
ఖైరతాబాద్‌లో ఎన్‌బీటీ నగర్ జీ+2 భారీ ఫంక్షన్ హాల్ ప్రారంభం
ఖైరతాబాద్ నియోజకవర్గం బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12 లోని స్థానిక ప్రజల చిరకాల కోరిక నెరవేరింది. ఎన్‌బీటీ నగర్ లో నూతనంగా నిర్మించిన జి+2 మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్‌ను రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి హైదరాబాద్ జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మితో కలిసి ఘనంగా ప్రారంభించారు.
జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో సుమారు రూ. 10 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ భవనం ఖైరతాబాద్‌లోనే అతిపెద్ద కమ్యూనిటీ ఫెసిలిటీగా నిలిచింది. మూడు అంతస్తులతో కూడిన ఈ భవనాన్ని అత్యాధునిక సౌకర్యాలతో, బహుళ ప్రయోజనార్థం తీర్చిదిద్దారు. స్థానిక ప్రజలు శుభకార్యాలు, సామాజిక సమావేశాలు సాంస్కృతిక కార్యక్రమాలను తక్కువ ఖర్చుతో నిర్వహించుకోవచ్చు.
నిరుపేదలు, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండేలా నాణ్యమైన మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పించింది. పౌర సేవా స్థలాలను గరిష్టంగా వినియోగించుకునేలా ఈ మల్టీ పర్పస్ డిజైన్‌ను రూపొందించారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
హైదరాబాద్‌లోని ప్రతి డివిజన్‌లోనూ ఇలాంటి మెరుగైన ప్రజా వసతులను కల్పించి, స్థానిక కాలనీల అభివృద్ధిని బలోపేతం చేయడమే లక్ష్యమని జీహెచ్‌ఎంసీ స్పష్టం చేసింది. ఈ ఫంక్షన్ హాల్ అందుబాటులోకి రావడంతో ఎన్‌బీటీ నగర్ పరిసర ప్రాంతాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
