Let's talk: editor@tmv.in
ఖతార్, టర్కీ, సిరియాలోని భారతీయులకు కేంద్రం కీలక సూచనలు

ఖతార్, టర్కీ, సిరియాలోని భారతీయులకు కేంద్రం కీలక సూచనలు

Shaik Mohammad Shaffee
3 మార్చి, 2026

ఇరాన్ లక్ష్యంగా అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన మెరుపు దాడులతో పశ్చిమ ఆసియాలో యుద్ధ ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో ఖతార్, టర్కీ, సిరియా దేశాల్లో నివసిస్తున్న భారతీయ పౌరుల భద్రతపై కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఆయా దేశాల్లోని భారతీయులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు స్థానిక రాయబార కార్యాలయాలతో టచ్‌లో ఉండాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ భద్రతా మార్గదర్శకాలను జారీ చేసింది.

ఖతార్‌లో కాన్సులర్ సేవలు బంద్

పశ్చిమ ఆసియాలో మారుతున్న భద్రతా సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని ఖతార్ రాజధాని దోహాలోని భారత రాయబార కార్యాలయం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 2వ తేదీ సోమవారం నాడు సాధారణ కాన్సులర్ సేవలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన ఎంబసీ, అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారికి మాత్రం మినహాయింపునిచ్చింది. పాస్‌పోర్ట్, వీసా, అటెస్టేషన్, కార్మిక సమస్యలకు సంబంధించిన అత్యవసర సేవల కోసం ఎంబసీ అధికారులు నిరంతరం అందుబాటులో ఉంటారని స్పష్టం చేసింది. బాధితులు లేదా సహాయం కోరే వారు +974-55647502 హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫోన్ చేయవచ్చని లేదా cons.doha@mea.gov.in ఇమెయిల్ ద్వారా సంప్రదించవచ్చని సూచించింది. తాజా పరిణామాలు, అప్‌డేట్‌ల కోసం ప్రయాణికులు ఎంబసీకి చెందిన అధికారిక సోషల్ మీడియా ఖాతాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

టర్కీలో విమానాల మళ్లింపు.. ప్రయాణికులకు ఇబ్బందులు

టర్కీలోని ఇస్తాంబుల్ గ్రాండ్ ఎయిర్‌పోర్ట్, సబీహా గోక్సెన్ విమానాశ్రయాల్లో విమాన సర్వీసులు రద్దు కావడంతో పాటు పలు విమానాలు దారిమళ్లాయి. దీనివల్ల ఇబ్బందులు పడుతున్న భారతీయ ప్రయాణికులకు ఇస్తాంబుల్‌లోని భారత కాన్సులేట్ అండగా నిలుస్తోంది. ఎయిర్‌లైన్స్ సంస్థలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికులు విమానాశ్రయ అధికారుల సూచనలను తూచా తప్పకుండా పాటించాలని కోరారు. ఏదైనా అత్యవసర సాయం కోసం +90 541 238 5632 హెల్ప్‌లైన్ నంబర్‌ను సంప్రదించాలని అధికారులు సూచించారు.

సిరియాలో ‘అనవసర ప్రయాణాలు వద్దు’

పశ్చిమ ఆసియా ఉద్రిక్తతల సెగ సిరియాకు కూడా తాకడంతో డమాస్కస్‌లోని భారత రాయబార కార్యాలయం అప్రమత్తమైంది. అక్కడ నివసిస్తున్న భారతీయులు అనవసర ప్రయాణాలు మానుకోవాలని, భద్రతా మార్గదర్శకాలను పాటించాలని హెచ్చరించింది. ఏదైనా అత్యవసర సమాచారం లేదా సహాయం కోసం భారతీయులు +963-993385973 మొబైల్ నంబర్‌ను సంప్రదించవచ్చని తెలిపింది. మరిన్ని వివరాల కోసం ఎంబసీ అధికారిక వెబ్‌సైట్ https://coidamascus.gov.inని సందర్శించాలని లేదా cons.damascus@mea.gov.in ఇమెయిల్ ద్వారా సంప్రదించాలని కోరింది.