
ఖరాట్ కేసులో కీలక సమాచారం బయటకు ఎలా వస్తోంది?: కాంగ్రెస్
అత్యాచారం ఆరోపణలతో అరెస్టైన స్వయం ప్రకటిట గురువు అశోక్ ఖరాట్‌కు సంబంధించిన కేసులో గోప్య సమాచారం బయటకు లీక్ అవుతోందని మహారాష్ట్ర కాంగ్రెస్ ఆరోపించింది. ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వ పాత్రపై కూడా ప్రశ్నలు లేవనెత్తింది. ఈ విషయంపై స్పందించిన మహారాష్ట్ర కాంగ్రెస్ ప్రతినిధి సచిన్ సావంత్ దర్యాప్తులో భాగమైన కీలక సమాచారం ఎలా బయటకు వస్తోందో వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న విచారణకు సంబంధించిన కాల్ డీటైల్ రికార్డులు (సీడీఆర్) వంటి గోప్య ఆధారాలు ప్రజల్లోకి ఎలా చేరుతున్నాయో ప్రశ్నించారు. ఇది దర్యాప్తు సంస్థల నిర్లక్ష్యమా? లేక రాజకీయ ప్రత్యర్థులపై ప్రతీకారం తీర్చుకోవడానికి సమాచారాన్ని కావాలనే లీక్ చేస్తున్నారా? అని ఆయన సందేహం వ్యక్తం చేశారు. ఈ కేసులో అధికార కూటమి మహయుతికి చెందిన పలువురు నేతల పేర్లు కూడా వినిపిస్తున్నాయని సావంత్ అన్నారు. ఇటీవల వెలుగులోకి వచ్చిన కాల్ డీటైల్ రికార్డులు ఆ ఆరోపణలకు బలం చేకూర్చుతున్నట్లుగా కనిపిస్తున్నాయని చెప్పారు. ఇంతకుముందు కూడా ఈ కేసుకు సంబంధించిన మహిళల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయని ఆయన పేర్కొన్నారు. అవి విచారణకు సంబంధించినవే కావచ్చని, దీంతో పలువురి వ్యక్తిగత జీవితం తీవ్రంగా దెబ్బతిందని అన్నారు. ఈ వ్యవహారంపై పూర్తి బాధ్యత ఎవరు తీసుకుంటారని ఆయన ప్రశ్నించారు. దర్యాప్తు సంస్థలు సమాచారం లీక్ కాకుండా నిరోధించడంలో విఫలమయ్యాయా? లేక కావాలనే ఎంపిక చేసి లీక్ చేస్తున్నాయా? అనే అంశంపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఖరాట్‌పై 8 కేసులు నమోదు
మార్చి 18న ఒక మహిళపై మూడు సంవత్సరాల పాటు అత్యాచారం చేసిన ఆరోపణలతో అశోక్ ఖరాట్‌ను పోలీసులు అరెస్టు చేశారు. తరువాతి దర్యాప్తులో లైంగిక దాడులు, ఆర్థిక అవకతవకలు వంటి పలు నేరాలు బయటపడ్డాయి. ఇప్పటివరకు అతనిపై ఎనిమిది ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి.
ఇదిలా ఉండగా, సామాజిక కార్యకర్త అంజలి దమానియా శుక్రవారం చేసిన ఆరోపణలు కూడా వివాదానికి దారితీశాయి. ఆమె ప్రకారం మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే, అశోక్ ఖరాట్ మధ్య గతంలో కనీసం 17 ఫోన్ కాల్స్ జరిగినట్లు సీడీఆర్ వివరాలు సూచిస్తున్నాయని తెలిపారు. అదేవిధంగా బీజేపీ, ఎన్‌సీపీ(అజిత్‌పవార్)కి చెందిన కొంతమంది నేతలు కూడా ఖరాట్‌తో ఫోన్‌లో మాట్లాడినట్లు సమాచారం ఉందని ఆమె ఒక మరాఠీ వార్తా ఛానెల్‌కు తెలిపారు. తనకు ఖరాట్ కాల్ డీటైల్ రికార్డులు తెలియని నంబర్ నుంచి వాట్సాప్ ద్వారా వచ్చాయని దమనియా పేర్కొన్నారు. ఈ వ్యవహారం మహారాష్ట్ర రాజకీయాల్లో కొత్త వివాదానికి దారితీసింది.
