Let's talk: editor@tmv.in
ఖైదీల పరివర్తనకు ‘నివృత్తి’: చర్లపల్లి జైల్లో డీ-అడిక్షన్ సెంటర్‌ను ప్రారంభించిన గవర్నర్
ఖైదీల పరివర్తనకు ‘నివృత్తి’: చర్లపల్లి జైల్లో డీ-అడిక్షన్ సెంటర్‌ను ప్రారంభించిన గవర్నర్

ఖైదీల పరివర్తనకు ‘నివృత్తి’: చర్లపల్లి జైల్లో డీ-అడిక్షన్ సెంటర్‌ను ప్రారంభించిన గవర్నర్

Gaddamidi Naveen
7 ఏప్రిల్, 2026

మాదకద్రవ్యాల వినియోగం అనేది ప్రస్తుతం ఒక తీవ్రమైన సామాజిక, ప్రజారోగ్య సమస్యగా మారిందని, దీనిపై సమగ్రమైన పోరాటం అవసరమని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా పేర్కొన్నారు. నషా ముక్త్ భారత్ అభియాన్ కింద రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. గవర్నర్ సోమవారం చర్లపల్లి కేంద్ర కారాగారంలో ‘నివృత్తి’ మాదకద్రవ్యాల విముక్తి కేంద్రాన్ని ప్రారంభించారు.

తెలంగాణ జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ సౌమ్య మిశ్రా నేతృత్వంలో జైళ్లలో డీ-అడిక్షన్ సెంటర్లను ఏర్పాటు చేయడం అభినందనీయమని గవర్నర్ అన్నారు. తన రాజకీయ జీవితంలో తాను కూడా పలుమార్లు జైలుకు వెళ్లానని, ఆ అనుభవంతో ఖైదీలు, జైలు సిబ్బంది ఎదుర్కొనే సవాళ్లపై తనకు లోతైన అవగాహన ఉందని ఆయన గుర్తు చేసుకున్నారు. జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా మాట్లాడుతూ, మాదకద్రవ్యాల బానిసత్వాన్ని కేవలం శిక్షలతో కాకుండా, వైద్య సంరక్షణ, కౌన్సెలింగ్ ద్వారా పరిష్కరించాల్సిన ప్రజారోగ్య సమస్యగా పరిగణించాలని ఆయ‌న‌ తెలిపారు.

చర్లపల్లితో పాటు చంచల్‌గూడ, సంగారెడ్డి, నిజామాబాద్ కేంద్ర కారాగారాల్లో, అలాగే హైదరాబాద్‌లోని మహిళా ప్రత్యేక జైలులో కూడా 'నివృత్తి' కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు 2,915 మంది ఖైదీలకు ప్రాథమిక పరీక్షలు నిర్వహించగా, వారిలో 590 మందికి 'ప్రపంచ ఆరోగ్య సంస్థ-ఆల్కహాల్, స్మోకింగ్, సబ్‌స్టెన్స్ ఇన్వాల్వ్‌మెంట్ స్క్రీనింగ్ టెస్ట్' విధానం ద్వారా కౌన్సెలింగ్ చికిత్స అందించారు. ఈ కేంద్రాలు ఖైదీలకు వైద్య సహాయంతో పాటు, మానసిక ధైర్యాన్ని ఇస్తూ వారు తిరిగి సాధారణ జీవితం గడపడానికి అవసరమైన పునరావాస మద్దతును అందిస్తున్నాయి. ఇది జైళ్ల సంస్కరణల్లో ఒక కీలక మైలురాయి అని అధికారులు అభిప్రాయపడ్డారు.