Let's talk: editor@tmv.in
ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ ఛాంపియన్‌గా భారత ఆర్మీ

ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ ఛాంపియన్‌గా భారత ఆర్మీ

Shaik Mohammad Shaffee
26 ఫిబ్రవరి, 2026

ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ (కేఐడబ్ల్యూజీ) 2026లో భారత సైన్యం తమ ఆధిపత్యాన్ని మరోసారి చాటుకుంది. ఓవరాల్ టీమ్ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను వరుసగా రెండోసారి నిలబెట్టుకుని సత్తా చాటింది. మొత్తం 9 స్వర్ణాలతో ఆర్మీ అగ్రస్థానంలో నిలవగా, అందులో 8 పతకాలు కేవలం గుల్మార్గ్ ఎడిషన్‌లోనే సాధించడం విశేషం. పోటీల చివరి రోజున ఆర్మీ 4 స్వర్ణాలను ఖాతాలో వేసుకోగా, హిమాచల్ ప్రదేశ్ కూడా 4 స్వర్ణాలతో మెరిసి రన్నరప్‌గా నిలిచింది. ఈ క్రీడల ముగింపు వేడుకలు నేడు గుల్మార్గ్ గోల్ఫ్ కోర్స్‌లో ఘనంగా జరగనున్నాయి. ఈ వింటర్ గేమ్స్ తొలి దశ జనవరి 20 నుంచి 26 వరకు లద్దాఖ్‌లో జరిగిన విషయం తెలిసిందే.

జమ్మూ-కశ్మీర్ జోరు.. భవానీ హ్యాట్రిక్

సుదీర్ఘ నిరీక్షణ తర్వాత జమ్మూ-కశ్మీర్ జట్టుకు చివరకు విజయం దక్కింది. పురుషుల స్నోబోర్డింగ్ జెయింట్ స్లాలోమ్ రేసులో జుబైద్ అహ్మద్ లోన్ స్వర్ణ పతకాన్ని సాధించి స్థానిక క్రీడాభిమానులకు ఆనందాన్ని పంచాడు. ఆర్మీ క్రీడాకారుడు వివేక్ రానా నుంచి గట్టి పోటీ ఎదురైనప్పటికీ, జుబైద్ విజేతగా నిలిచాడు. జమ్మూ-కశ్మీర్ జట్టు ఈ వింటర్ గేమ్స్‌లో ఒక స్వర్ణం, ఒక రజతంతో పదో స్థానంలో నిలిచింది. మరోవైపు గత ఏడాది హ్యాట్రిక్ స్వర్ణాలు సాధించిన కర్ణాటకకు చెందిన భవానీ తెక్కడ నంజుండ, నార్డిక్ మహిళల 1.5 కి.మీ స్ప్రింట్‌లో మరోసారి స్వర్ణాన్ని ఒడిసి పట్టుకుంది. ఆమె మొత్తం ఆరు ఎడిషన్లలోనూ పాల్గొని తన ప్రతిభను నిరూపించుకుంది.

ఆర్మీ పూర్తి ఆధిపత్యం.. డబుల్ గోల్డ్‌తో మెరిసిన ముగ్గురు

నార్డిక్ (క్రాస్ కంట్రీ) ఈవెంట్లలో ఆర్మీ క్రీడాకారులు క్లీన్ స్వీప్ చేశారు. 15 కి.మీ నార్డిక్ స్కీయింగ్ రేసులో మహ్మద్ అలీ (34:21.49 సెకన్లు) స్వర్ణం గెలవగా, పద్మ నామ్‌గైల్ (రజతం), సన్నీ సింగ్ (కాంస్యం) సాధించి ఆర్మీకి 1-2-3 స్థానాలను కట్టబెట్టారు. అల్పైన్ స్కీయింగ్ స్లాలోమ్ విభాగంలో ఆర్మీ క్రీడాకారుడు మయాంక్ పన్వార్ రెండు స్వర్ణాలతో సత్తా చాటారు. అలాగే, సీఆర్‌పీఎఫ్‌కు చెందిన కాజల్ కుమారి రాయ్, హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన ప్రీతి ఠాకూర్ స్నోబోర్డింగ్ స్లాలోమ్, జెయింట్ స్లాలోమ్ విభాగాల్లో స్వర్ణాలు సాధించి 'డబుల్ గోల్డ్' విజేతలుగా నిలిచారు.