
ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్: ఛాంపియన్‌గా కర్ణాటక జట్టు
దేశంలో తొలిసారిగా నిర్వహించిన 'ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ 2026' శుక్రవారం ఘనంగా ముగిశాయి. ఆరంభం నుంచే పతకాల వేటలో దూసుకుపోయిన కర్ణాటక జట్టు ఓవరాల్ ఛాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకుంది. మొత్తం 23 స్వర్ణాలు, 8 రజతాలు, 7 కాంస్యాలతో పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. 30 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి సుమారు 3,800 మంది క్రీడాకారులు పాల్గొన్న ఈ మెగా ఈవెంట్‌లో తొమ్మిది క్రీడాంశాల్లో పోటీలు జరిగాయి. ఆఖరి రోజు జరిగిన మహిళల రికర్వ్ ఆర్చరీలో జార్ఖండ్ క్రీడాకారిణి, మాజీ ప్రపంచ జూనియర్ ఛాంపియన్ కోమలిక బారి స్వర్ణంతో మెరవడం విశేషం.
స్విమ్మింగ్‌లో కర్ణాటక క్లీన్ స్వీప్
కర్ణాటక జట్టు తొలి రోజు నుంచే ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ముఖ్యంగా స్విమ్మింగ్ పోటీల్లో ఆ జట్టు ఏకంగా 15 స్వర్ణాలు, 5 రజతాలు, 3 కాంస్య పతకాలను కొల్లగొట్టింది. అథ్లెటిక్స్‌లో ఐదు, కుస్తీలో మూడు పసిడి పతకాలను సాధించి పట్టికలో తిరుగులేని స్థానాన్ని సంపాదించుకుంది. ఆ జట్టుకు చెందిన మణికంఠ 8 స్వర్ణాలు, ఒక రజతంతో ఈ క్రీడల్లో అత్యంత విజయవంతమైన అథ్లెట్‌గా నిలిచాడు. అతడి సహచరుడు ధోనీష్ స్విమ్మింగ్‌లో ఐదు పసిడి పతకాలు, ఒక రజతాన్ని గెలుచుకున్నాడు.
పోరాడి ఓడిన ఒడిశా.. జార్ఖండ్‌కు మూడో స్థానం
పతకాల వేటలో కర్ణాటకకు ఒడిశా గట్టి పోటీనిచ్చింది. మొత్తం 57 పతకాలతో (21 స్వర్ణ, 15 రజత, 21 కాంస్య) హాఫ్ సెంచరీ దాటిన ఏకైక జట్టుగా నిలిచినప్పటికీ, స్వర్ణాల సంఖ్యలో వెనుకబడటంతో రెండో స్థానంతో సరిపెట్టుకుంది. అన్ని విభాగాల్లోనూ కనీసం ఒక బంగారు పతకాన్ని సాధించిన ఏకైక జట్టుగా ఒడిశా గుర్తింపు పొందింది. అంజలి ముండా అనే స్విమ్మర్ ఒడిశా తరఫున ఐదు స్వర్ణాలు సాధించింది. ఇక 16 స్వర్ణాలతో జార్ఖండ్ మూడో స్థానాన్ని దక్కించుకోగా, మహారాష్ట్ర (6 స్వర్ణాలు) నాలుగో స్థానంలో, అరుణాచల్ ప్రదేశ్ (6 స్వర్ణాలు) ఐదో స్థానంలో నిలిచాయి.
సత్తా చాటిన ఆతిథ్య ఛత్తీస్‌గఢ్
పోటీలను నిర్వహిస్తున్న ఛత్తీస్‌గఢ్ జట్టు కూడా ఆకట్టుకునే ప్రదర్శన చేసింది. మూడు స్వర్ణాలు, 10 రజతాలు, ఆరు కాంస్యాలతో మొత్తంగా 9వ స్థానాన్ని దక్కించుకుంది. ఈ పోటీల్లో మల్లాఖంబ్, కబడ్డీ వంటి సంప్రదాయ క్రీడలను ప్రదర్శన క్రీడలుగా నిర్వహించారు. మొత్తం 25 రాష్ట్రాలు పతకాల పట్టికలో చోటు దక్కించుకోగా, 20 రాష్ట్రాలు కనీసం ఒక బంగారు పతకాన్నైనా గెలుచుకోవడం గమనార్హం. గిరిజన ప్రాంతాల్లోని క్రీడా నైపుణ్యాన్ని వెలికితీయడంలో ఈ క్రీడలు విజయవంతమయ్యాయని అధికారులు పేర్కొన్నారు.
