Let's talk: editor@tmv.in
ఖరీఫ్ ప్రారంభానికి ముందే సాగునీటి ప్రాజెక్టుల ఓ అండ్ ఎం పనులు పూర్తిచేయాలి: నిమ్మల రామానాయుడు

ఖరీఫ్ ప్రారంభానికి ముందే సాగునీటి ప్రాజెక్టుల ఓ అండ్ ఎం పనులు పూర్తిచేయాలి: నిమ్మల రామానాయుడు

Panthagani Anusha
18 మార్చి, 2026

రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ, మరమ్మత్తు (ఓ అండ్ ఎం) పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు. మంగళవారం విజయవాడలోని తన క్యాంపు కార్యాలయం నుంచి ఇరిగేషన్ ఉన్నతాధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాబోయే ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందే అంటే మే 15వ తేదీ నాటికి అన్ని పనులను కొలిక్కి తీసుకురావాలని స్పష్టమైన గడువు విధించారు. ఎన్ని వేల కోట్లు ఖర్చు చేసి ప్రాజెక్టులు నిర్మించినా, ఏటా నిర్వహణ పనులు చేపట్టకపోతే ఆ శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు.

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సాగునీటి రంగం తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని వందల, వేల కోట్లు పెట్టి నిర్మించిన ప్రాజెక్టులను గత పాలకులు గాలికొదిలేశారని కనీసం కాలువల్లో తట్టెడు మట్టి తీయాలన్న ఆలోచన కూడా చేయలేదని విమర్శించారు. ప్రాజెక్టుల షట్టర్లు, డోర్లు, గేట్లకు కనీసం గ్రీజు పూయడం వంటి చిన్నపాటి పనులను కూడా విస్మరించడం వల్ల వ్యవస్థలన్నీ దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలే నేడు రైతులకు శాపాలుగా మారాయని ఆ శిథిలమైన వ్యవస్థను తాము మళ్లీ గాడిలో పెడుతున్నామని ఆయన పేర్కొన్నారు.

నిధుల కేటాయింపులో తమ ప్రభుత్వ చిత్తశుద్ధిని వివరిస్తూ గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో నిర్వహణ పనుల కోసం రూ.200 కోట్లు ఖర్చు చేయలేదని మంత్రి ధ్వజమెత్తారు. కానీ తమ కూటమి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన మొదటి రెండేళ్లలోనే ఏకంగా రూ. 878 కోట్లు మంజూరు చేసి ఆ నిధులను ఖర్చు చేసిందని గుర్తు చేశారు. 2026 ఖరీఫ్ నాటికి సాగునీటి వ్యవస్థలన్నీ సాధారణ స్థితికి రావాలని ఎక్కడా నీటి సరఫరాకు ఆటంకం కలగకుండా అత్యవసర పనులన్నీ నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

అదేవిధంగా రైతులకు మేలు చేసేలా భూసార పెంపుదలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి తెలిపారు. చెరువుల్లో పూడిక తీసిన మట్టిని పొలాలకు తరలించుకోవాలనుకునే రైతులకు ప్రభుత్వం భారీ వెసులుబాటు కల్పించిందన్నారు. క్యూబిక్ మీటర్ మట్టిని కేవలం ఒక్క రూపాయికే రైతులకు సరఫరా చేసేలా అనుమతులు జారీ చేశామని, ఈ అవకాశాన్ని సాగుదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇరిగేషన్ రంగంలో జవాబుదారీతనాన్ని పెంచుతూ రైతాంగానికి పూర్తిస్థాయిలో సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు.

ఖరీఫ్ ప్రారంభానికి ముందే సాగునీటి ప్రాజెక్టుల ఓ అండ్ ఎం పనులు పూర్తిచేయాలి: నిమ్మల రామానాయుడు - Tholi Paluku