
ఖరీఫ్ సీజన్‌కు ఎరువులు సకాలంలో పంపిణీ చేయాలి: కేంద్రాన్ని కోరిన మంత్రి తుమ్మల
దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగానికి సంబంధించిన కీలక కార్యక్రమాల పురోగతిపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ బుధవారం అన్ని రాష్ట్రాల మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొని, రాష్ట్రంలో అమలువుతున్న రైతు సంక్షేమ పథకాలు, సాధించిన ప్రగతిని వివరించారు.
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం 'ఫార్మర్ రిజిస్ట్రీ' ప్రక్రియలో 112 శాతం పురోగతిని సాధించి, దేశంలోనే అగ్రగామి రాష్ట్రాలలో ఒకటిగా నిలిచిందని తెలిపారు. పట్టాదార్ పాస్‌బుక్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను రాబోయే మూడు నెలల్లో పూర్తిగా పూర్తి చేస్తామని ఆయన కేంద్ర మంత్రికి వివరించారు. రాష్ట్రంలో యూరియా లభ్యత, పంపిణీ వ్యవస్థపై మంత్రి తుమ్మల కేంద్రానికి నివేదించారు. యూరియా పంపిణీని క్రమబద్ధీకరించడానికి, పారదర్శకతను పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'యూరియా యాప్' పనితీరును ఆయన వివరించారు. దీనివల్ల రైతులకు ఎరువుల పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు కేంద్రీకృత కార్యక్రమాలను, ముఖ్యంగా ఫార్మర్ రిజిస్ట్రీలో సాధించిన వేగాన్ని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చొరవ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.
రాబోయే ఖరీఫ్ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని, కేంద్ర కేటాయింపుల ప్రకారం రాష్ట్రానికి సకాలంలో యూరియా సరఫరా అయ్యేలా చూడాలని మంత్రి తుమ్మల కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సాగు సమయంలో రైతులకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఎరువుల సరఫరాను ముందస్తుగా సిద్ధం చేయాలని కోరారు. ఈ సమావేశం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం పెరిగి, రైతులకు మరింత మెరుగైన సేవలు అందుతాయని ఆశిస్తున్నారు.
