
గాజాలో మారణహోమం నిజమే!
గాజా పరిస్థితిపై తాజాగా ఐక్యరాజ్యసమితికి చెందిన స్వతంత్ర కమిషన్ సంచలనాత్మక నివేదికను విడుదల చేసింది. గాజాలో పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయెల్ మారణహోమం చేస్తోందని ఈ నివేదిక తేల్చింది. ప్రస్తుతం అంతర్జాతీయంగా ఈ అంశంపై తీవ్ర చర్చ జరుగుతోంది. మానవ హక్కుల సంస్థలు, రాజకీయ నాయకులు మీడియా ఈ అంశంపై స్పందిస్తున్నాయి. ఈ నివేదిక నేపథ్యం ఏమిటి? ఐక్యరాజ్యసమితి బయటపెట్టిన ఆధారాలు ఏమిటి? ఇజ్రాయెల్, పాలస్తీనా ఈ నివేదికపై ఎలా స్పందిస్తున్నాయి. అన్న అంశాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
ఇజ్రాయెల్, పాలస్తీనా సంఘర్షణ
ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య సంఘర్షణ దశాబ్దాలుగా కొనసాగుతోంది. 1948లో ఇజ్రాయెల్ స్థాపన తర్వాత, పాలస్తీనా ప్రాంతాలు విభజించబడ్డాయి. 2007 నుంచి హమాస్ (ఇస్లామిక్ రెసిస్టెన్స్ మూవ్మెంట్) గాజాను నియంత్రిస్తోంది. ఇజ్రాయెల్ దానిని ఉగ్రవాద సంస్థగా పరిగణిస్తుంది. ఇజ్రాయెల్ గాజాపై దాడులు చేస్తోంది. అక్టోబర్ 7, 2023న హమాస్ ఇజ్రాయెల్పై చేసిన దాడిలో 1,200 మంది చనిపోయారు. 250 మందిని హమాస్ బందీలుగా తీసుకుంది. దీనికి ప్రతి స్పందనగా ఇజ్రాయెల్ గాజాపై భారీ దాడులు ప్రారంభించింది. ఈ దాడుల్లో ఇప్పటి వరకు 60,000కి పైగా పాలస్తీనా ప్రజలు చనిపోయినట్టు తెలుస్తోంది. ఈ సంఘర్షణలో మానవ హక్కుల ఉల్లంఘనలు, యుద్ధ నేరాలు వంటి ఆరోపనలు వచ్చాయి. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కౌన్సిల్ 2021లో ఈ విచారణ కమిషన్ను వేసింది. ఈ కమిషన్ నివేదిక తాజాగా విడుదలైంది.
నివేదికలో ఏముంది?
ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం, ఇజ్రాయెల్ గాజాలో పాలస్తీనా ప్రజలను లక్ష్యంగా చేసుకొని దాడుల చేస్తోంది. అక్టోబర్ 7, 2023 నుంచి జూలై 31, 2025 వరకు 60,199 పాలస్తీనావాసులు చనిపోయారు. వీరిలో 18,430 మంది పిల్లలు, 9,735 మంది మహిళలు ఉన్నారు. 83% సాధారణ పౌరులు మరణించారు. ఓ ఇంటిపై జరిగిన దాడిలో 28 మంది చనిపోయారు. వారిలో 12 మంది పిల్లలు ఉండటం గమనార్హం. ఈ దాడుల్లో 146,269 మంది గాయపడ్డారు. 4,500 మంది అవయవాలు కోల్పోయారు. వారిలో 800 మంది పిల్లలు. బందీలపై లైంగిక హింస జరుగుతోంది. తీవ్రమైన దాడులతో అనేకమంది గాయాలపాలయ్యారు. అక్కడి ప్రజల జీవిత కాలం కూడా తగ్గింది. దాదాపుగా 10 లక్షలమంది పిల్లలకు మనోధైర్యం కల్పించాల్సి ఉంది. జీవించే హక్కును పూర్తిగా నాశనం చేయడం, ఆసుపత్రులు, పాఠశాలలు ధ్వంసం చేయడం వంటి దారుణాలు జరిగాయి. మొత్తం 170,812 భవనాలు ధ్వంసమయ్యాయి. 498 ఆరోగ్య సంస్థలపై దాడులు జరిగాయి. 747 ఆరోగ్య కార్యకర్తలు చనిపోయారు. కరువు కారణంగా 1,373 మంది చనిపోయారు. 1.9 మిలియన్ మంది (90% జనాభా) వలస వెళ్లారు. ఐవీఎఫ్ క్లినిక్ ధ్వంసం చేశారు. (4,000 ఎంబ్రియోలు, 1,000 స్పెర్మ్ శాంపిల్స్ నాశనం అయ్యాయి. గర్భస్రావాలు 300% పెరిగాయి.
ఆరోపణలను ఖండించిన ఇజ్రాయెల్
కాగా ఐక్యరాజ్యసమితి చేసిన ఆరోపణలను ఇజ్రాయెల్ ఖండించింది. వాస్తవాలను వక్రీకరించారని.. ఇదంతా తప్పుడు నివేదిక అని ఇజ్రాయెల్ అంటోంది. ఐక్యరాజ్యసమితి కమిషన్ ‘హమాస్’ కు అనుకూలంగా పనిచేస్తోందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆరోపించింది. ఐక్యరాజ్యసమితి హమాస్ ఇచ్చిన తప్పుడు సమాచారాన్ని ఆధారం చేసుకున్నదాని పేర్కొన్నది. హమాస్ దాడుల్లో 1,200 మందిని చంపితే, మహిళలపై బలాత్కారాలు చేస్తే ఐక్యరాజ్యసమితి ఎందుకు ప్రశ్నించడం లేదని ఇజ్రాయెల్ ప్రశ్నిస్తోంది. ఇజ్రాయెల్ కేవలం తన రక్షణ కోసం పని చేస్తుందని ఆదేశం అంటున్నది. హమాస్ ప్రజలను అడ్డుపెట్టుకొని దాడులు చేస్తోందని ఇజ్రాయెల్ ఆరోపించింది. కాగా పాలస్తీనా అధికారులు ఈ నివేదికను స్వాగతించాయి.
అంతర్జాతీయస్థాయిలో చర్చలు
అంతర్జాతీయంగా కూడా ఈ నివేదిక తీవ్ర చర్చలకు దారితీసింది. యూఎస్ మాత్రం ఇజ్రాయెల్ చర్యను సమర్థిస్తున్నాయి. కానీ అరబ్ దేశాలు విమర్శిస్తున్నాయి. అమ్నెస్టీ ఇంటర్నేషనల్, ఇతర సంస్థలు ఆయుధాల అమ్మకాలను నిషేధించాలని పిలుపునిచ్చాయి. ఈ నివేదిక ఇజ్రాయెల్-పాలస్తీనా సంఘర్షణలో కీలక మలుపు. ఒకవైపు, ఆధారాలు (మరణాలు, ధ్వంసం, ప్రకటనలు) మారణహోమాన్ని చూపుతున్నాయి. మానవ హక్కుల సంస్థలు దీనిని సమర్థిస్తున్నాయి. మరోవైపు, ఇజ్రాయెల్ వాదనలు హమాస్ ఉగ్రవాదాన్ని ప్రశ్నిస్తున్నాయి.
శాంతి సాధ్యమేనా?
ఈ నివేదిక గాజాలోని మానవీయ సంక్షోభాన్ని ఎత్తిచూపుతుంది. మరి ప్రపంచంలోని దేశాలు ఈ నివేదిక అనంతరం ఇక్కడ శాంతికి అంగీకరిస్తారా? అన్నది వేచి చూడాలి. ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య శాంతి కోసం అంతర్జాతీయ సమాజం చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ ఊపందుకుంటున్నది. లేదంటే ఈ చర్యలు తీవ్రస్థాయికి చేరుకుంటే ఇంకా ప్రాణనష్టం రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. పాలస్తీనాలోని కొన్ని ప్రాంతాల్లో ప్రజలు ఆకలికి అలమటిస్తూ చనిపోతున్నారన్న వార్తలు వస్తున్నాయి. మరి తాజాగా ఐక్యరాజ్యసమితి ఇచ్చిన నివేదికతో ఏమైనా మార్పు జరుగుతుందేమో వేచి చూడాలి.
