
ఖమ్మంలో రూ.547 కోట్ల సైబర్ స్కామ్ గుట్టురట్టు: 18 మంది అరెస్ట్
తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో భారీ 'మ్యూల్' బ్యాంక్ అకౌంట్ల రాకెట్‌ను పోలీసులు ఛేదించారు. సైబర్ నేరగాళ్లకు సహకరిస్తూ సుమారు రూ. 547 కోట్ల అక్రమ లావాదేవీలకు పాల్పడిన 18 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ భారీ కుంభకోణానికి సంబంధించి మొత్తం 24 మందిపై కేసు నమోదు చేయగా, మిగిలిన ఆరుగురు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపిన వివరాల ప్రకారం, 2022 నుంచి 2025 మధ్య కాలంలో ఈ ముఠా అత్యంత పకడ్బందీగా నెట్‌వర్క్‌ను నడిపిందన్నారు. ఉద్యోగ అవకాశాలు, వ్యాపార పెట్టుబడులు కమీషన్ల ఆశచూపి అమాయక వ్యక్తుల పేరుతో బ్యాంక్ ఖాతాలను తెరిపించారు. ఆ ఖాతాలకు సంబంధించిన ఇంటర్నెట్ బ్యాంకింగ్ వివరాలను నిందితులు తమ ఆధీనంలోకి తీసుకునేవారు.
ఈ మ్యూల్ ఖాతాలు సైబర్ ఫ్రాడ్ ద్వారా వచ్చిన లావాదేవీలు స్వీకరించడానికి, లేయరింగ్, ట్రాన్స్‌ఫర్, మనీ లాండరింగ్ కోసం ఉపయోగించబడ్డాయని తెలిపారు. ఖాతాలను కమీషన్ ఆధారంగా సైబర్ ఫ్రాడ్ చేయబడ్డవారికి అందించగా, వాటి ద్వారా విదేశాలకు నగదు తరలించడం, క్రిప్టోకరెన్సీలలో మార్పు, నగదు ఉపసంహరణ వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలు జరిగాయి.
పోలీసు విశ్లేషణలో, నిందితులు వారి మిత్రుల ఖాతాల ద్వారా 547 కోట్ల రుపాయల లావాదేవీలు జరిగాయని నిర్ధారించారు. ఈ లావాదేవీలు వివిధ రాష్ట్రాల్లో నమోదైన అనేక సైబర్ ఫ్రాడ్ కేసులకు సంబంధమై ఉన్నాయని, ఇంకా విచారణ కొనసాగుతోందని ఖమ్మం పోలీస్ కమిషనర్ తెలిపారు.
