
ఖమ్మంలో రూ. 8.50 కోట్లతో అంతర్జాతీయ స్థాయి సింథటిక్ ట్రాక్ పనుల పరిశీలించిన కలెక్టర్
ఖమ్మం నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో రూ. 8 కోట్ల 50 లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన సింథటిక్ రన్నింగ్ ట్రాక్ నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పరిశీలించారు. మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, నగర మేయర్ పునుకొల్లు నీరజలతో కలిసి స్టేడియాన్ని సందర్శించిన కలెక్టర్, ప్రస్తుతం జరుగుతున్న పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో సమీక్షించారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణం జరుగుతున్న సింథటిక్ రన్నింగ్ ట్రాక్‌ను పరిశీలిస్తూ, పనుల నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. ట్రాక్ లెవెలింగ్, పిన్సింగ్, బాండింగ్, లైన్ మార్కింగ్ వంటి పనులు నిబంధనలకు అనుగుణంగా చేపట్టాలని స్పష్టం చేశారు. వర్షపు నీరు ట్రాక్‌పై నిల్వ ఉండకుండా ఐఎస్ఓ ప్రమాణాల ప్రకారం వన్ సైడ్ కార్బో చాంబర్లు ఏర్పాటు చేయాలని, క్రీడాకారులకు సరిపడా వెలుతురు అందేలా హైమాస్ట్ లైట్లు అమర్చాలని ఆయన సూచించారు.
అదే సమయంలో స్టేడియంలో నూతనంగా నిర్మించిన టేబుల్ టెన్నిస్ హాల్‌ను కూడా కలెక్టర్ సందర్శించి, అందుబాటులో ఉన్న క్రీడా సౌకర్యాలను పరిశీలించారు. క్రీడాకారులకు మెరుగైన వాతావరణం కల్పించేలా అవసరమైన అన్ని సదుపాయాలు ఉండాలని అధికారులను ఆదేశించారు. స్టేడియం పరిసరాల్లో పచ్చదనం పెంపొందించేందుకు విస్తరించి పెరిగే మొక్కలను నాటాలని ఆయన సూచించారు.
నిర్మాణ పనుల్లో ఎలాంటి నాణ్యత లోపాలు లేకుండా, నిర్ణీత కాలవ్యవధిలో పనులను పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. ఈ సింథటిక్ ట్రాక్ పూర్తి అయితే ఖమ్మం జిల్లాలో క్రీడల అభివృద్ధికి మరింత ఊతం లభించనుంది.
