
గందరగోళంగా స్థానిక ఎన్నికల షెడ్యూల్
ఇటీవల ఎన్నికల సంఘం విడుదల చేసిన స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌పై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ షెడ్యూల్ గందరగోళంగా ఉందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ పేర్కొన్నారు. రిజర్వేషన్ల కేటాయింపులు తప్పుల తడకగా ఉన్నాయని విమర్శించారు. నల్లగొండ జిల్లాల్లోని కొన్ని తండాల్లో అసలు బీసీలే లేరని.. అటువంటి తండాల్లో బీసీ రిజర్వేషన్ ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. అంతేకాకుండా ఎవరైనా కోర్టుకు వెళితే ఈ షెడ్యూల్ రద్దు అవుతుందని చెప్పారు. చాలా మంది ద్వితీయశ్రేణి నాయకులు అప్పుడే గ్రామాల్లో ప్రచారం మొదలుపెట్టారని.. షెడ్యూల్ వచ్చిందని సంబుర పడుతూ గ్రామీణ ప్రాంతాల్లో డబ్బు ఖర్చు పెట్టి దావత్ ఇస్తున్నారని.. అయితే ఏ క్షణమైనా ఈ షెడ్యూల్ రద్దయ్యే అవకాశం ఉందని ఈటల పేర్కొన్నారు. మంగళవారం ఆయన హనుమకొండ జిల్లా కమలాపూర్‌లో మీడియాతో మాట్లాడారు. మోసం చేయడానికి ఈ షెడ్యూల్ రూపొందించినట్టుందని తీవ్రంగా విమర్శించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ప్రకటించి, కోర్టులో చెల్లదని తెలిసినా గందరగోళానికి గురిచేస్తున్నారని ఆరోపించారు.
షెడ్యూల్‌లో ఏముంది?
రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ప్రకారం, అక్టోబర్ 9 నుంచి నవంబర్ 11 వరకు ఐదు దశల్లో జరగనున్నాయి. ఈ షెడ్యూల్‌లోని రిజర్వేషన్ విషయాల్లో తప్పులు ఉన్నాయన్నది ఈటల రాజేందర్ విమర్శ. తెలంగాణ ప్రభుతం మార్చి 2025లో ఆమోదించిన బిల్లుల ద్వారా బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ను ప్రకటించింది. ఇది ఇప్పటికే ఉన్న 50 శాతం మొత్తం రిజర్వేషన్ (ఎస్‌సీ 20.46%, ఎస్‌టీ 5.73%, బీసీ 23%) ఆధారాన్ని మించి, మొత్తం 63%కి చేరుస్తుంది. ఈటల రాజేందర్ చెబుతున్న వివరాల ప్రకారం.. సుప్రీం కోర్టు ఇంద్రా సాహ్నీ కేసులో (1992) నిర్ణయించినట్టు 50% మించి రిజర్వేషన్లు చెల్లవని, బిహార్ (65% - పట్నా హైకోర్టు 2024లో కోట్టివేసింది), మహారాష్ట్ర (మరాఠా 12-16% - సుప్రీం కోర్టు 2021లో రద్దు) వంటి కేసులు దీనికి స్పష్టమైన ఉదాహరణలు ఉన్నాయని ఆయన చెబుతున్నారు.
"కోర్టులో చెల్లదని తెలిసికూడా ఈ రిజర్వేషన్ ప్రకటించడం వల్ల గందరగోళానికి గురవుతున్నారు. ఎవరూ కోర్టుకు వెళ్లొద్దని ముగ్గురు మంత్రులు చెబుతున్నారు. కోర్టుకు వెళ్తే అభ్యంతరం ఏంటి? బీజేపీ తరఫున శాసనసభ, కౌన్సిల్‌లో పూర్తి మద్దతు ఇచ్చినా, ప్రభుతం అనుభవం లేకపోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని, తప్పుడు ఆరోపణలు చేయొద్దని స్పష్టం చేశారు.
కోర్టు సవాల్ వల్ల ఏమవుతుంది?
ఈటల ఆరోపణలు ఆధారంగా చూస్తే, ఈ ఎన్నికల షెడ్యూల్ మీద కోర్టు సవాల్ వస్తే పరిస్థితి గందరగోళంగానే మారనుంది. తెలంగాణ హైకోర్టు ఇప్పటికే ఈ విషయంపై ఆలోచనలో ఉంది. సెప్టెంబర్ 24న ఒక పిటిషన్‌ను (బీ మాధవరెడ్డి దాఖలు) తిరస్కరించినా, మరో పిటిషన్ పై అక్టోబర్ 8న విచారణ జరగనుంది. ఒకవేళ ఎవరైనా కోర్టుకు వెళ్తే, 50% మించిన రిజర్వేషన్ చట్టవిరుద్ధమని హైకోర్టు కోట్టివేయొచ్చు. బిహార్ కేసులా (పట్నా హైకోర్టు 2024లో 65% రద్దు, సుప్రీం కోర్టు స్టే ఇవ్వలేదు) జరిగితే, ఎన్నికలు మళ్లీ ఆలస్యమవుతాయి. రిజర్వేషన్ జాబితాలు మారాలి.
