Let's talk: editor@tmv.in
ఖమ్మంలో నిరుద్యోగుల నిరసన

ఖమ్మంలో నిరుద్యోగుల నిరసన

Aravind Maryada Reddy
26 సెప్టెంబర్, 2025

తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగుల్లో అసంతృప్తి పెరిగిపోతున్నది. నివురుగప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తి క్రమంగా బయటపడ్టట్టు కనిపిస్తోంది. తమకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని వారు ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఇప్పటి వరకు సోషల్ మీడియాలోనూ.. గుసగుసగా స్నేహితుల మధ్య చర్చించుకున్న ఉద్యోగార్థులు ఇప్పుడు రోడ్డెక్కుతున్నారు. తమ గోడును వినాలంటూ డిమాండ్ చేస్తున్నారు. నిజానికి తెలంగాణ ఉద్యమ సమయంలో నిరుద్యోగులకు నేతలు ఎన్నో ఆశలు కల్పించారు. ఇంటికో ఉద్యోగం అంటూ ఊదరగొట్టారు. కానీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక కూడా వారి కలలు సాకారం కాలేదు. ఉద్యోగాలు రాలేదు. దీంతో నిరుద్యోగుల గుండె మండింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించడంలో వారు భాగస్వాములయ్యారు. అప్పట్లో నిరుద్యోగులను కాంగ్రెస్ పార్టీ ఊరడించింది. తాము అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తామని హామీ ఇచ్చింది. కానీ రేవంత్ ముఖ్యమంత్రి అయ్యాక ఆ దిశగా అడుగులు పడటం లేదన్నది నిరుద్యోగుల ఆవేదన. జాబ్ క్యాలెండర్ ఎందుకు ఇవ్వడం లేదన్నది వారి నుంచి వస్తున్న ప్రశ్న. అయితే ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో నిరుద్యోగులు చేస్తున్న ఆందోళనలకు బీఆర్ఎస్ పార్టీ కూడా మద్దతు ఇస్తున్నట్టు కనిపిస్తోంది. ఇటీవల మానుకోటలో రోడ్డెక్కిన నిరుద్యోగులు తాజాగా ఖమ్మం జిల్లా కేంద్రంలో నిరసనకు దిగారు. మరి నిరుద్యోగుల సమస్యలు ఏమిటి? బీఆర్ఎస్ పాలనలో ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి? కాంగ్రెస్ పాలనలో పరిస్థితి ఏమిటి? అన్న అంశాలను ఈ కథనంలో తెలుసుకుందాం.

ఖమ్మంలో నిరసన

ఖమ్మం జిల్లాలో నిరుద్యోగులు పెద్దఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టారు. తక్షణమే 'జాబ్ క్యాలెండర్' విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన 'ఉద్యోగాల భర్తీ' హామీని ఎందుకు నెరవేర్చడం లేదని వారు ప్రశ్నించారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో ప్రధాన నినాదంగా వినిపించిన 'నీళ్లు, నిధులు, నియామకాలు'. వీటిలో నియామకాల అంశంపై మీద తీవ్ర అసంతృప్తి ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వ పదేళ్ల పాలనలో ఆశించిన స్థాయిలో జరగలేదన్నది నిరుద్యోగుల ప్రధాన ఆరోపణ. అందుకే నిరుద్యోగులకు కాంగ్రెస్ పార్టీ బలమైన హామీ ఇచ్చింది. అయితే ఉద్యోగాల హామీ నెరవేరే పరిస్థితి పెద్దగా కనిపించడం లేదు. నోటిఫికేషన్లు ఆశించిన స్థాయిలో లేవు.. పాత నోటిఫికేషన్లు పూర్తి చేసి నియామకపత్రాలు ఇచ్చారు.

బీఆర్ఎస్ పదేండ్లలో ఎన్ని ఇచ్చింది?

బీఆర్ఎస్ పాలిత పదేండ్లలో 1.60 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పుకుంటున్నది. అయితే ఆ స్థాయిలో ఉద్యోగ కల్పన జరగలేదన్నది నిరుద్యోగుల ఆరోపణ. బీఆర్ఎస్ భర్తీ చేశామని చెప్పుకుంటున్న ఉద్యోగాల్లో ఔట్ సోర్సింగ్ వంటి విభాగాలు ఉన్నాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అధికారంలో వచ్చాక మేము 60 వేలకు పైగా భర్తీ చేశామని చెప్పుకుంటోంది. అయితే ఈ 60 వేలల్లో ఎక్కువగా గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లే ఉన్నాయన్నది ఆరోపణ. పైగా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎందుకు విడుదల చేయడం లేదని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు.

2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది?

కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలో వచ్చాక రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చింది. అయితే ఇప్పటి వరకు ఆ స్థాయిలో ఉద్యోగాల కల్పన జరగడం లేదని నిరుద్యోగులు అంటున్నారు. సెప్టెంబర్ 2025 వరకు సుమారు 60 వేల ఉద్యోగాలు భర్తీ చేసినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇందులో 55 వేలు గ్రూప్-1, ఇతర విభాగాల్లో ఉన్నాయి. ముఖ్యమంత్రి మాటల్లో, "ఒక సంవత్సరంలో 60 వేల ఉద్యోగాలు భర్తీ చేసి దేశ రికార్డు సృష్టించాం" అని. అయితే బీఆర్ఎస్ పాలనలో విడుదలైన నోటిఫికేషన్లను కూడా కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకుంటున్నదని గులాబీ పార్టీ విమర్శిస్తోంది. 2026 మధ్య నాటికి 1 లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రభుత్వం చెబుతోంది.

నిరుద్యోగుల్లో ఆందోళన

తెలంగాణలో నిరుద్యోగ రేటు 10% పైగా ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వం భారీ నోటిఫికేషన్లు ఇవ్వడం లేదన్న విమర్శ వస్తోంది. హైదరాబాద్ దిల్ సుఖ్ నగర్ మెట్రో స్టేషన్ వద్ద కూడా కొద్ది రోజుల క్రితం ఆందోళనలు జరిగాయి.

'కట్టుబడి ఉన్నాం' అంటున్న ప్రభుత్వం

కాంగ్రెస్ నాయకులు "తాము ఇచ్చిన హామీకి, ఉద్యోగ కల్పనకు కట్టుబడి ఉన్నాం" అని చెబుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, "1 లక్ష ఉద్యోగాలు త్వరలో" అని హామీ ఇచ్చారు. కానీ, నోటిఫికేషన్లు రావడం లేదని విమర్శలు వరసగా వస్తున్నాయి. మొత్తంగా, తెలంగాణ నిరుద్యోగ సమస్య రాజకీయాలకు మించి ఆర్థిక-సామాజిక అంశం. ప్రస్తుతం ఉన్న ఉద్యోగాలకు వేతనాలు ఇవ్వడం, ప్రభుత్వ పథకాలు అమలు చేయడం తమ ప్రభుత్వానికి తలకుమించిన భారంగా మారిందని.. బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో కొత్త నియామకాలు చేపడితే ప్రభుత్వం మీద అదనపు భారం పడే అవకాశం ఉంది. అందుకే రేవంత్ రెడ్డి సర్కారు కాస్త వెనకుడుగు వేస్తున్నదా? అన్న విశ్లేషణ సాగుతోంది.

ఖమ్మంలో నిరుద్యోగుల నిరసన - Tholi Paluku