
గంజాయి అక్రమ రవాణా పై ప్రత్యేక నిఘా పెంచాం:ఎస్పీ దీక్ష
న గరంలో గంజాయి అక్రమ రవాణా, విక్రయాల నిర్మూలనే లక్ష్యంగా పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) దీక్ష ఆదివారం బాలాజీ నగర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్‌లోని రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించిన ఆమె సిబ్బంది విధి నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. శాంతిభద్రతల పరిరక్షణలో నిర్లక్షయం వహించకూడదని ఈ సందర్భంగా సిబ్బందిని ఆదేశించారు.
రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందని నగరంలోని టాప్–10 రౌడీ షీటర్లలో ఐదుగురు ప్రస్తుతం కడప సెంట్రల్ జైలులో ఉన్నారని మిగిలిన ఐదుగురు ప్రతి ఆదివారం ఉదయం 11 గంటలకు సంబంధిత పోలీస్ స్టేషన్‌లకు హాజరై రిపోర్ట్ చేయాలని నిబంధన విధించినట్లు తెలిపారు.
అదేవిదంగా నగరంలోని ముఖ్య కూడళ్ల వద్ద నిరంతరంగా చెక్‌పాయింట్ తనిఖీలు నిర్వహిస్తున్నామని మరి ముఖ్యగ ఎన్‌టీఆర్ నగర్ వంటి సున్నిత ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఏఎస్పీ తెలిపారు. అంతేకాక గంజాయి వినియోగం, విక్రయాల సమాచారాన్ని ప్రజలు ‘ఈగల్ క్లబ్’ హెల్ప్‌లైన్ నంబర్ 1972 కు తెలియజేయాలని ఏఎస్పీ కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. అదేవిధంగా రేపటి నుంచి నగరం అంతటా పెద్ద ఎత్తున 'కార్డన్ అండ్ సెర్చ్' ఆపరేషన్లు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న వైన్ షాపులు, బార్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అవగాహన కోసం సైకిల్ ర్యాలీ
మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై యువతకు అవగాహన కల్పించేందుకు త్వరలోనే నగరంలో భారీ సైకిల్ ర్యాలీ నిర్వహించనున్నట్లు ఏఎస్పీ దీక్షా తెలిపారు. గంజాయి రహిత నెల్లూరుగా తీర్చిదిద్దేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
