
ఖేలో ఇండియాలో ప్రక్షాళన: వెయ్యి మందికి పైగా అథ్లెట్లపై వేటు
దేశంలో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ఖేలో ఇండియా' పథకంలో భారీ ప్రక్షాళన జరిగింది. గత మూడేళ్ల కాలంలో వివిధ క్రీడా విభాగాలకు చెందిన 1,342 మంది అథ్లెట్లను ఈ ప్రోగ్రామ్ నుండి తొలగించినట్లు కేంద్ర క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవీయ గురువారం రాజ్యసభలో వెల్లడించారు. నిర్ణీత ప్రమాణాల మేరకు రాణించకపోవడం, నిషేధిత ఉత్ప్రేరకాలు వాడి డోపింగ్ నిబంధనలను ఉల్లంఘించడం వంటి కారణాల వల్ల వీరిపై వేటు వేసినట్లు ఆయన స్పష్టం చేశారు. రాజ్యసభలో అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా మంత్రి ఈ వివరాలను లిఖితపూర్వకంగా సమర్పించారు.
ఖేలో ఇండియా పథకం కింద అథ్లెట్ల ఎంపిక, తొలగింపు ప్రక్రియను 'టాలెంట్ ఐడెంటిఫికేషన్ అండ్ డెవలప్‌మెంట్ కమిటీ' పర్యవేక్షిస్తుందని మంత్రి వివరించారు. అథ్లెట్ల సామర్థ్యాన్ని అంచనా వేయడానికి ఏటా ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తామని, నిబంధనల ప్రకారం వారి ప్రదర్శనను నిశితంగా పరిశీలిస్తామని తెలిపారు. ఒకవైపు 1,342 మందిని తొలగించగా, అదే మూడేళ్ల కాలంలో 2,905 మంది కొత్త క్రీడాకారులను ఈ పథకంలో చేర్చుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 23,000 మందికి పైగా అథ్లెట్లకు ఖేలో ఇండియా కింద శిక్షణ, ఆర్థిక తోడ్పాటు అందుతోందని వెల్లడించారు. ఒలింపిక్ పతక విజేత మను భాకర్ వంటి మేటి క్రీడాకారులు ఈ పథకం ద్వారా ఎదిగిన వారేనని ఆయన గుర్తు చేశారు.
క్రీడల్లో డోపింగ్ మహమ్మారిని అరికట్టేందుకు ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తోందని మంత్రి మాండవీయ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. జాతీయ డోపింగ్ నిరోధక సంస్థను మరింత బలోపేతం చేస్తున్నామని, ఇంటెలిజెన్స్, ఇన్వెస్టిగేషన్ విభాగాల్లో నిపుణులను నియమిస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా క్రీడల్లో డోపింగ్ ముఠాల గుట్టు రట్టు చేసేందుకు సిబిఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థల సహకారాన్ని కూడా తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు. నిషేధిత మందుల అక్రమ రవాణా, వాటి వినియోగాన్ని అడ్డుకోవడమే లక్ష్యంగా లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలతో సమన్వయం చేసుకుంటున్నామని చెప్పారు. ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ జాబితాలో గత మూడేళ్లుగా భారత్ అత్యధిక పాజిటివ్ రేటుతో అగ్రస్థానంలో ఉండటం గమనార్హం.
