Let's talk: editor@tmv.in
క్షేత్రస్థాయిలో తీన్మార్ మల్లన్న దృష్టి

క్షేత్రస్థాయిలో తీన్మార్ మల్లన్న దృష్టి

T Venkata Ramana
14 అక్టోబర్, 2025

తెలంగాణలో తమ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు తీన్మార్ మల్లన్న కీలక అడుగులు వేశారు. పార్టీని క్షేత్రస్థాయి నుంచి పటిష్టం చేయడంలో భాగంగా తొలి విడతగా 9 జిల్లాలకు పార్టీ ఇంచార్జీలను నియమిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు పార్టీ కార్యాలయం నుంచి అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేశారు. నూతనంగా నియమితులైన జిల్లా ఇంచార్జీలు తక్షణమే బాధ్యతలు స్వీకరించి, తమ పరిధిలోని మండలాలు, గ్రామాల వారీగా పార్టీ కమిటీలను ఏర్పాటు చేయాలని తీన్మార్ మల్లన్న ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాలను సమన్వయం చేసుకుంటూ, ఎప్పటికప్పుడు రాష్ట్ర పార్టీ కార్యాలయానికి సమాచారం అందించాలని సూచించారు. రాష్ట్ర అధ్యక్షులు తీన్మార్ మల్లన్న ఆదేశాల మేరకు త్వరలోనే మిగిలిన జిల్లాలకు కూడా ఇంచార్జీలను నియమించి, పూర్తిస్థాయి కమిటీలను ప్రకటిస్తామని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

రంగా రెడ్డి జిల్లాకు సురగాని ప్రదేశ్ గౌడ్ , కరీంనగర్ -మాదారం శశి కుమార్ యాదవ్ , నల్గొండ - పటేల్ బాపూజీ యాదవ్, మెదక్ - శ్రీమతి జ్యోతి పెండేల, ఖమ్మం - కోకిసల కుమారబాబు,

మహబూబ్ నగర్ - సంగెం పర్వతయ్య, వరంగల్ - సలీమొద్దీన్ అహ్మద్ ముదిరాజ్, హైదరాబాద్ - వాసవి వెంకటేష్, ఆదిలాబాద్ - కొమ్ముల ప్రవీణ్ లను నియమించారు. ఈ నియామకాలతో క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకలాపాలు మరింత వేగవంతం అవుతాయని, ప్రజల సమస్యలపై రాజ్యాధికార పార్టీ బలంగా పోరాడుతుందని పార్టీ వర్గాలు ధీమా వ్యక్తం చేశాయి.

క్షేత్రస్థాయిలో తీన్మార్ మల్లన్న దృష్టి - Tholi Paluku