
ఖలిస్తాన్ ఉగ్రవాద సంస్థపై బ్రిటన్ ఆంక్షలు.. స్వాగతించిన భారత్
ఖలిస్తాన్ ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహించే నిషేధిత సంస్థ బాబర్ ఖల్సాకు సంబంధించిన నెట్‌వర్క్‌లపై బ్రిటన్ (యూకే) ప్రభుత్వం ఆంక్షలు విధించడాన్ని భారత ప్రభుత్వం స్వాగతించింది. ఇది ఉగ్రవాదం, అక్రమ ఆర్థిక లావాదేవీలకు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పోరాటాన్ని బలోపేతం చేయడంలో ఒక ముఖ్యమైన అడుగు అని భారత్ అభివర్ణించింది.
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం బలోపేతం
విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ, భారతదేశానికి వ్యతిరేకంగా తీవ్రవాద కార్యకలాపాలలో పాల్గొంటున్న వ్యక్తులు, సంస్థలను లక్ష్యంగా చేసుకుని బ్రిటన్ తీసుకున్న చర్యను న్యూఢిల్లీ అభినందిస్తోందని తెలిపారు. "భారత్‌కు వ్యతిరేకమైన తీవ్రవాద సంస్థలపై బ్రిటన్ ప్రభుత్వం ఆంక్షలు విధించడం, ఉగ్రవాదం, తీవ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచ పోరాటాన్ని బలోపేతం చేస్తుంది. అక్రమ ఆర్థిక లావాదేవీలను, అంతర్జాతీయ నేర నెట్‌వర్క్‌లను అరికట్టడానికి ఇది సహాయపడుతుంది" అని జైస్వాల్ అన్నారు. ఈ వ్యక్తులు కేవలం భారత్, బ్రిటన్ కే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు కూడా ప్రమాదం కలిగిస్తున్నారని ఆయన చెప్పారు. భవిష్యత్తులో కూడా ఉగ్రవాద నిరోధక చర్యలు, భద్రతా సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి బ్రిటన్ తో కలిసి పనిచేయడానికి భారత్ సిద్ధంగా ఉందని జైస్వాల్ పేర్కొన్నారు.
ఉగ్రవాద నిధులపై యూకే ఉక్కుపాదం
గత వారం, బ్రిటన్ ప్రభుత్వం బాబర్ ఖల్సా అనే ఖలిస్తాన్ ఉగ్రవాద సంస్థకు నిధులు అందకుండా లక్ష్యంగా ఆంక్షలు విధించింది. ఉగ్రవాద సంస్థపై ఇలాంటి చర్యలు తీసుకోవడం యూకే చరిత్రలో ఇదే మొదటిసారి. ఈ ఆంక్షలలో భాగంగా, భారతదేశంలో ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొంటున్నాడని అనుమానిస్తున్న గుర్‌ప్రీత్ సింగ్ రెహాల్ అనే వ్యక్తి ఆస్తులను ప్రభుత్వం జప్తు చేసింది. అంతేకాక, అతడిని ఏ కంపెనీకి డైరెక్టర్‌గా పనిచేయకుండా లేదా కంపెనీ నిర్వహణలో పాల్గొనకుండా అనర్హుడిగా ప్రకటించింది. ఇదే ఉగ్రవాద సంస్థకు మద్దతు ఇస్తున్న బాబర్ అకాలీ లెహర్ అనే సంస్థపై కూడా ఆస్తుల జప్తు విధించారు. యూకే ట్రెజరీ డిపార్ట్‌మెంట్ (ఆర్థిక శాఖ) ప్రకారం, రెహాల్ ఈ సంస్థలకు ఆయుధాలు, ఇతర సైనిక సామాగ్రిని కొనుగోలు చేయడానికి నిధులు, సహాయాన్ని అందిస్తున్నాడు. ఉగ్రవాద నిరోధక ఆంక్షలు- ఈయూ నిష్క్రమణ నిబంధనలు 2019 అనే చట్టం ప్రకారం, ఉగ్రవాద కార్యకలాపాలలో పాల్గొంటున్నట్లు అనుమానం ఉన్న వ్యక్తులు, సంస్థల ఆస్తులను స్తంభింపజేయడానికి, వారిపై ఆంక్షలు విధించడానికి యూకే ట్రెజరీ (ఆర్థిక శాఖ)కి అధికారం ఉంది.
