల లెక్కల ప్రకారం 1.9 లక్షల మంది దక్షిణానికి, 3.5 లక్షల మంది నగరం మధ్య, పడమర భాగాలకు మారారు. యుద్ధ ట్యాంకులు ముందుకు సాగుతున్నాయి. గాజాను పూర్తిగా ఆక్రమించడానికి చాలా నెలలు పడుతుందని ఇజ్రాయెల్ అధికారి వెల్లడించారు. పాలస్తీన్ ప్రజల భారీ వలసలపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇజ్రాయిల్, హమాస్ యుద్ధం రెండేళ్లు పూర్తయినా ముగిసే దారి కనిపించడం లేదు. మరణాలు 65 వేలు దాటడం ఆందోళన కలిగిస్తోంది. ఇజ్రాయెల్ కొత్త మార్గం తెరవడం ద్వారా గాజాను ఖాళీ చేయాలని ప్రయత్నిస్తోంది. కానీ బయటకు వెళ్లేందుకు కూడా ప్రజలు భయపడుతున్నారు. ఇది శాశ్వత వలసలకు దారి తీస్తుందేమోనన్న అనుమానం వ్యక్తం అవుతోంది.

గాజా నుంచి వేలాది మంది తరలింపు - Tholi Paluku