
గచ్చిబౌలిలో ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను బోనెట్‌పై ఈడ్చుకెళ్లిన మందుబాబు అరెస్ట్
నగరంలోని గచ్చిబౌలి ప్రాంతంలో మద్యం మత్తులో ఉన్న ఒక యువకుడు సృష్టించిన బీభత్సం కలకలం రేపింది. ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను కారుతో ఢీకొట్టడమే కాకుండా, ఆయన బోనెట్‌పై వేలాడుతుండగానే సుమారు ఒక కిలోమీటర్ మేర కారును పోనిచ్చాడు. ఫిబ్రవరి 28న జరిగిన ఈ భయానక ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.
అసలేం జరిగిందంటే?
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం, 24 ఏళ్ల యువకుడు మద్యం సేవించి ఓ విలాసవంతమైన లగ్జరీ కారును నడుపుతూ నానక్‌రామ్‌గూడ ప్రాంతంలో మరో వాహనాన్ని ఢీకొట్టి అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయాడు. దీనిపై కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందడంతో గచ్చిబౌలి ట్రాఫిక్ సిబ్బందికి అలర్ట్ జారీ చేయబడింది.
డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్‌కు అనుమానాస్పద కారును అడ్డుకోవాలని సమాచారం అందింది. జంక్షన్ వద్ద అతడు కారును ఆపాలని సంకేతం ఇవ్వగా, డ్రైవర్ మొదట వేగం తగ్గించాడు. అయితే కానిస్టేబుల్ కార్ దగ్గరకు వెళ్లి దిగమని చెప్పబోతుండగా, డ్రైవర్ అకస్మాత్తుగా వేగం పెంచి ముందుకు దూసుకెళ్లాడు. దీంతో కానిస్టేబుల్ కారుతో ఢీకొని బోనెట్‌పై పడిపోయాడు. అయినా డ్రైవర్ కారు ఆపకుండా జిగ్‌జాగ్‌గా నడిపాడు. బోనెట్‌పై పట్టుకుని ప్రాణాల్ని కాపాడుకునేందుకు కానిస్టేబుల్ ప్రయత్నించగా, ఈ దృశ్యాన్ని గమనించిన ఇతర వాహనదారులు ముందుకు వచ్చి కారును అడ్డగించారు. అనంతరం నిందితుడిని పట్టుకుని గచ్చిబౌలి పోలీసులకు అప్పగించారు.
మద్యం మత్తులో డ్రైవర్
పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలో నిందితుడి రక్తంలో ఆల్కహాల్ శాతం 160 mg/100 ml గా నమోదైందని,ఇది అనుమతించిన పరిమితికి చాలా ఎక్కువని పోలీసులు తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి ఆదివారం అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ప్రజల్లో ఆగ్రహం రేకెత్తిస్తోంది.
