
క్వెట్టాలో పాకిస్తాన్ డ్రోన్ దాడి
పాకిస్తాన్ భద్రతా దళాలు మరోసారి రెచ్చిపోయాయి. అయితే ఈ దాడిని తాము బలోచిస్తాన్లోని ఉగ్రవాదులే లక్ష్యంగా చేశామన్నారు. కానీ ఈ దాడిలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.దీంతో బలోచిస్తాన్లో ప్రజలు అగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. శనివారం బలోచిస్తాన్ రాజధాని క్వెట్టా పరిసరాల్లోని హజర్‌గంజీ-చిల్తాన్ నేషనల్ పార్క్‌లో డ్రోన్ దాడి జరగడంతో ఆ ప్రాంతం రణరంగంలా మారింది. ఈ దాడిలో పిక్నిక్‌కు వచ్చిన తొమ్మిది మంది నిరాయుధ పౌరులు తీవ్రంగా గాయపడ్డారు.అయితే పాకిస్తాన్ సైన్యానికి చెందిన ఐఎస్పిఆర్ (ఇంటర్ సర్వీస్ పబ్లిక్ రిలేషన్స్) మాత్రం ఈ దాడిని ఇంటెలిజెన్స్ ఆధారిత ఆపరేషన్ అని సమర్థించుకుంటోంది. తమ లక్ష్యం ఉగ్రవాదులే అని, 14 మంది మిలిటెంట్లను నరకానికి పంపించాం అంటూ ప్రకటన విడుదల చేసింది. కానీ అక్కడి ప్రజలు మాత్రం దీనిని ఖండిస్తూ వారి లక్ష్యం ఉగ్రవాదులేమీ కాదు, సాధారణ పౌరులమే అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ ఘటన తర్వాత క్వెట్టా నగరంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో ప్రభుత్వం మొబైల్ ఇంటర్నెట్, డేటా సేవలను నిలిపివేసింది. పలు ప్రాంతాల్లో పోలీసులు, సైనికులు భారీగా మోహరించారు.
ప్రజల్లో ఆగ్రహం
దాడిలో గాయపడినవారి బంధువులు ఆస్పత్రుల వద్ద ఆందోళనలు చేపట్టారు. మనపైనే యుద్ధం చేస్తున్నారా? అంటూ నినాదాలు చేశారు. సోషల్ మీడియాలో పాకిస్థాన్ సైన్యానికి వ్యతిరేకంగా నెటిజన్లు మాట్లాడుతున్నారు. దీంతో ప్రభుత్వం ఇంటర్నెట్‌ను నిలిపేసింది. మరింత విమర్శలకు దారితీసింది.
స్థానిక పత్రికల కథనాలు
బలోచిస్తాన్ పోస్ట్, ట్రిబ్యూన్ పత్రికలు తెలిపిన ప్రకారం దాడి జరిగిన ప్రాంతం పూర్తిగా పర్యాటక స్థలం. అక్కడ కుటుంబాలతో కలిసి పిక్నిక్‌కి వచ్చినవారినే లక్ష్యంగా డ్రోన్ క్షిపణులు పడినట్లు తెలుస్తోంది. ఈ సంఘటన పాకిస్తాన్ సైన్యంపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తిందని నిపుణులు అంటున్నారు. ఉగ్రవాదులను అణచడానికి చేస్తున్న చర్యల్లో పౌరులే బలి అవుతున్నారు. బలోచిస్తాన్‌లో ఈ తరహా ఘటనలు గతంలోనూ జరగగా, ప్రతి సారి సైన్యం ఇంటలిజెన్స్ ఆపరేషన్ అని తప్పించుకుంటోంది.
