Let's talk: editor@tmv.in
ఖమేనీ హత్యపై కేంద్రం మౌనం… మోదీపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు

ఖమేనీ హత్యపై కేంద్రం మౌనం… మోదీపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు

Dantu Vijaya Lakshmi Prasanna
14 మార్చి, 2026

ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ హత్య ఘటనపై కేంద్ర ప్రభుత్వం మౌనం వహిస్తోందని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా విమర్శించింది. అమెరికా ఇజ్రాయెల్ దేశాలను అసంతృప్తిపరచకూడదనే ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోదీ స్పందించడం లేదని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు.

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి (కమ్యూనికేషన్స్ ఇన్‌చార్జ్) జైరాం రమేష్ శుక్రవారం సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, ఫిబ్రవరి 28, 2026న అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త సైనిక దాడిలో ఇరాన్ రాజ్యాంగపరమైన అధినేత అయిన అయతొల్లా అలీ ఖమేనీ హత్యకు గురయ్యారని పేర్కొన్నారు. ఇంత పెద్ద అంతర్జాతీయ ఘటన జరిగినప్పటికీ భారత ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక స్పందన వెలువడకపోవడం ఆశ్చర్యకరమని ఆయన అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కూడా ఈ అంశంపై ఇప్పటివరకు మౌనం పాటిస్తున్నారని విమర్శించారు.

ఇరాన్ గల్ఫ్ దేశాలపై చేసిన దాడులను భారత్ సరైన విధంగా ఖండించినప్పటికీ, మొదటగా అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్‌పై చేసిన దాడిపై మాత్రం కేంద్రం పూర్తిగా నిశ్శబ్దంగా ఉండటం ప్రశ్నార్థకమని జైరాం రమేష్ అన్నారు. ఈ ఏడాది భారత్ అధ్యక్షత వహిస్తున్న బ్రిక్స్+ వేదికలో ఇరాన్ కూడా భాగస్వామ్య దేశమని ఆయన గుర్తు చేశారు. అంతర్జాతీయ వేదికలపై సమతుల్యమైన విదేశాంగ విధానం పాటించాల్సిన భారత ప్రభుత్వం ఈ విషయంలో స్పష్టమైన వైఖరి తెలియజేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇరాన్‌కు సంబంధించిన గత ఘటనలను కూడా జైరాం రమేష్ ఉదాహరణగా ప్రస్తావించారు. 2024 మేలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రాహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించినప్పుడు కేంద్ర ప్రభుత్వం మే 21న దేశవ్యాప్తంగా ఒక రోజు సంతాప దినం ప్రకటించిందని ఆయన గుర్తు చేశారు. అలాగే జూలై 1న పార్లమెంట్ సమావేశమైనప్పుడు ఆయనకు అధికారికంగా నివాళి అర్పించిన విషయాన్ని కూడా ప్రస్తావించారు. అదే విధంగా ఇప్పుడు ఖమేనీ హత్య జరిగినప్పటికీ ప్రభుత్వం ఎందుకు స్పందించడంలేదని ఆయన ప్రశ్నించారు. ఆయనకు పార్లమెంటు ఉభయ సభల్లో ఎందుకు అధికారికంగా నివాళి అర్పించలేదు అని అన్నారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వంటి తన మిత్ర దేశాలను అసహనానికి గురిచేయకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ప్రధాని మోదీ మౌనం వహిస్తున్నారని కాంగ్రెస్ నేత వ్యాఖ్యానించారు.

ఇక పశ్చిమ ఆసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పార్లమెంట్ రెండు సభల్లో విస్తృత చర్చ జరపాలని ప్రతిపక్షం డిమాండ్ చేస్తోంది. అయితే కేంద్ర ప్రభుత్వం దీనికి అనుమతించడంలేదని కాంగ్రెస్ ఆరోపించింది. ప్రభుత్వం చర్చకు భయపడుతోందని కూడా కాంగ్రెస్ విమర్శించింది.

ఈ అంశంపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పార్లమెంట్‌లో చేసిన ప్రకటనపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ సభ్యులు రాజ్యసభ నుంచి వాక్‌ఔట్ చేయగా, లోక్‌సభలో కూడా నిరసన తెలిపారు. జైశంకర్ ఇచ్చిన ప్రకటనలో స్పష్టత లేదని, అది సరైన సమాధానం కాదని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. ప్రధాని మోదీ విదేశాంగ విధానం ‘అతివాద అడ్వెంచరిజం’ వైపు దారితీస్తోందని, అలాగే భారత విదేశాంగ సేవను బలహీనపరిచే చర్యల వల్ల దేశం ఇతర దేశాల ఆధీనంలోకి వెళ్లే ప్రమాదం ఉందని కాంగ్రెస్ ఆరోపించింది.

ఫిబ్రవరి 28న అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త సైనిక దాడిలో ఖమేనీ మరణించినట్టు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వెలువడిన నేపథ్యంలో పార్లమెంట్‌లో సుమోటు ప్రకటన చేసిన విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మాట్లాడుతూ, ప్రాంతంలోని అన్ని దేశాల సార్వభౌమత్వం, భౌగోళిక సమగ్రతను కాపాడాలని భారత్ మద్దతు ఇస్తుందని తెలిపారు. పశ్చిమ ఆసియాలో నెలకొన్న పరిస్థితులను కేంద్ర ప్రభుత్వం అత్యున్నత స్థాయిలో నిరంతరం పర్యవేక్షిస్తున్నదని చెప్పారు.

మానవతా కారణాల దృష్ట్యా ఇరాన్‌కు చెందిన ఒక నౌకను భారత పోర్టులో నిలిపేందుకు అనుమతించడం సరైన నిర్ణయమని జైశంకర్ పేర్కొన్నారు. అలాగే ఘర్షణ ప్రాంతాల్లో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తరలించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. ఇప్పటివరకు సుమారు 67 వేల మంది భారతీయులను సురక్షితంగా భారత్‌కు తీసుకొచ్చామని చెప్పారు.

భారతీయుల భద్రతతో పాటు దేశ ప్రయోజనాలు, ముఖ్యంగా ఇంధన భద్రత, వాణిజ్య ప్రయోజనాలు ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యతగా ఉంటాయని విదేశాంగ మంత్రి స్పష్టం చేశారు.