Let's talk: editor@tmv.in
గంభీర్ పై వేటు తప్పదా?

గంభీర్ పై వేటు తప్పదా?

Pinjari Chand
28 డిసెంబర్, 2025

భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌కు వైట్‌బాల్ ఫార్మాట్ల(వన్డేలు, టీ–20)లో మంచి విజయాలున్నప్పటికీ, టెస్ట్ క్రికెట్ విషయంలో ఆయనపై ప్రశ్నలు మొదలయ్యాయి. ఇటీవల భారత్ స్వదేశంలోనే దక్షిణాఫ్రికా చేతిలో రెండు టెస్టుల సిరీస్‌లో ఘోరంగా ఓడిపోవడంతో, బీసీసీఐలోని కీలక వర్గాలు గంభీర్ టెస్ట్ కోచ్‌గా కొనసాగాలా అనే అంశంపై చర్చలు ప్రారంభించినట్లు సమాచారం.

దక్షిణాఫ్రికాతో సీరిస్ లో భారత జట్టు పేలవ ప్రదర్శన అనంతరం, బీసీసీఐలో ప్రభావశీలుడైన ఒక వ్యక్తి వీవీఎస్ లక్ష్మణ్‌ను అనధికారికంగా సంప్రదించి, భారత టెస్ట్ జట్టుకు కోచ్‌గా బాధ్యతలు చేపట్టేందుకు ఆసక్తి ఉందా? అని అడిగినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో హెడ్ ఆఫ్ క్రికెట్‌గా కొనసాగడమే తనకు ఇష్టమని లక్ష్మణ్ స్పష్టం చేసినట్లు వర్గాలు తెలిపాయి. గంభీర్ వైట్‌బాల్ కోచ్‌గా ఐసీసీ ట్రోఫీతో పాటు ఏసీసీ ట్రోఫీని గెలిపించినప్పటికీ, టెస్ట్ ఫార్మాట్‌లో పరిస్థితి భిన్నంగా ఉంది. సేనా దేశాలు(భారత జట్టుకు కఠినమైన విదేశీ సవాళ్లుగా పరిగణించే నాలుగు దేశాలైన దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) ఎదురుగా భారత్ 10 టెస్ట్ పరాజయాలు చవిచూడడం గంభీర్ రికార్డుపై నీలినీడలు కమ్మేలా చేసింది.

గంభీర్ బీసీసీఐ ఒప్పందం 2027 వన్డే వరల్డ్‌కప్ వరకు ఉన్నా, త్వరలో ప్రారంభం కానున్న టి20 వరల్డ్‌కప్‌లో భారత్ ప్రదర్శన ఆధారంగా ఒప్పందాన్ని పునఃసమీక్షించే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025–27 సైకిల్‌లో మిగిలిన తొమ్మిది టెస్టులకు గంభీర్ సరైన కోచేనా? అన్నదానిపై బీసీసీఐ ఇంకా నిర్ణయానికి రాలేదు.

ఇంగ్లండ్‌లో ఐదు టెస్టుల సిరీస్‌ను 2–2తో డ్రా చేసిన భారత్, రాబోయే రోజుల్లో శ్రీలంక (రెండు టెస్టులు), న్యూజిలాండ్ (రెండు టెస్టులు) పర్యటనలు, ఆపై ఆస్ట్రేలియాతో స్వదేశంలో ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది.

ఆటగాళ్లలో అభద్రతాభావం

ఈ నేపథ్యంలో భారత డ్రెస్సింగ్‌రూమ్‌లోనూ అసంతృప్తి ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా ఉన్న సమయంలో ఆటగాళ్లకు స్పష్టమైన పాత్రలు, దీర్ఘకాల అవకాశాలు ఉండేవని, ప్రస్తుతం గంభీర్ హయాంలో ఆటగాళ్లు భద్రత లేనట్టుగా భావిస్తున్నారని వర్గాలు అంటున్నాయి. శుభ్‌మన్ గిల్‌ను టి20 వరల్డ్‌కప్ జట్టు నుంచి తప్పించడం కూడా గంభీర్ నిర్ణయమేనన్న భావన ఆటగాళ్లలో మరింత ఆందోళనకు కారణమైందని ఓ కథనం పేర్కొంది. భారత క్రికెట్‌కు భావి స్టార్‌గా భావిస్తున్న గిల్‌కే చోటు దక్కకపోతే, భవిష్యత్ లో ఎవరినైనా తప్పించే అవకాశముందని ఆటగాళ్లు భావిస్తున్నారట.

సాంప్రదాయంగా కీలక నిర్ణయాల్లో ఆలస్యం చేసే బీసీసీఐ, టి20 వరల్డ్‌కప్ తర్వాత వచ్చే ఐపీఎల్ రెండు నెలల విరామాన్ని ఉపయోగించుకుని, ఒకే కోచ్ అన్ని ఫార్మాట్లకు కొనసాగాలా లేదా టెస్ట్, వైట్‌బాల్ కోచ్‌లను వేరు చేయాలా అనే అంశంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మొత్తానికి, బీసీసీఐలో మద్దతు ఉన్నప్పటికీ, రాబోయే రెండు నెలలు ‘గురు గంభీర్’ భవితవ్యాన్ని నిర్ణయించే కీలక కాలంగా మారనున్నాయి.

గంభీర్ పై వేటు తప్పదా? - Tholi Paluku