
క్వీర్ పిల్లలపై ఇళ్లు, పాఠశాలల్లోనే అధిక వివక్ష: సర్వే
ఎల్జీబీటీక్యూఐఏ+ సాధారణంగా చెప్పే పురుషుడు–స్త్రీ లేదా స్ట్రైట్ సంబంధాలకి భిన్నంగా ఉన్నారని భావించే వ్యక్తులందరికీ ఉపయోగించే సాధారణ పదమే(క్వీర్) పిల్లలు, టీనేజర్లు అత్యధికంగా వివక్ష, బుల్లీయింగ్(ఒక వ్యక్తిని పదేపదే మాటలతో, ప్రవర్తనతో లేదా శారీరకంగా వేధించడం, అవమానించడం, భయపెట్టడం)కు గురవుతున్నది తమ ఇళ్లలో, పాఠశాలల్లో, పరిసర ప్రాంతాల్లోనేనని తాజా సర్వే వెల్లడించింది. ఈ పరిస్థితి వారి చదువు, భవిష్యత్ ఉద్యోగాలు, ఆదాయ భద్రతపై తీవ్ర ప్రభావం చూపుతోందని సర్వే పేర్కొంది.
కోల్‌కతా కేంద్రంగా పనిచేసే ‘బ్రిడ్జ్’ సంస్థ అసోం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, నాగాలాండ్, ఒడిశా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో 900 మందికి పైగా ఎల్జీబీటీక్యూఐఏ+ వ్యక్తులపై నిర్వహించిన ఈ సర్వేలో, 12 నుంచి 15 ఏళ్ల మధ్య వయస్సులోనే ఎక్కువగా బుల్లీయింగ్ జరుగుతున్నట్లు తేలింది. వేధింపుల కారణంగా చాలామంది పిల్లలు మధ్యలోనే చదువు మానేస్తుండటంతో విద్యతో పాటు భవిష్యత్ ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారని బ్రిడ్జ్ వ్యవస్థాపక-డైరెక్టర్ ప్రిథ్వీరాజ్ నాథ్ తెలిపారు. 2018లో స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించకపోయినా, 2014 నల్సా తీర్పు, 2019 ట్రాన్స్‌జెండర్ రక్షణ చట్టం అమల్లో ఉన్నప్పటికీ, ఎల్జీబీటీక్యూఐఏ+ వ్యక్తులు విద్య, ఆరోగ్యం, ఉద్యోగాలు, ప్రజా జీవితంలో వ్యవస్థాగత వెలివేతను ఎదుర్కొంటూనే ఉన్నారని ఆయన అన్నారు.
ఎల్జీబీటీక్యూఐఏ+ హక్కుల సంస్థ ‘క్సొమొన్నోయ్’ వ్యవస్థాపకురాలు రుద్రాణి రాజకుమారి మాట్లాడుతూ, క్వీర్ పౌరులను పక్కన పెట్టి మానవ హక్కుల గురించి మాట్లాడలేమన్నారు. ప్రతి పిల్లవాడికి ఇంట్లో భద్రత, పాఠశాలలో గౌరవం, ఉద్యోగస్థలంలో గౌరవంతో జీవించే హక్కు ఉందని, సమానత్వం దయ కాదని రాజ్యాంగ హామీ అని ఆమె స్పష్టం చేశారు.
గువాహటి డిస్పూర్ కాలేజ్ రిటైర్డ్ ఉపాధ్యాయురాలు సునీత అగర్వాల్లా మాట్లాడుతూ తమ కళాశాలలో జెండర్-న్యూట్రల్ టాయిలెట్ ఏర్పాటు చేయడంతో పాటు ఎల్జీబీటీక్యూఐఏ+ విద్యార్థులకు సీట్ల కేటాయింపు, అవసరమైతే ఉచిత విద్య, అవగాహన కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. లలిత్ చంద్ర భారాలి కళాశాల అధ్యాపకురాలు కుంజలత బ్రహ్మ భాటిరి మాట్లాడుతూ, సమాజంలో మద్దతు పెరుగుతున్నప్పటికీ అన్ని స్థాయిల్లో సమిష్టి ప్రయత్నాలు అవసరమన్నారు. ప్రతి స్థాయిలో గౌరవంతో, స్వేచ్ఛగా జీవించే హక్కుపై అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు.
తేజ్పూర్ యూనివర్సిటీ సామాజిక సేవల విభాగం అధ్యాపకురాలు సామీ మాట్లాడుతూ ఈశాన్య భారతంలో క్వీర్-ఇన్‌క్లూజివ్ విద్య కోసం అనేక కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ, ద్వంద్వ సామాజిక ఆలోచనల కారణంగా నిర్మాణాత్మక ప్రతిఘటన ఎదురవుతోందన్నారు. క్వీర్ పిల్లలు, యువత నిరాశకు గురై ఆత్మహత్యల బాట పట్టకుండా ఉండేందుకు సురక్షిత వాతావరణం అత్యవసరమని ఆమె హెచ్చరించారు. పాఠశాల ఉపాధ్యాయులు, బీ.ఎడ్ శిక్షణార్థులకు ప్రత్యేక శిక్షణ, తల్లిదండ్రులతో అవగాహన కార్యక్రమాలు, స్థానిక భాషల్లో జెండర్, లైంగికతపై విద్యా సామగ్రి ప్రవేశపెట్టాలని నిపుణులు సూచించారు. విద్యా సంస్థలు, న్యాయ, పోలీస్, పరిపాలనా విభాగాల్లో తప్పనిసరి సెన్సిటైజేషన్ శిక్షణ అమలు చేయాలని వారు కోరారు.
