Let's talk: editor@tmv.in
ఖమేనీ మృతిపై భారత్ సంతాపం తెలిపి ఉండాల్సింది: శశి థరూర్

ఖమేనీ మృతిపై భారత్ సంతాపం తెలిపి ఉండాల్సింది: శశి థరూర్

Gaddamidi Naveen
21 మార్చి, 2026

ఇరాన్‌ సుప్రీంలీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీ హత్యకు గురైన నేపథ్యంలో, భారత్ సకాలంలో సంతాపం వ్యక్తం చేసి ఉంటే బాగుండేదని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ అభిప్రాయపడ్డారు. అమెరికా-ఇజ్రాయెల్ చర్యలను ఖండించకపోయినా, ఒక దేశాధినేత మృతిపై సానుభూతి తెలపడం దౌత్యపరంగా అత్యంత సముచితమైన చర్య అని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన, అంతర్జాతీయ వివాదాల సమయంలో ప్రభుత్వం సంయమనంతో వ్యవహరించాలని సూచించారు.

ఇలాంటి ఘర్షణల సమయంలో దేశం సమతుల్య దౌత్య విధానాన్ని అనుసరించాల్సిన అవసరం ఉందని అన్నారు. సంఘటన జరిగిన మొదటి రోజే ఖమేనీ మృతిపై భారత్ సంతాపం ప్రకటించి ఉండాల్సింది. ఆయన దేశంలో కీలక పాత్ర పోషించిన నాయకుడు కాబట్టి, అది సరైన, సముచిత చర్యగా ఉండేది అని తెలిపారు.

2024లో ఇరాన్ మాజీ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించినప్పుడు భారత్ వెంటనే సంతాపం ప్రకటించి, అధికారికంగా సంతాప దినాలను పాటించిన విషయాన్ని థరూర్ గుర్తుచేశారు. అదే విధంగా ఈ సందర్భంలో కూడా స్పందించి ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే, తరువాత ఢిల్లీలోని ఇరాన్ ఎంబసీ వద్ద ఏర్పాటు చేసిన కండోలెన్స్ బుక్‌లో భారత విదేశాంగ కార్యదర్శిని పంపడం ద్వారా సంతాపం వ్యక్తం చేయడం సానుకూల చర్యగా పేర్కొన్నారు.

సంతాపం, ఖండన మధ్య తేడాను కూడా థరూర్ వివరించారు. అమెరికా-ఇజ్రాయెల్ దాడిని రాజకీయ కారణాల వల్ల ఖండించకపోవచ్చు. కానీ సంతాపం అనేది బాధితులకు, వారి కుటుంబానికి, దేశ ప్రజలకు సానుభూతి తెలపడం మాత్రమే. ఇది మానవీయ స్పందన అని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ అధికారిక వైఖరితో తన వ్యాసాలు విభేదిస్తున్నాయన్న ప్రశ్నకు సమాధానమిస్తూ.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నైతిక వైఖరి తీసుకోవడం సులభమని, కానీ ప్రభుత్వం మాత్రం ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పనిచేయాలని చెప్పారు.నేను కాంగ్రెస్ ప్రభుత్వానికి సలహా ఇచ్చే స్థితిలో ఉన్నా, ఇప్పుడున్న పరిస్థితుల్లో సంయమనం పాటించాలనే చెబుతాను. సంయమనం అంటే లొంగిపోవడం కాదు, అది మన బలానికి నిదర్శనం. మన ప్రయోజనాలు ఏమిటో మనకు తెలుసని, వాటిని కాపాడుకుంటామని చెప్పే మార్గం అది అని థరూర్ స్పష్టం చేశారు. సోనియా గాంధీ, ఇతర ప్రతిపక్ష నేతలు తీసుకున్న నైతిక వైఖరిని తాను గౌరవిస్తానని, అయితే ప్రభుత్వం తన వ్యూహాత్మక ప్రయోజనాలను కాపాడుకుంటూనే దౌత్యపరమైన మర్యాదలను పాటించాలని ఆయన సూచించారు.

ఖమేనీ మృతిపై భారత్ సంతాపం తెలిపి ఉండాల్సింది: శశి థరూర్ - Tholi Paluku