
ఖేలో ఇండియా వింటర్ గేమ్స్: కాజల్‌కు డబుల్ గోల్డ్
ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2026లో సీఆర్‌పీఎఫ్ క్రీడాకారిణి కాజల్ కుమారి రాయ్ అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తండ్రిని కోల్పోయిన విషాదంలో ఉన్నప్పటికీ, పట్టుదలతో పోరాడుతూ వరుసగా రెండో స్వర్ణ పతకాన్ని గెలుచుకుని అందరికీ స్ఫూర్తిగా నిలిచింది. మహిళల 10కిమీ నార్డిక్ రేసులో కాజల్ స్వర్ణం సాధించగా, సీఆర్‌పీఎఫ్ క్రీడాకారిణి హీరాల్ రజతం, కర్ణాటకకు చెందిన భవాని తెక్కడ నంజుండ కాంస్య పతకంతో సరిపెట్టుకున్నారు.
పతకాల పట్టికలో ఆర్మీ జోరు
కాజల్ విజయం ఒకవైపు క్రీడాభిమానులను అలరిస్తుంటే, మరోవైపు భారత సైనిక దళం పతకాల పట్టికలో తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. గుల్మార్గ్ లెగ్‌లో భాగంగా మంగళవారం జరిగిన పోటీల్లో ఆర్మీ నాలుగో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుని, మొత్తం పతకాల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ఈ క్రీడల ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఆర్మీ ఖాతాలో ఐదు స్వర్ణ పతకాలు (లడఖ్ లెగ్‌లో మెన్స్ ఐస్ హాకీ గోల్డ్‌తో కలిపి) చేరాయి. జమ్మూ కాశ్మీర్ స్పోర్ట్స్ కౌన్సిల్ నిర్వహిస్తున్న ఈ గేమ్స్‌లో రెండో రోజున ఐదు విభాగాల్లో పతకాలను ఖరారు చేశారు.
ముందంజలో హర్యానా, మహారాష్ట్ర
పతకాల పట్టికలో హర్యానా నాలుగు స్వర్ణాలతో రెండో స్థానంలో కొనసాగుతోంది. హర్యానా సాధించిన నాలుగు స్వర్ణాలు లేహ్ వేదికగా జరిగిన స్కేటింగ్ పోటీల్లో వచ్చినవే. ఇక మహారాష్ట్ర మరో స్వర్ణంతో హర్యానాకు గట్టి పోటీ ఇస్తోంది. గుల్మార్గ్ కొంగ్దూరి వాలులో జరిగిన స్కీ మౌంటెనీరింగ్ (వర్టికల్) పోటీల్లో కామియా కార్తికేయన్ మహారాష్ట్రకు తొలి స్వర్ణాన్ని అందించారు.
అంచనాలను అందుకున్న ఆంచల్ ఠాకూర్
అల్పైన్ స్కీయింగ్ వెటరన్ క్రీడాకారిణి ఆంచల్ ఠాకూర్ (హిమాచల్ ప్రదేశ్) తన స్థాయికి తగ్గట్టుగా రాణించింది. జెయింట్ స్లాలోమ్ రేసులో 48.984 సెకన్ల టైమింగ్‌తో ఈ క్రీడల్లో తన మొదటి స్వర్ణాన్ని గెలుచుకుంది. ఆమె తోటి రాష్ట్ర క్రీడాకారిణి తనుజా ఠాకూర్ రజతాన్ని దక్కించుకోగా, కర్ణాటకకు చెందిన వర్ధమాన క్రీడాకారిణి జియా ఆర్యన్ మరోసారి పతకంతో మెరిసింది.
ఆర్మీ ఏకఛత్రాధిపత్యం
పురుషుల 10కిమీ నార్డిక్ రేసులో ఆర్మీ స్టార్ స్కీయర్ పద్మ నామ్‌గైల్ అద్భుతమైన ప్రతిభ కనబరిచి స్వర్ణాన్ని దక్కించుకున్నారు. ఈ విభాగంలో మొదటి మూడు స్థానాలను ఆర్మీ క్రీడాకారులే కైవసం చేసుకోవడం విశేషం. అంతేకాకుండా, మొదటి తొమ్మిది స్థానాల్లోనూ ఆర్మీ అథ్లెట్లే నిలవడం వారి ఆధిపత్యానికి నిదర్శనం. సోమవారం నార్డిక్ స్ప్రింట్ స్వర్ణాన్ని గెలిచిన ఆర్మీకి చెందిన సన్నీ సింగ్, ఈసారి ఆరో స్థానంతో సరిపెట్టుకున్నారు. గుల్మార్గ్ లెగ్‌లో ఇప్పటివరకు పది స్వర్ణ పతకాలు ఖరారయ్యాయి.
