Let's talk: editor@tmv.in
క్వీన్స్‌లాండ్‌లో 16 ఏళ్లలోపు పిల్లలకు ఈ-బైక్‌లు, స్కూటర్ల నిషేధం

క్వీన్స్‌లాండ్‌లో 16 ఏళ్లలోపు పిల్లలకు ఈ-బైక్‌లు, స్కూటర్ల నిషేధం

Shaik Mohammad Shaffee
25 మార్చి, 2026

ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్ రాష్ట్రం ఎలక్ట్రానిక్ మొబిలిటీ పరికరాలైన ఈ-బైక్‌లు, ఈ-స్కూటర్ల వాడకంపై సంచలన నిర్ణయం తీసుకుంది. పెరుగుతున్న ప్రమాదాలను అరికట్టేందుకు 16 ఏళ్లలోపు పిల్లలు వీటిని నడపకుండా నిషేధం విధిస్తూ కొత్త భద్రతా చట్టాలను తీసుకువచ్చింది. ఈ-మొబిలిటీ భద్రతపై పార్లమెంటరీ కమిటీ చేసిన మొత్తం 28 సిఫార్సులను ప్రభుత్వం ఆమోదించింది. కొత్త నిబంధనల ప్రకారం, ఈ-బైక్ లేదా ఈ-స్కూటర్ నడపాలంటే కనీసం 'క్వీన్స్‌లాండ్ లెర్నర్ డ్రైవర్ లైసెన్స్' కలిగి ఉండాలి. ఈ లైసెన్స్ పొందేందుకు కనీస వయస్సు 16 ఏళ్లు కావడంతో, ఆటోమేటిక్‌గా అంతకంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు ఈ వాహనాలకు దూరం కానున్నారు. రోడ్డు నిబంధనలపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

ప్రమాదాల హెచ్చరిక.. కఠిన నిబంధనలు

గత ఏడాది (2025) గణాంకాలను పరిశీలిస్తే, క్వీన్స్‌లాండ్‌లో ఈ-మొబిలిటీ పరికరాల వల్ల జరిగిన ప్రమాదాల్లో 12 మంది ప్రాణాలు కోల్పోగా, సుమారు 6,300 మంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నిబంధనలను మరింత కఠినతరం చేసింది. ఇకపై ఫుట్‌పాత్‌లపై ఈ వాహనాలను నడిపేవారు గంటకు 10 కిలోమీటర్ల వేగాన్ని మించకూడదు. అంతేకాకుండా నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాహనాలను స్వాధీనం చేసుకుని, ధ్వంసం చేసే అదనపు అధికారాలను పోలీసులకు కల్పించారు. వాహనదారులకు యాదృచ్ఛికంగా 'బ్రీత్ అనలైజర్' పరీక్షలు నిర్వహించి, మద్యం సేవించి నడిపేవారిపై కఠిన చర్యలు తీసుకోనున్నారు.

డిజిటల్ వ్యసనం నుంచి విముక్తికై..

ఈ నిర్ణయంపై ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. నిరంతర సోషల్ మీడియా ఫీడ్స్, అల్గారిథమ్‌ల ఒత్తిడిలో పెరుగుతున్న పిల్లలకు అండగా నిలిచేందుకే ఈ మార్పులు చేశామని తెలిపారు. విద్యార్థులు తమ పాఠశాల సెలవుల్లో ఫోన్లకు పరిమితం కాకుండా, బయటి ప్రపంచంలో అర్థవంతంగా గడపాలని ఆయన సూచించారు. ఈ కొత్త చట్టాలు అటు ప్రాణాలను కాపాడటంతో పాటు, ఇటు పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.

క్వీన్స్‌లాండ్‌లో 16 ఏళ్లలోపు పిల్లలకు ఈ-బైక్‌లు, స్కూటర్ల నిషేధం - Tholi Paluku