Let's talk: editor@tmv.in
క్షేమంగా భారత్ చేరుకున్న పీవీ సింధు

క్షేమంగా భారత్ చేరుకున్న పీవీ సింధు

Shaik Mohammad Shaffee
4 మార్చి, 2026

పశ్చిమాసియాలో చెలరేగిన యుద్ధ జ్వాలల మధ్య చిక్కుకుపోయిన భారత బ్యాడ్మింటన్ స్టార్‌ పీవీ సింధు ఎట్టకేలకు క్షేమంగా స్వదేశానికి చేరుకున్నారు. మంగళవారం ఆమె బెంగళూరు చేరుకున్నట్లు సామాజిక మాధ్యమం 'ఎక్స్' వేదికగా వెల్లడించారు. "నేను క్షేమంగా బెంగళూరులోని నా ఇంటికి చేరుకున్నాను. గత కొన్ని రోజులు ఎంతో అనిశ్చితి, ఆందోళన మధ్య గడిచాయి. మళ్ళీ మా ఇంటికి రావడం చాలా సంతోషంగా ఉంది" అని సింధు భావోద్వేగంతో పేర్కొన్నారు. దుబాయ్‌లో విమాన సర్వీసులు నిలిచిపోవడంతో ఆమె గల్ఫ్ దేశంలోనే చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే.

యుద్ధ మేఘాల మధ్య ఉత్కంఠ భరిత క్షణాలు

ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు సింధు తన కోచ్ ఇర్వాన్‌స్యాతో కలిసి దుబాయ్ మీదుగా బర్మింగ్‌హామ్ వెళ్తుండగా యుద్ధం మొదలైంది. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేయడం, ప్రతిగా ఇరాన్ దాడులకు దిగడంతో గల్ఫ్ దేశాల్లో గగనతలం మూసివేశారు. "మామూలు జీవితం ఎంత సున్నితంగా ఉంటుందో ఇలాంటి సమయాల్లోనే తెలుస్తుంది. నేనున్న చోట సమీపంలోనే పేలుళ్లు సంభవించాయి. ఆ క్షణాలు ఎంతో భయానకంగా అనిపించాయి" అని సింధు తన చేదు అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. దుబాయ్‌లో విమానాశ్రయాలు మూతబడటంతో చేసేదేమీ లేక ఆమె ఆల్‌ ఇంగ్లాండ్‌ టోర్నీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.

సహాయం చేసిన వారికి కృతజ్ఞతలు

కష్టకాలంలో తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ సింధు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. దుబాయ్ అధికారులు, విమానాశ్రయ సిబ్బంది, ఇమ్మిగ్రేషన్ విభాగం వారు ప్రదర్శించిన వృత్తి నైపుణ్యం, సానుభూతి మాటల్లో చెప్పలేనివని కొనియాడారు. ప్రస్తుతానికి తనకు విశ్రాంతి అవసరమని, మనసును కుదుటపరుచుకున్న తర్వాతే తదుపరి క్రీడల గురించి ఆలోచిస్తానని ఆమె స్పష్టం చేశారు. దుబాయ్‌లో తనతో పాటు ఉన్న ఇండోనేషియా కోచ్ ఇర్వాన్‌స్యా ఆది ప్రతామ కూడా క్షేమంగా ఉన్నట్లు సమాచారం.