
ఖతార్లో అరబ్-ఇస్లామిక్ సదస్సు
ఖతార్ రాజధాని దోహాలో సోమవారం అరబ్-ఇస్లామిక్ సదస్సు ప్రారంభమైంది. ఈ సదస్సుకు ప్రపంచ వ్యాప్తంగా 50 ముస్లిం దేశాల నుంచి భారీ ఎత్తున నాయకులు, ప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఇజ్రాయెల్ దాడులు, పాలస్తీనా పరిస్థితులపై చర్చించడానికి ఈ సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఖతార్ ప్రధానమంత్రి షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్ రహ్మాన్ అల్ థానీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్ చర్యలు తమ దేశం గాజా యుద్ధాన్ని ఆపేందుకు సహకరించడం లేదని, ఈజిప్టు, అమెరికాతో కలిసి చేస్తున్న మధ్యవర్తిత్వ ప్రయత్నాలు ఫలితం ఇవ్వలేవని స్పష్టం చేశారు. ఇటీవల దోహాలో హమాస్ నేతలపై జరిగిన దాడి నేపథ్యంలో అల్ థానీ ఈ వ్యాఖ్యలు చేసినట్లు స్పష్టం అవుతోంది.
ఇజ్రాయెల్ దాడిని ఖండిస్తూ తీర్మానం
ఈ సదస్సు ఆయా దేశాలన్నీ కలిసి ఇజ్రాయెల్ దాడులను ఖండిస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించనున్నాయి. ఇజ్రాయెల్ దాడులు అస్థిరతను పెంచే విధంగా ఉన్నాయని ఖతార్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇజ్రాయెల్పై ఆర్థిక లేదా దౌత్యపరమైన చర్యల గురించి ఈ తీర్మానంలో ప్రస్తావించలేదు. పాకిస్థాన్ సహకారంతో నిర్వహిస్తున్న ఈ సదస్సులో పాక్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్, ఉప ప్రధాని ఇషాక్ దార్ కూడా పాల్గొంటున్నారు. ఇజ్రాయెల్ గాజాను ఆక్రమించడం, వెస్ట్ బ్యాంక్లో సెటిల్మెంట్ కార్యకలాపాలను విస్తరించడం, పాలస్తీనియన్లను బలవంతంగా వలస పంపడం వంటి చర్యల నేపథ్యంలో ఈ సదస్సు జరుగుతోంది. ఈ సమావేశంలో పాలస్తీనా రాష్ట్ర హోదా కోసం ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో చర్చించే అంశంపై కూడా నాయకులు దృష్టి సారించనున్నారు.
ఖతార్కు అండగా ముస్లిం దేశాలు
ఈ సదస్సుకు పలువురు కీలక వ్యక్తులు హాజరవుతారా లేదా అన్నదానిపై స్పష్టత రాలేదు. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్, ఇరాక్ ప్రధాని మహమ్మద్ షియా అల్ సుదానీ, టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్, పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ ఈ సదస్సులో పాల్గొంటున్నారు. సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ హాజరవుతారా అనేదానిపై స్పష్టత రాలేదు. ఆయన ఇటీవల ఖతార్ను సందర్శించి మద్దతు తెలిపారు. ఈ సదస్సు ప్రపంచానికి ముస్లిం దేశాలన్నీ ఖతార్కు మద్దతుగా నిలుస్తున్నాయన్న సందేశాన్ని ఇస్తుందని అరబ్ లీగ్ కార్యదర్శి అహ్మద్ అబౌల్ ఘైత్ తెలిపారు. గల్ఫ్ దేశాలు కూడా ఈ దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్తో సంబంధాలపై ఒత్తిడి ఎదుర్కొంటున్నాయి.
సందేశం సరే.. చర్యలు తీసుకోరా?
ఈ సదస్సును ప్రస్తుతం నెలకొన్న రాజకీయ, దౌత్యపరమైన పరిస్థితుల్లో కీలకమైన పరిణామంగా పరిగణించవచ్చు. ఇజ్రాయెల్ దాడులు, ముఖ్యంగా హమాస్ శాంతి బాటలో చర్చలు జరుపుతున్న దోహాలో జరిగిన వైమానిక దాడి, ప్రాంతీయ స్థిరత్వాన్ని దెబ్బతీసే చర్యగా భావిస్తున్నారు. ముస్లిం దేశాలన్నీ ఏకం కావడంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహులో కలవరం నెలకొంది. ఇప్పటికే ట్రంప్ నెతన్యాహు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖతార్ తమకు మిత్ర దేశమని, ఈ దాడిని తీవ్రంగా పరిగణిస్తున్నామని చెప్పారు. దీనికి ఇజ్రాయెల్ కూడా గట్టిగా సమాధానమిచ్చింది. బిన్ లాడెన్ హత్యను ప్రాస్తావించి, అమెరికా చేసిందే చేశామని స్పష్టం చేసింది. ఖతార్, ఈజిప్టు, అమెరికా మధ్యవర్తిత్వంలో గాజా యుద్ధాన్ని ఆపే ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఈ దాడి దౌత్యపరమైన సంక్షోభాన్ని సృష్టించింది. సదస్సులో 50కి పైగా దేశాల నాయకులు ఆందోళన వ్యక్తం చేయడం ఈ సమస్య తీవ్రతను సూచిస్తుంది. ఇజ్రాయెల్ చర్యలను ఖండిస్తూ తీర్మానం ఆమోదించడం ద్వారా అరబ్, ఇస్లామిక్ దేశాలు ఐక్యతను చాటేందుకు ప్రయత్నిస్తున్నాయి.
ఈ తీర్మానంలో ఇజ్రాయెల్పై ఆర్థిక, దౌత్యపరమైన చర్యల గురించి ప్రస్తావించకపోవడంతో ఇది కేవలం రాజకీయ సందేశంగా మిగిలిపోనుంది. పాకిస్థాన్ నేతృత్వంలో ఈ సదస్సు నిర్వహించడం, ఆ దేశ ప్రధాని, ఉప ప్రధాని హాజరవడం ఆసక్తికరంగా మారింది. దీంతోపాటు ఇరాన్, టర్కీ, ఇరాక్ వంటి దేశాల నాయకుల సహకారంతో ఇజ్రాయెల్పై ఒత్తిడిని పెంచే అవకాశం ఉంది. సౌదీ యువరాజు హాజరవకున్నా ఆయన ఇటీవల ఖతార్కు మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. ఈ సదస్సు ఐక్యరాజ్య సమితిలో పాలస్తీనా రాష్ట్ర హోదాపై చర్చలకు ఊతమిచ్చే అవకాశం ఉంది. గల్ఫ్ దేశాలు, ముఖ్యంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి ఇజ్రాయెల్తో ఒప్పందాలు కుదుర్చుకున్న దేశాలు ఈ సదస్సు ఫలితాలను ఎలా అమలు చేస్తాయనేది ఆసక్తికరంగా మారింది.
