Let's talk: editor@tmv.in
గంగవరం పోర్టులో అదానీ సిమెంట్ ఫ్యాక్టరీ

గంగవరం పోర్టులో అదానీ సిమెంట్ ఫ్యాక్టరీ

FL - YUGDR
20 సెప్టెంబర్, 2025

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై స్పష్టమైన నిర్ణయం రాకముందే, పెదగంట్యాడ ప్రాంత ప్రజలపై ప్రభుత్వం మరో పిడుగు పడింది. ఒడిశాలో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్న అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీని అదానీ గ్రూప్ స్వాధీనం చేసుకొని, ఇప్పుడు అదే ఫ్యాక్టరీని విశాఖ పెదగంట్యాడలో ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. సిమెంట్ ఫ్యాక్టరీలను జనావాసాలకు దూరంగా ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ ఎటువంటి నియమ నిబంధనలనూ పాటించలేదన్న విమర్శలు వస్తున్నాయి.

సిమెంటు ఫ్యాక్టరీలు వెదజల్లే కాలుష్యం ఏ విధంగా ఉంటుందో అందరికీ తెలిసిందే. కానీ జనావాసాలు అధికంగా వుండే ప్రాంతంలో అదానీ ఈ సిమెంటు ఫ్యాక్టరీని నెలకొల్పేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే గాజువాక, పెదగంట్యాడ ప్రాంతం కాలుష్యం కోరల్లో చిక్కుకుంది. ఎన్టీపీసీ వెదజల్లే కాలుష్యం మీద గ్రీన్ ట్రిబ్యునల్ అనేక తీర్పుల్ని ఇచ్చింది. అయినా వాటిని అమలు చేయకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కానీ అదానీ సంస్థ స్టీల్ ప్లాంట్ బీసీ గేట్ సమీపంలోని పెట్రోల్ బంక్ వెనుక భాగంలో, స్టీల్ ప్లాంట్ పరిధిలోని సర్వే నంబర్లు 97 పీ, 98 పీ, 99పీ, 101పీలో దాదాపు 25 ఎకరాల భూమిలో ఈ సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేందుకు అనుమతులు మంజూరు చేసినట్లు తెలుస్తోంది. అక్టోబర్8న జరిగే ప్రజా అభిప్రాయ సేకరణలో పెద్ద సంఖ్యలో హాజరై వ్యతిరేకతను ప్ర‌భుత్వానికి తెలియ‌జేయాల‌ని పిలుపునిచ్చారు. కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు ఈమెయిల్, ఫోన్ నంబర్ల ద్వారా తక్షణమే అభ్యంతరాలు తెలియజేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. ఈ పోరాటం కేవలం పెద గంట్యాడ ప్రాంతానికే పరిమితం కాకుండా, విశాఖ ఉక్కు పరిశ్రమ రక్షణలో భాగంగానే భావించాలని ప్రజలు కోరుతున్నారు.

గంగవరం పోర్టును హస్తగతం చేసుకున్న అదానీ కంపెనీ ఇక్కడ కాలుష్యం పెంచి, ఉత్పత్తిని ఇతర రాష్ట్రాలకు తన పోర్టు ద్వారా ఎగుమతి చేసుకోవడానికి ఈ ప్రణాళికను సిద్ధం చేసిందన్న విమర్శలు వస్తున్నాయి. గుజరాత్‌లో అదానీకి అనుబంధ సంస్థ అయిన అంబుజా సిమెంట్స్ లిమిటెడ్ పేరుతో దీనిని పెడుతున్నారు. దీనిని 'గంగవరం సిమెంట్ గ్రైండింగ్ యూనిట్'గా వ్యవహరిస్తున్నారు. వేయి కోట్ల రూపాయల పెట్టుబడి పెడుతున్నట్టు నివేదించారు. ఏడాదికి రెండు యూనిట్ల ద్వారా 40 లక్షల టన్నుల సిమెంట్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా ఏర్పాటు చేస్తున్నారు.

ప‌రిసరాల్లో అన్నీ కాలనీలే..

అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టే స్థలానికి దగ్గరగా అనేక కాలనీలు ఉన్నాయి. అందులో ప్రధానమైనది హౌసింగ్ బోర్డు కాలనీ. అందులో 1,500 కుటుంబాలున్నాయి. అలాగే దాని పరిసరాల్లో ఉప్పర కాలనీ, వడ్లపూడి, అగనంపూడి, దువ్వాడ, గంగవరం కాలనీలున్నాయి. మొత్తంగా సుమారుగా 20 వేల మంది జనాభా ఈ పరిశ్రమ కాలుష్య ప్రభావానికి గురవుతారు. ఎన్టీపీసీ, హిందూజా థర్మల్ విద్యుత్ కేంద్రాల వల్ల, వాటి నుంచి వచ్చే ప్లైయాష్ పాలవలస, దాసరిమెట్ట, పిట్టవానిపాలెం, చేపలపాలెం తదితర గ్రామాల ప్రజలు ఇప్పటికే కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇప్పుడు అక్కడి నుంచి ఆ ప్లై యాష్‌ను నిత్యం లారీలతో తీసుకొచ్చి పెదగంట్యాడలో నిల్వ చేసి, గ్రైండింగ్ యూనిట్ల ద్వారా సిమెంట్ తయారు చేస్తారు. దీంతో కాలుష్యం మరింత పెరుగుతుంది. దీనివల్ల విపరీతమైన ధూళి రేగుతుంది. గంగవరం పోర్టు కాలుష్యం, డంపింగ్ యార్డ్ దుర్వాసనతో ఇప్పటికే 64, 72, 73, 75, 76వ వార్డు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మరో భారీ కాలుష్య కేంద్రమైన సిమెంట్ ఫ్యాక్టరీ వస్తే, ఈ ప్రాంత ప్రజలకు ప్రాణ హాని తప్పదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని, మనుగడను దృష్టిలో ఉంచుకొని ఈ కంపెనీని దూరంగా పారిశ్రామిక ప్రాంతానికి తరలించాలని పెదగంట్యాడ ప్రాంత ప్రజలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణలో భాగంగానే ఈ సిమెంటు ఫ్యాక్టరీ వస్తోందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్టీల్ ప్లాంట్‌ నుంచి వచ్చే స్లాగ్‌ను వాడుకొని సిమెంట్ తయారీకి అదానీ సిద్ధమ‌వుతున్నట్టు చెబుతున్నారు.

ప్రజాప్రతినిధుల మౌనం ఎందుకో?

ఈ కీలక సమస్యపై విశాఖ ఎంపీ భరత్, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ ఎందుకు నోరు విప్పడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రజల పక్షాన నిలుస్తారా? లేక అదానీ ప్రయోజనాలకు కొమ్ము కాస్తున్నారా? అనే ప్రశ్నకు ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చిందని వారు హెచ్చరిస్తున్నారు.

గంగవరం పోర్టులో అదానీ సిమెంట్ ఫ్యాక్టరీ - Tholi Paluku