Let's talk: editor@tmv.in
ఖమ్మంలో పేదల ఇళ్ల కూల్చివేత అమానుషం: హరీష్ రావు

ఖమ్మంలో పేదల ఇళ్ల కూల్చివేత అమానుషం: హరీష్ రావు

Gaddamidi Naveen
25 ఫిబ్రవరి, 2026

ఖమ్మం నగరం వెలుగుమట్ల వినోబా నగర్‌లో పేదలు నిర్మించుకున్న ఇళ్లను వేల మంది పోలీసుల పహారాలో కూల్చివేయడంపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా మండిపడ్డారు. ఈ ఘటనను "రాక్షస కాండ"గా అభివర్ణించిన ఆయన, కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును తన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తీవ్రంగా ఖండించారు.

పోలీస్ రాజ్యమా.. ప్రజాస్వామ్యమా?

ఈ ఘటనపై ఆయన ఎక్స్ వేదికగా స్పందిస్తూ, ఇది ప్రజాస్వామ్యమా లేక పోలీస్ రాజ్యమా? అని ప్రశ్నించారు. నాలుగు జిల్లాల నుంచి వేలాది మంది పోలీసులను తరలించి యుద్ధ వాతావరణం సృష్టించడం ఎందుకు అవసరమైందని ఆయన నిలదీశారు. పేద ప్రజలను తీవ్రవాదుల్లా చూడటం ఎంతవరకు సమంజసం అని విమర్శించారు. పోలీసుల అడ్డంకులతో మీడియాను సంఘటన స్థలానికి రానివ్వకపోవడం వెనుక ప్రభుత్వం చేసిన చర్యలు ప్రజలకు తెలియకూడదనే ఉద్దేశమే ఉందని ఆయన ఆరోపించారు. చీకటి పనులు చేసేవారే మీడియాను చూసి భయపడతారని వ్యాఖ్యానించారు.

హామీలు ఏమయ్యాయి?

మేము అధికారంలోకి వస్తే ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి తుమ్మ‌ల నాగేశ్వరరావు, నేడు ఉన్న ఇళ్లను కూల్చివేసి పేదలను నడిరోడ్డుపై నిలబెట్టడం దుర్మార్గమని ఆయ‌న‌ అన్నారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, ప్రత్యామ్నాయం చూపకుండా ఇళ్లను ధ్వంసం చేయడం అమానుషమని పేర్కొన్నారు.

బాధితుల ఆవేదన ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దహించి వేయడం ఖాయమని హెచ్చరించిన హరీష్ రావు, వెంటనే కూల్చివేతలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు వెనక్కి వెళ్లాలని, బాధితులకు తక్షణ న్యాయం చేయాలని కోరారు. నిర్వాసితులకు సరైన ప్రత్యామ్నాయం చూపే వరకు ఇంచు భూమి కూడా కదల్చరాదని ఆయ‌న పేర్కొన్నారు. పేదల పక్షాన బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తుందని, ఖమ్మం ప్రజల కన్నీళ్లకు ప్రభుత్వం తప్పక మూల్యం చెల్లించాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.