Let's talk: editor@tmv.in
గంగానది తీర ఆక్రమణలపై సమగ్ర నివేదిక ఇవ్వండి: సుప్రీంకోర్టు

గంగానది తీర ఆక్రమణలపై సమగ్ర నివేదిక ఇవ్వండి: సుప్రీంకోర్టు

Pinjari Chand
16 మార్చి, 2026

గంగా నది తీరాలు, వరద మైదానాల్లో జరుగుతున్న అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలపై సమగ్ర నివేదిక సమర్పించాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. న్యాయమూర్తులు జేబీ. పర్దీవాలా,కేవీ.విశ్వనాథన్‌లతో కూడిన బెంచ్ ఈ ఆదేశాలు జారీ చేసింది. గంగా నది పునరుద్ధరణ, రక్షణ, నిర్వహణకు సంబంధించిన నోటిఫికేషన్ అమలు కోసం ఇప్పటివరకు తీసుకున్న చర్యలను కూడా కోర్టుకు వివరించాలని కేంద్రాన్ని కోరింది. గంగా నదిని రక్షించడానికి ఏర్పాటైన ‘నేషనల్‌ మిషన్‌ ఫర్‌‌ క్లీన్‌ గంగ’ సంస్థ ఎదుర్కొంటున్న అడ్డంకులు ఏమిటి? ఆ నోటిఫికేషన్‌ను సమర్థంగా అమలు చేయడానికి ఏమి చేయాలని భావిస్తున్నారో వివరించాలని కోర్టు ప్రశ్నించింది. అలాగే గంగా నది ప్రవహించే అన్ని రాష్ట్రాల్లో నది తీరాలు, వరద మైదానాలు పూర్తిగా ఆక్రమణల నుంచి విముక్తం చేయడానికి ఏ చర్యలు తీసుకుంటున్నారో వివరించాలని కేంద్రాన్ని ఆదేశించింది.

ఈ అంశంపై విస్తృతంగా విచారణ అవసరమని భావించిన సుప్రీంకోర్టు గంగా పరివాహక ప్రాంతానికి చెందిన పలు రాష్ట్రాలకు కూడా నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో తదుపరి విచారణను ఏప్రిల్ 23కు వాయిదా వేసింది. విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫున హాజరైన న్యాయవాది ఆకాశ్‌ వశిష్ట మాట్లాడుతూ గంగా నది తీరాలపై భారీ స్థాయిలో ఆక్రమణలు జరుగుతున్నాయని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. వీటిపై తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

కొన్ని ప్రాంతాల్లో గంగా నది తీర ప్రాంతాలు మంచి నీటి డాల్ఫిన్లకు ముఖ్య నివాసంగా ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ ఆక్రమణలు వాటి జీవావరణానికి కూడా ప్రమాదకరమని పేర్కొన్నారు. ఈ కేసు అశోక్‌కుమార్‌‌ సిన్హా అనే పాట్నా నివాసి దాఖలు చేసిన పిటిషన్‌పై కొనసాగుతోంది. అక్రమ నిర్మాణాలు, శాశ్వత ఆక్రమణలపై ఆయన వేసిన పిటిషన్‌ను నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ 2020 జూన్ 30న తిరస్కరించిన నేపథ్యంలో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గంగా నది భారతదేశంలో అత్యంత ముఖ్యమైన నదుల్లో ఒకటి. ఇది పలు రాష్ట్రాల గుండా ప్రవహిస్తూ కోట్లాది మందికి జీవనాధారంగా నిలుస్తోంది.

ఆసుపత్రుల సేవా భావంతోనే న్యాయవ్యవస్థ పనిచేయాలి: సీజేఐ

న్యాయస్థానాలకు వచ్చే ప్రజలు ఆశతో, న్యాయం కోసం వస్తారని, అందువల్ల న్యాయవ్యవస్థ కూడా ఆసుపత్రుల మాదిరిగా సేవాభావంతో పనిచేయాలని భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ అన్నారు. హిమాచల్‌ప్రదేశ్లోని మండి జిల్లా న్యాయస్థాన సముదాయం నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం నిర్వహించిన న్యాయ అవగాహన శిబిరంలో ఆయన మాట్లాడారు. న్యాయస్థానాలకు ఎక్కువ సదుపాయాలు పెరుగుతున్న కొద్దీ బాధ్యతలు కూడా పెరుగుతాయని ఆయన పేర్కొన్నారు.

భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులపై ఎక్కువగా చర్చ జరుగుతుందని, అయితే ప్రాథమిక కర్తవ్యాల ప్రాముఖ్యత కూడా అంతే ముఖ్యమని ఆయన అన్నారు. ప్రజల్లో ఈ విషయాలపై అవగాహన పెంచేందుకు గ్రామస్థాయి వరకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. మండి న్యాయస్థాన సముదాయం నిర్మాణానికి రూ.152 కోట్ల వ్యయంతో 9.6 హెక్టార్ల విస్తీర్ణంలో నాలుగు బ్లాకులు నిర్మించనున్నారు. దీని ద్వారా న్యాయమూర్తులు, న్యాయవాదులు, ప్రజలకు మెరుగైన సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.